Share News

మహా మాయ

ABN , Publish Date - Feb 08 , 2024 | 01:37 AM

పారిశుధ్య కార్మికులు (అవుట్‌సోర్సింగ్‌) సమ్మెలో ఉన్నప్పుడు (17 రోజులు) ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం రూ.3.2 కోట్లు ఖర్చు చేసినట్టు జీవీఎంసీ పాలకులు లెక్కలు చూపించారు. ఈ మేరకు బిల్లుల చెల్లింపునకు స్టాండింగ్‌ కమిటీ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ సమావేశం బుధవారం జరిగింది.

మహా మాయ
మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న సభ్యులు

17 రోజుల పాటు కార్మికులు సమ్మెల్లో ఉన్నప్పుడు

పారిశుధ్య నిర్వహణకు రూ.3.2 కోట్లు ఖర్చయిందట

జీవీఎంసీ పాలకుల లెక్కలు...స్టాండింగ్‌ కమిటీ ఆమోదం

ఎన్నికల కోడ్‌ వస్తుందని ఏకబిగిన 141 అంశాలకు క్లియరెన్స్‌

మద్దిలపాలెం నుంచి ఆశీల్‌మెట్ట వరకూ రూ.2 కోట్ల్లతో రోడ్డు నిర్మాణం

విశాఖపట్నం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి):

పారిశుధ్య కార్మికులు (అవుట్‌సోర్సింగ్‌) సమ్మెలో ఉన్నప్పుడు (17 రోజులు) ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం రూ.3.2 కోట్లు ఖర్చు చేసినట్టు జీవీఎంసీ పాలకులు లెక్కలు చూపించారు. ఈ మేరకు బిల్లుల చెల్లింపునకు స్టాండింగ్‌ కమిటీ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఏ క్షణంలోనైనా ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చేస్తుందనే భావనతో అధికారులు సమావేశం ఎజెండాలో ఏకంగా 141 అంశాలను చేర్చేశారు. వీటన్నింటినీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించేయడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం డిసెంబరు 26 నుంచి జనవరి 12వ తేదీ వరకూ సమ్మె చేశారు. ఆ సమయంలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయంగా తాత్కాలిక కూలీలు, వాహనాలను ఏర్పాటుచేసినా కార్మికులు అడ్డుకున్నారు. నగరంలో ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయి పారిశుధ్యం మరీ క్షీణించడంతో కార్మికుల సమ్మె ముగియడానికి ముందు మూడు రోజులు మాత్రం కొంతమేర వాహనాలు, జేసీబీలతో చెత్తకుప్పలను తొలగించారు. అయితే సమ్మె కాలంలో తాత్కాలిక కూలీలు, జేసీబీలు, టిప్పర్లను ఏర్పాటుచేశామని, అందుకోసం రూ.3.2 కోట్లు ఖర్చు అయిందంటూ ప్రజారోగ్య విభాగం అధికారులు బిల్లు తయారుచేశారు. ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్లకు చెల్లించాలంటూ పలు కేటగిరీల కింద ప్రతిపాదనలు తయారుచేసి స్టాండింగ్‌ కమిటీ ఆమోదానికి పెట్టగా సభ్యులు ఒక్కరు కూడా అభ్యంతరం వ్యక్తంచేయకుండా ఆమోదించేసింది. అలాగే మద్దిలపాలెం జంక్షన్‌ నుంచి ఆశీల్‌మెట్ట జంక్షన్‌ వరకూ బీఆర్‌టీఎస్‌ రోడ్డుపై బీటీ హాట్‌మిక్స్‌ వేసేందుకు సుమారు రూ.రెండు కోట్లను ఖర్చు చేసేందుకు కమిటీ ఆమోదించింది. అలాగే బీచ్‌రోడ్డులోని మారిటైమ్‌ మ్యూజియం మరమ్మతులకు రూ.50 లక్షలు, ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి వివిధ వార్డుల్లో రూ.21.63 కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది.

Updated Date - Feb 08 , 2024 | 01:37 AM