మాచ్‌ఖండ్ రికార్డు
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:38 AM
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ఈ ఏడాది లక్ష్యాన్ని మించి విద్యుదుత్పత్తి జరిగిందని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ బి.శ్రీధర్ తెలిపారు.

లక్ష్యానికి మించి విద్యుదుత్పత్తి
626 మిలియన్ యూనిట్లకు 863.45 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి
సామర్థ్యం 150 మెగావాట్లకు పెంచేందుకు చర్యలు
సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ బి.శ్రీధర్.
సీలేరు, ఏఫ్రిల్ 2: సీలేరు కాంప్లెక్సు పరిధిలోని మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ఈ ఏడాది లక్ష్యాన్ని మించి విద్యుదుత్పత్తి జరిగిందని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ బి.శ్రీధర్ తెలిపారు. మంగళవారం ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూఏటా కేంద్ర విద్యుత్ అథారిటీ జలాశయాల నీటి నిల్వల ఆధారంగా విద్యుదుత్పత్తి లక్ష్యాలను నిర్దేశిస్తుందని 2023-24 ఆర్థిక సంవత్సరానికి మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి 626 మిలియన్ యూనిట్లు, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి 1,084 మిలియన్ యూనిట్లు, డొంకరాయి కేంద్రానికి 99.4 మిలియన్ యూనిట్లు, సీలేరు కేంద్రానికి 470 మిలియన్ యూనిట్లు లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. అయితే మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో 2023 ఏప్రిల్ ఒకటి నుంచి 2024 మార్చి 31 వరకు 626 మిలియన్ యూనిట్ల లక్ష్యానికి గాను 863.45 మిలియన్ యూనిట్లు అంటే 237.45 మిలియన్ యూనిట్లు లక్ష్యాన్ని మించి విద్యుదుత్పత్తి జరిగిందన్నారు. పొల్లూరు కేంద్రానికి 1084 మిలియన్ యూనిట్లు లక్ష్యం కాగా 1003.599 మిలియన్ యూనిట్లు (92.58) శాతం, డొంకరాయి కేంద్రంకు లక్ష్యం 99.4 మిలియన్ యూనిట్లకు 79.104 మిలియన్ యూనిట్లు విద్యుదుత్పత్తి (79.87 శాతం) జరిగిందన్నారు, సీలేరు జలవిద్యుత్ కేంద్రానికి 470 మిలియన్ యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించగా 361.6615 మిలియన్ యూనిట్ల (76.95 శాతం) శాతం చేరారన్నారు. జలవిద్యుత్ కేంద్రాల్లో గ్రిడ్ అధికారుల ఆదేశాల మేరకే ఉత్పత్తి జరుగుతుందని, ఈ ఏడాది సీలేరు కాంప్లెక్సులోని కేంద్రాలకు నీటిని సరఫరా చేసే బలిమెల జలాశయం పరీవాహక ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, గోదావరి డెల్టా రబీ పంటలకు నీటి విడుదల, వేసవిలో రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడం కోసం ఫిబ్రవరి 7 నుంచి మార్చి 10 వరకు సీలేరు, డొంకరాయి, పొల్లూరు కేంద్రాలో ఉత్పత్తిని నిలిపివేయాల్సి రావడంతో లక్ష్యాలు చేరుకోలేదన్నారు.
మాచ్‌ఖండ్ సామర్థ్యం పెంపునకు చర్యలు
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం సామర్థ్యం నుంచి 120 మెగావాట్ల నుంచి 150 మెగావాట్లకు పెంచేందుకు జెన్‌కో, ఒడిశా ఏహెచ్‌పీసీ అధికారుల ఆదేశా మేరకు కేంద్రంలోని ఆరు యూనిట్లకు గాను 5 యూనిట్లకు ఆర్‌ఎల్‌ఏ స్టడీ నిర్వహించామన్నారు. ఆధునిక యంత్రాలను అమర్చి సామర్థ్యం పెంపునకు సిదం చేస్తామన్నారు.
శరవేగంగా పొల్లూరు పనులు
పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో 115 మెగావాట్ల సామర్థ్యం గల 5,6 యూనిట్ల పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఈ పనులకు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పెన్‌స్టా పైపులైన్‌కు సంబంధించిన పైపుల బెండింగ్, ఎరక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని సీఈ శ్రీధర్ తెలిపారు. పొల్లూరులో రెండు యూనిట్లు వినియోగంలోకి వస్తే సీలేరు కాంప్లెక్సు ఖాతాలో అదనంగా 230 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేరుతుందన్నారు.