Share News

కలిసి మెలిసి పనిచేసుకుందాం...

ABN , Publish Date - Jun 07 , 2024 | 01:08 AM

గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)లో పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

కలిసి మెలిసి పనిచేసుకుందాం...

టీడీపీ కార్పొరేటర్లకు వైసీపీ పాలకవర్గం పెద్దల ప్రతిపాదన

డిప్యూటీ మేయర్‌ పదవితోపాటు స్టాండింగ్‌ కమిటీలో నలుగురికి అవకాశం ఇస్తామని ఆఫర్‌

టీడీపీలోచేరేందుకు పలువురు వైసీపీ కార్పొరేటర్లు సిద్ధం

జీవీఎంసీ పాలకవర్గం నేతలు, కార్పొరేటర్లలో గుబులు

మేయర్‌ పీఠాన్ని కాపాడుకునేందుకు యత్నాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘కార్పొరేషన్‌లో అందరం కలిసి పనిచేసుకుందాం...మేయర్‌ను మార్చేందుకు ప్రయత్నాలు చెయ్యొద్దు. మునిసిపల్‌ చట్టం ప్రకారం నాలుగేళ్ల పదవీకాలం పూర్తయ్యేంత వరకూ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి కాస్త ఆలోచించండి.’

- ఇదీ జీవీఎంసీ పాలకవర్గంలోని పెద్దలు ఇద్దరూ టీడీపీలోని ముఖ్య కార్పొరేటర్లకు చేసిన ప్రతిపాదన.

...ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయాన్ని సాధించింది. వైసీపీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)లో పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని టీడీపీలో చేరాలని భావిస్తున్నారు.

జీవీఎంసీకి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. వైసీపీ 59 వార్డులను గెలుచుకోగా, టీడీపీ 30, జనసేన మూడు, సీపీఐ, సీపీఎం, బీజేపీ నుంచి ఒక్కొక్కరు, ఇండిపెండెంట్లు నలుగురు కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ముగ్గురు టీడీపీ కార్పొరేటర్లు వైసీపీకి మద్దతు ప్రకటించగా, ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరు జనసేనలో చేరారు. ఇదిలావుండగా నగర పాలక సంస్థల్లో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కనీసం నాలుగేళ్ల పదవీ కాలం పూర్తికావాలని, అదేవిధంగా జోన్ల వారీగా కాకుండా కార్పొరేటర్లు అందరూ కలిసి స్టాండింగ్‌ కమిటీ సభ్యులను ఎన్నుకునేలా మునిసిపల్‌ చట్టాన్ని మార్చుతూ వైసీపీ ప్రభుత్వం గెజిట్‌ జారీచేసింది. అయితే ఇటీవల ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో వైసీపీ కార్పొరేటర్లు పలువురు టీడీపీ, జనసేనల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు నగర పాలక సంస్థలు, మునిసిపాలిటీల్లో కూడా వలసలు ఉండే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మునిసిపల్‌ చట్టాన్ని సవరించి నాలుగేళ్లలోపు అవిశ్వాస తీర్మానం పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తే నగర మేయర్‌ పదవి కోల్పోయే అవకాశం ఉంది. తమ కార్పొరేటర్లు పార్టీ మారబోతున్నారనే సమాచారం తెలిసి జీవీఎంసీ పాలకవర్గంలోని వైసీపీ పెద్దలు అప్రమత్తమయ్యారు. టీడీపీలోని కీలక కార్పొరేటర్లకు ఇద్దరు నాయకులు ఫోన్‌ చేసి రాజీ ప్రతిపాదనలు చేస్తున్నారు. మేయర్‌ పదవికి ఇబ్బంది కలిగించకుండా ఉంటే డిప్యూటీ మేయర్‌ పదవితోపాటు స్టాండింగ్‌ కమిటీలో నలుగురికి స్థానం కల్పిస్తామని ప్రతిపాదించినట్టు తెలిసింది. దీనికి టీడీపీ నేతలు ససేమిరా అన్నట్టు తెలిసింది.

Updated Date - Jun 07 , 2024 | 01:08 AM