Share News

ఖాజీపాలెం సచివాలయానికి తాళాలు

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:56 PM

గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో వుండాలన్న ప్రభుత్వ ఆదేశాలను మండలంలోని ఖాజీపాలెం సచివాలయం ఉద్యోగులు బేఖాతరు చేస్తున్నారు. విధులకు సరిగా హాజరుకాకపోవడం, ఒకవేళ వచ్చినా.. కొద్దిసేపు వుండి బయటకు వెళ్లిపోవడం ఆనవాయితీగా మారింది.

ఖాజీపాలెం సచివాలయానికి తాళాలు
ఒక్క ఉద్యోగి కూడా లేని ఖాజీపాలెం సచివాలయం

ఉదయం గంటపాటు ఉండి వెళ్లిపోయిన మహిళా పోలీసు

ఆచూకీ లేని వెల్ఫేర్‌, డిజిటల్‌ అసిస్టెంట్లు

క్షేత్రస్థాయి విధుల్లో వెల్‌నెస్‌ సెంటర్‌ అధికారి

సెలవులో పంచాయతీ సెక్రటరీ

అచ్యుతాపురం, ఫిబ్రవరి 13: గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో వుండాలన్న ప్రభుత్వ ఆదేశాలను మండలంలోని ఖాజీపాలెం సచివాలయం ఉద్యోగులు బేఖాతరు చేస్తున్నారు. విధులకు సరిగా హాజరుకాకపోవడం, ఒకవేళ వచ్చినా.. కొద్దిసేపు వుండి బయటకు వెళ్లిపోవడం ఆనవాయితీగా మారింది. దీంతో వివిధ పనుల నిమిత్తం సచివాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఖాజీపాలెం గ్రామ సచివాలయంలో వివిధ విభాగాలకు సంబంధించి 11 మంది ఉద్యోగులు వున్నారు. మంగళవారం ఉదయం పది గంటలకు మహిళా పోలీస్‌ వానీషా వచ్చి కార్యాలయం తాళాలు తీశారు. ఆమె జగ్గన్నపేట సచివాలయంలో విధులు కూడా అప్పగించారు. మరో గంట వరకు సిబ్బంది ఎవరూ రాలేదు. దీంతో ఆమె 11 గంటలకు ఖాజీపాలెం సచివాలయానికి తాళాలు వేసి జగ్గన్నపేట సచివాలయానికి వెళ్లిపోయారు. ఇంజనీరింగ్‌ అసిసెంట్‌ గౌస్‌ గ్రామ సచివాలయం భవనం పనిపై అచ్యుతాపురం వెళ్లారు. వెల్‌నెస్‌ సెంటర్‌ అధికారి ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి వైద్య సేవలు నిమిత్తం బయటకు వెళ్లిపోయారు. వ్యవసాయ సహాయకుని పోస్టు ఖాళీగా ఉంది. పంచాయతీ కార్యదర్శి సెలవు పెట్టారు. ఏఎన్‌ఎం శిక్షణలో వున్నారు. వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ నరేశ్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌ ఎందుకు రాలేదో తెలియదు. వివిధ పనులపై వచ్చిన వారు సచివాలయానికి తాళం వేసి వుండడంతో తిరిగి వెళ్లిపోయారు.

Updated Date - Feb 13 , 2024 | 11:56 PM