Share News

అడుగంటుతున్న భూగర్భ జలాలు

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:56 AM

నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.

అడుగంటుతున్న భూగర్భ జలాలు

  • ఎండాడ, రుషికొండ, మధురవాడ, ఆరిలోవ ప్రాంతాల్లో ఆందోళనకరం

  • 17 నుంచి 19.71 మీటర్ల లోతులో జలాలు

  • గాజువాక, సీతమ్మధారల్లోనూ ప్రమాద ఘంటికలు

  • గ్రామీణ ప్రాంతాల్లోనూ తగ్గిన నీటి మట్టాలు

  • వర్షాభావమే కారణం

  • మరోవైపు విచ్చలవిడిగా నీటి వినియోగం

  • పొదుపుగా వాడుకోవాలని సూచనలు

  • ప్రతి ఇలు/అపార్టుమెంటు ఆవరణలో ఇంకుడుగుంత ఏర్పాటుచేసుకోవాలి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి):

నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గత ఏడాది నైరుతి సీజన్‌, అలాగే ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో కూడా వర్షాలు తక్కువగా కురిశాయి. ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లా సగటు 6.61 మీటర్లు కాగా మార్చి నాటికి 9.06 మీటర్లకు పడిపోయింది. ఈ నెల (ఏప్రిల్‌)లో నీటి మట్టాలు మరింత పడిపోయే అవకాశం ఉంది.

తీవ్ర ఒత్తిడిలో ఎండాడ ప్రాంతం

నగర జనాభా 25 లక్షలు దాటింది. జనాభాకు తగినంత నీటిని జీవీఎంసీ సరఫరా చేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో రోజువారీ అవసరాలకు సామాన్య ప్రజలు, వాణిజ్య కార్యకలాపాలకు వ్యాపారులు భూగర్భ జలాలపై ఆధారపడుతున్నారు. దీనికితోడు నగర శివారులో ఎండాడ, రుషికొండ, మధురవాడ, కొమ్మాది, పీఎం పాలెం ప్రాంతాల్లో ఆకాశ హార్మ్యాలు రావడంతో వందల మీటర్ల లోతుకు బోర్లు వేసి నీటిని తోడుతున్నారు. నీటి వినియోగంపై నియంత్రణ లేకపోవడం, వాడిన నీటిని తిరిగి ఇతర అవసరాలకు వినియోగించకపోవడం వంటి కారణాలతో రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కంబాలకొండ పరిసరాల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం కూడా ఇందుకు ఒక కారణంగా భూగర్భ జల నిపుణులు పేర్కొంటున్నారు.

ఎండాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిసరాల్లో మార్చి నెల నాటికి భూగర్భ జలాలు 19.71 మీటర్ల లోతున ఉన్నాయి. ఈ ప్రాంతంలో వందలాది బోర్లు నిరంతరం పనిచేస్తుంటాయి. అలాగే పెదరుషికొండ ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో గత ఏడాది ఫిబ్రవరిలో 15.63 మీటర్లు ఉండగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో 16.18 మీటర్ల మేర ఉన్నాయి. ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో గత ఏడాది ఫిబ్రవరిలో 12.9 మీటర్లు ఉండగా, ఈ ఏడాది 14.79 మీటర్లు, మధురవాడలో గత ఏడాది 5.92 మీటర్లు ఉండగా, ఈ ఏడాది 14.52 మీటర్ల లోతులో ఉన్నాయి. మధురవాడ ప్రాంతంలో చెరువులు, గెడ్డలు కబ్జా లేదా పూడ్చేయడంతో వర్షపు నీరు ఇంకే పరిస్థితి లేకుండా పోయింది. ఇక నగరంలో సీతమ్మధార, మహారాణిపేట, దసపల్లా హిల్స్‌, సీబీఎం కాంపౌండ్‌ తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.

పది మీటర్ల కంటే ఎక్కువ లోతు ఉన్న ప్రాంతాలు

జిల్లాలో 31 ప్రాంతాల్లో ప్యూజో మీటర్లు ఉండగా మార్చి నెల నాటికి 12 చోట్ల 10 మీటర్లు, అంతకంటే ఎక్కువ లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఎండాడలో 19.71 మీటర్లు, పెదరుషికొండలో 19.24, మఽధురవాడలో 18.37, ఆరిలోవలో 17.66 మీటర్లు, సెంట్రల్‌ పార్కు వద్ద 15.43, గాజువాకలో 12.58, సీతమ్మధారలో 12.17, పెందుర్తిలో 12.14, మారికవలసలో 11.46, పందులపాక (ఆనందపురం మండలం)లో 11.25, వెల్లంకిలో 10.72, అన్నవరం (పద్మనాభం)లో 10.37 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. అయితే రానున్న వారం, పది రోజుల్లో వర్షాలు పడకపోతే భూగర్భ జల మట్టాలు మరింతగా పడిపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు.

నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వండి

శ్రీనివాసరావు, డీడీ, భూగర్భ జల శాఖ

నగరం, పరిసర ప్రాంతాల్లో జనాభా పెరగడంతో భూగర్భ జలాల వినియోగం పెరిగింది. రోజువారీ అవసరాలకు జీవీఎంసీ సరఫరా చేస్తున్న నీటికి అదనంగా నగరవాసులు బోర్లుపై ఆధారపడుతున్నారు. గత ఏడాది వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగింది. దీంతో కొన్నిచోట్ల బాగా అడుగంటిపోయాయి. ఈ నేపథ్యంలో నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి ఇలు/అపార్టుమెంటు ఆవరణలో ఇంకుడుగుంతలు ఏర్పాటుచేయాలి. నీటి రీసైక్లింగ్‌ విధానం అమలుచేయాలి. నగర పరిసరాల్లో కొండలు చుట్టూ కందకాలు తవ్వాలి. వాగులు, గెడ్డలకు చెక్‌డ్యామ్‌లు నిర్మించాలి. డబ్బు మాదిరిగానే నీటి వినియోగంలో అంతే పొదుపు, జాగ్రత్తలు పాటించాలి.

Updated Date - Apr 26 , 2024 | 12:56 AM