Share News

మాట్లాడదాం రండి!

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:57 AM

పొత్తుల కారణంగా వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కని టీడీపీ సీనియర్లు బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జీను బుజ్జగించేం దుకు అధిష్ఠానం రంగంలోకి దిగింది.

మాట్లాడదాం రండి!

బండారు, గండి బాబ్జీలకు టీడీపీ అధిష్ఠానం పిలుపు

బండారుతో వెలగపూడి, గణబాబు మంతనాలు

బాబ్జీతో భేటీ అయిన శ్రీభరత్‌

విశాఖపట్నం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి):

పొత్తుల కారణంగా వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కని టీడీపీ సీనియర్లు బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జీను బుజ్జగించేం దుకు అధిష్ఠానం రంగంలోకి దిగింది. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత బండారు సత్యనారాయణమూర్తిని హైదరాబాద్‌లోని అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో భేటీకీ రావాలని పిలుపువచ్చింది. పొత్తుల కారణంగా పెందు ర్తి సీటు జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబుకు కేటాయిం చారు. దీంతో బండారు అసంతృప్తి వ్యక్తంచేయడం తోపాటు ఆయన అనుచరులు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యం లో అధిష్ఠానం రంగంలోకి దిగి బండారు సత్యనారాయణమూర్తితో చర్చించేందుకు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి.గణబాబును పంపారు. ఇరువురు నాయకులు బండారుతో ఆయన నివాసం వెన్నెలపాలెంలో సమావేశమై చంద్రబాబు చెప్పిన పలు వివరాలు నివేదించారు. ఈ సందర్భంగా బండారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ అప్పగించిన ప్రతిచోటకు వెళ్లి అక్కడ నాయకులతో మాట్లాడడం, సమావేశాలు నిర్వహించానని గుర్తుచేశారు. తన వరకు చూస్తే ఇవే చివరి ఎన్నికలని పేర్కొంటూ ఇప్పటివరకు తనతోపాటు కుమారుడు, కుటుంబంమొత్తం పార్టీకే పని చేశామన్నారు. ఈ దశలో బండారుకు వెలగపూడి, గణబాబు సర్దిచెప్పే ప్రయత్నంచేసి శనివారం హైదరాబాద్‌ వెళ్లాలని కోరారు. అయితే తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు తెలిసింది. కాగా విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్‌కు కేటాయించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల సీటు పైలా ప్రసాదరావుకు ఇచ్చారు. దీంతో ఖిన్నుడైన టీడీపీ దక్షిణ ఇన్‌చార్జి గండి బాబ్జీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన అధిష్ఠానం, వెంటనే బాబ్జీతో మాట్లాడాలని విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌కు సూచించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బాబ్జీతో శ్రీభరత్‌ భేటీ అయ్యారు. పొత్తుల కారణంగా సీటు దక్కలేదని, దక్షిణ ఇన్‌చార్జిగా కొనసాగాలని సూచించారు. పార్టీపరంగా ప్రాధాన్యత ఉంటుందని చెబుతూ శనివారం విజయవాడ రావాలని కోరారు. అధినేత, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలిసి మాట్లాడాలని సూచించారు. బాబ్జీ కూడా తన అనుచరులతో మాట్లాడి ఏ విషయం చెబుతానని, ఇందుకోసం ఒక రోజు సమయం కావాలని కోరారు.

Updated Date - Mar 16 , 2024 | 12:57 AM