Share News

ఆ ఇంటి మహాలక్ష్మి

ABN , Publish Date - Sep 21 , 2024 | 10:56 PM

ఆ ఇంట ఆమె మొదటి సంతాపం. పుట్టుకతోనే దివ్యాంగురాలు. అయితేనేం స్వయం ఉపాధితో ఆ కుటుంబాన్నే ఆదుకుంటున్న ధీర మహిళ. చేతులు, కాళ్లు చచ్చుబడి పోయి నడుము సహకరించకపోయినా బడ్డీ పెట్టుకుని ఆ సంపాదనతో ఇంటిని పోషిస్తోంది.. బుచ్చెయ్యపేట మండలం ఎల్‌.సింగవరం గ్రామానికి చెందిన రేణం రామలక్ష్మి. ఈ నెల 22న ప్రపంచ కుమార్తెల దినోత్సవం సందర్భంగా ఆమె గురించి తెలుసుకుందాం.

ఆ ఇంటి మహాలక్ష్మి
బడ్డీ నిర్వహిస్తున్న రామలక్ష్మి

దివ్యాంగురాలైనా ఆ కుటుంబానికి ఆమే పెద్ద దిక్కు

కాళ్లు, చేతులు, నడుము సహకరించకపోయినా బడ్డీ పెట్టుకుని కుటుంబ పోషణ

సోదరి కుటుంబానికి కూడా ఆసరా

ఎల్‌.సింగవరం గ్రామస్థుల అభిమానాన్ని పొందిన రామలక్ష్మి

నేడు ప్రపంచ కుమార్తెల దినోత్సవం సందర్భంగా..

బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 21: ఆ ఇంట ఆమె మొదటి సంతాపం. పుట్టుకతోనే దివ్యాంగురాలు. అయితేనేం స్వయం ఉపాధితో ఆ కుటుంబాన్నే ఆదుకుంటున్న ధీర మహిళ. చేతులు, కాళ్లు చచ్చుబడి పోయి నడుము సహకరించకపోయినా బడ్డీ పెట్టుకుని ఆ సంపాదనతో ఇంటిని పోషిస్తోంది.. బుచ్చెయ్యపేట మండలం ఎల్‌.సింగవరం గ్రామానికి చెందిన రేణం రామలక్ష్మి. ఈ నెల 22న ప్రపంచ కుమార్తెల దినోత్సవం సందర్భంగా ఆమె గురించి తెలుసుకుందాం.

బుచ్చెయ్యపేట మండలం, ఎల్‌.సింగవరం గ్రామానికి చెందిన రేణం రామునాయుడు, కాసులమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె రామలక్ష్మి (38) పుట్టుకతోనే దివ్యాంగురాలు. పోలియో వల్ల రెండు కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. నడుము నిటారుగా నిలవదు. అయినా స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివింది. ఆ తరువాత తండ్రిని ఒప్పించి గ్రామంలో బీఎన్‌ రోడ్డు పక్కన బడ్డీ ఏర్పాటు చేసి చిన్న వ్యాపారం ప్రారంభించింది. ఉదయం బడ్డీలో రామలక్ష్మిని కూర్చోబెట్టి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులకు వెళ్లేవారు. బడ్డీలో సిగరెట్లు, ఫ్యాన్సీ వస్తువులు, చిరుతినుబండారాలు విక్రయించగా వచ్చిన లాభాలతో కుటుంబ పోషణకు ఖర్చు చేసేది. 12 సంవత్సరాల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబ భారం రామలక్ష్మిపై పడింది. సోదరి మణికి వివాహం చేసింది. సోదరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆ తరువాత సోదరి భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో పిల్లలతో సహా పుట్టింటికి చేరింది. సోదరి కుటుంబానికి కూడా రామలక్ష్మి ఆసరాగా నిలిచింది. అందరినీ అన్నా అని ఆప్యాయంగా పిలిచే రామలక్ష్మి అంటే గ్రామస్థులకు ఎంతో అభిమానం. రోజువారీ సంపాదనతో కుటుంబాన్ని 20 సంవత్సరాలుగా రామలక్ష్మి పోషిస్తోంది. దివ్యాంగురాలు కావడంతో ఆమెకు వివాహం కాలేదు. అయినా ఆ ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచింది.

Updated Date - Sep 21 , 2024 | 10:56 PM