Share News

ఆ భూములు ఎలాగైనా అమ్మేద్దాం!

ABN , Publish Date - Jan 12 , 2024 | 01:09 AM

మధ్య తరగతి ప్రజలకు ఫ్లాట్లు (రాజీవ్‌ స్వగృహ) నిర్మించి ఇవ్వడానికి కేటాయించిన భూమిని ఏదో విధంగా అమ్మేసి సొమ్ము చేసుకోవాలని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది.

ఆ భూములు  ఎలాగైనా అమ్మేద్దాం!

‘రాజీవ్‌ స్వగృహ’ భూముల వేలానికి మరోమారు ప్రకటన

గతంలో డిపాజిట్‌ రూ.5 కోట్లు..ఇప్పుడు రూ.కోటి మాత్రమే

నాడు ఏడే ప్లాట్లు...నేడు 76 ప్లాట్లు

అప్‌సెట్‌ ధర గజం రూ.60 వేలు

దరఖాస్తుల స్వీకరణకు 30 వరకూ గడువు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మధ్య తరగతి ప్రజలకు ఫ్లాట్లు (రాజీవ్‌ స్వగృహ) నిర్మించి ఇవ్వడానికి కేటాయించిన భూమిని ఏదో విధంగా అమ్మేసి సొమ్ము చేసుకోవాలని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది. విశాఖలో భూములంటే ఎగబడి కొనేస్తారని భావించి ప్రకటనలు గుప్పించింది. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా విక్రయిస్తే అనుమానాలు వస్తాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ (స్టీల్‌ మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ)కు వేలం నిర్వహణ బాధ్యతలు అప్పగించింది.

రాజీవ్‌ స్వగృహ ప్రాజెక్టు కోసం ఎండాడ సర్వే నంబర్‌ 16లో వైఎస్‌ హయాంలో భూమి కేటాయించారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. అక్కడ ఇటీవల కాలంలో నిర్మించిన భారీ ప్రాజెక్టుల వల్ల రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ రావడంతో...ఖాళీగా ఉన్న ఆ భూమిని గంపగుత్తగా ఎకరాల చొప్పున అమ్మడానికి వైసీపీ ప్రభుత్వం యత్నించింది. సుమారు 48 ఎకరాల భూమిని కేవలం ఏడు ప్లాట్లుగా విభజించి వేలానికి పెట్టింది. దరఖాస్తుదారులు డిపాజిట్‌గా కనీసం రూ.5 కోట్లు చెల్లించాలనే షరతు విధించారు. ఒక్కో ప్లాటు కనీస విస్తీర్ణం ఐదు ఎకరాలకు తక్కువ లేకుండా వేశారు. ఈ లెక్కన గజం రూ.70 వేలు చొప్పున కొనుగోలు చేసినా ఐదు ఎకరాల ప్లాటుకు రూ.170 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి కల్పించారు. అంత భారీగా తెల్లధనం (వైట్‌ మనీ) పెట్టి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఒక్క దరఖాస్తు రాలేదు. రెండు, మూడుసార్లు ప్రయత్నాలు చేశారు. గత నెలలో కూడా ప్రకటన ఇచ్చి డిసెంబరు 27 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచ్చారు. పెద్దగా ఫలితం కనిపించలేదు. వాస్తవానికి ఈ భూమి వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌లో రెసిడెన్షియల్‌ జోన్‌లో ఉండగా వ్యాపారులు అమ్ముకోవడానికి వీలుగా మిక్స్‌డ్‌ జోన్‌ (వ్యాపారాలకు అనువుగా)లోకి మార్చారు.

విస్తీర్ణం తగ్గించి...ప్లాట్లు పెంచారు

పెద్ద పెద్ద ప్లాట్లు వేయడం వల్ల ఎవరూ ముందుకు రావడం లేదని గ్రహించి రూటు మార్చారు. 48 ఎకరాల భూమిని ఈసారి 76 ప్లాట్లుగా విభజించారు. మూడు వేల గజాల మొదలుకొని పది వేల గజాల వరకు ప్లాట్లుగా విభజించారు. అప్‌సెట్‌ ధర కూడా తగ్గించారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ రిజిసే్ట్రషన్‌ ధర గజం రూ.50 వేలు ఉండగా, రాజీవ్‌ స్వగృహ అధికారులు ఇప్పుడు అప్‌సెట్‌ ధర గజం రూ.60 వేలుగా నిర్ణయించారు. అక్కడ నుంచి ఎవరు ఎక్కువ ధర పెట్టడానికి ముందుకువస్తే వారికి ప్లాట్లు ఇస్తారు. వేలంలో పాల్గొనే వారు ఇప్పుడు కోటి రూపాయలు డిపాజిట్‌గా చెల్లిస్తే సరిపోతుందని నిబంధన మార్చారు. రాజీవ్‌ స్వగృహకు ఈ భూమి కేటాయించినప్పుడు అంతా కొండ ప్రాంతం. మొదట్లో కొండను తవ్వి పైకి రహదారి నిర్మించడానికి రూ.20 కోట్లు వెచ్చించారు. తాజాగా దీనిని లేఅవుట్‌గా మార్చినప్పుడు మరో రూ.10 కోట్లు పెట్టి రహదారులు, కాలువలు నిర్మించారు. మొత్తంగా దీనిపై రూ.30 కోట్లు పెట్టారు. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటే అదే స్థితిలో విక్రయిస్తామనే విధానంలో వేలానికి పెట్టారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30 వరకు గడువు ఇచ్చారు. 31వ తేదీన ఆన్‌లైన్‌లో వేలం పెడతారు. ఈసారి ఎలాంటి ఆదరణ వస్తుందో చూడాలి. ఇంకో రెండు నెలల్లో ఎన్నికల ప్రకటన వస్తుంది. ఇటువంటి సమయంలో ఈ భూమి వేలానికి ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాల్సి ఉంది.

Updated Date - Jan 12 , 2024 | 01:09 AM