Share News

చట్టం...చట్రం

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:58 AM

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా కీలకం. ప్రజల ఎన్నుకునే ప్రభుత్వానికి ఓ మార్గం. ఏ ఎన్నికలైనా ప్రజాభిప్రాయాన్ని వంద శాతం ప్రతిబింబించేలా ఉండాలి.

చట్టం...చట్రం

ఎన్నికల వేళ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే

అతిక్రమిస్తే శిక్ష ఎదుర్కోవాల్సి రావచ్చు

తెలిసి జరిగినా...తెలియక జరిగినా బాధ్యులు అభ్యర్థులే

మీతోపాటు అనుచరులనూ అప్రమత్తంగా ఉంచాలి

కోడ్‌ అమలులో ఉండగా కమిషన్‌ కనుసన్నల్లోనే అన్నీ

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా కీలకం. ప్రజల ఎన్నుకునే ప్రభుత్వానికి ఓ మార్గం. ఏ ఎన్నికలైనా ప్రజాభిప్రాయాన్ని వంద శాతం ప్రతిబింబించేలా ఉండాలి. ఇందుకు నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ జరగాలి. అలా జరిగేందుకు రాజ్యాంగం ఏర్పాటుచేసిన వ్యవస్థే కేంద్ర ఎన్నికల సంఘం. దీనికి అనుబంధంగా రాష్ట్ర స్థాయి కమిషన్‌లు ఉంటాయి. దేశంలో జరిగే ఏ స్థాయి ఎన్నికలైనా ఎన్నికల సంఘం ప్రత్యక్ష, పరోక్ష అజమాయిషీలోనే జరుగుతాయి. అందువల్ల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన మరుక్షణం వ్యవస్థలన్నీ ఎన్నికల సంఘం పరిధిలోకి వెళతాయి. ఈసీ కనుసన్నల్లోనే నడుచుకోవాల్సి ఉంటుంది. అందువల్ల కోడ్‌ అమలులో ఉండగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎంత జాగ్రత్తగా ఉంటే వారి భవిష్యత్తుకు అంత మంచిది.

సార్వత్రిక ఎన్నికలు ఐదేళ్లకొకసారి నిర్వహించాలని రాజ్యాంగం నిర్దేశించింది. అనివార్య కారణాలు, ప్రభుత్వాల అనిశ్చితి, పాలకుల నిర్ణయాల వల్ల కొంచెం అటూఇటుగా జరగొచ్చు. ఎప్పుడు నిర్వహించినా ఎన్నికల నిర్వహణ మహాక్రతువు. అధికారం దక్కించుకునేందుకు రాజకీయ పక్షాలు ఎంతగా కష్టపడాలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అంతకు రెట్టింపు కష్టపడాలి. ఈ క్రమంలో ఎవరు ఎన్నికల నియమావళిని అతిక్రమించినా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తారు. ఆ తర్వాత చర్యలు తప్పవు. అందువల్ల ఎన్నికల ప్రచారం సందర్భంలో రాజకీయ పార్టీలు, నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు...ఎవరైనా ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే ఇబ్బందుల్లో పడినట్టే. సాధారణ పౌరులు, ఓటర్లు, ఎవరు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా కమిషన్‌ తక్షణం విచారణకు ఆదేశిస్తుంది. ఉమ్మడి జిల్లాలోని మూడు లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చేనెల 13న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఘట్టం కూడా సోమవారం పూర్తయ్యింది. ఇక ఎన్నికలు జరగడమే తరువాయి. అయితే అభ్యర్థులు, పార్టీలకు గెలుపు ఎంతముఖ్యమో ఎన్నికల నియమావళికి లోబడిపనిచేయడం అంతే ముఖ్యం. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉంది. అంటే రాజకీయ పక్షాలు, ప్రతినిధులు చట్టం చట్రంలో ఉన్నట్టే. ఈ నేపథ్యంలో ఎన్నికల చట్టాలు, నియమ నిబంధనలపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

- కులమతాలను రెచ్చగొడితే....

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు, నాయకులు, అభ్యర్థులు తమ ప్రసంగాల్లో కుల, మతాలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడకూడదు. ఎవరైనా ఆ విధంగా చేసినట్లయితే ఎన్నికల చట్టంలోని సెక్షన్‌ 123 ప్రకారం సాధారణ పౌరులు కూడా ఫిర్యాదు చేయొచ్చు.

- వర్గ విభేదాలు సృష్టిస్తే జైలే...

ఎన్నికల సందర్భంగా ఎవరైనా వర్గ విభేధాలు సృష్టించే ప్రయత్నం చేస్తే సెక్షన్‌ 125 ప్రకారం మూడేళ్లపాటు జైలుశిక్ష, జరిమానా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అధికారం కోర్టుకు ఉంటుంది.

- 48 గంటల ముందే ప్రచారానికి తెర...

ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలి. ఒక వేళ ఏ పార్టీకి సంబంధించిన నాయకులు, అభ్యర్థులైనా ఆ తర్వాత సభలు, సమావేశాలు నిర్వహించినట్టు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందితే సెక్షన్‌ 126 ప్రకారం శిక్ష తప్పదు. ఫిర్యాదు దారుడు అందించిన సాక్ష్యాధారాల ప్రకారం రెండేళ్లు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.

- అల్లర్లు సృష్టిస్తే ఆరు నెలల జైలు

ఎన్నికల సభలు, సమావేశాలు, ప్రచారం సందర్భంలో అల్లర్లు సృష్టించినట్టు రుజువైతే పోలీసులు బాధ్యులైన మూకలను చట్టంలోని 127 సెక్షన్‌ ప్రకారం అరెస్టు చేయవచ్చు. రుజువైతే కనీసం ఆరు నెలలు జైలు శిక్ష, రూ.2వేల వరకు జరిమానా తప్పదు.

- పోలింగ్‌ సిబ్బందికి చిక్కులే

చట్టంలోని 129 సెక్షన్‌ ప్రకారం ఎన్నికల అధికారులు, సిబ్బంది, పోలీసులు ఏ పార్టీకి చెందిన అభ్యర్థికైనా బహిరంగంగా, లోపాయికారీగా సహకరిస్తే చిక్కుల్లో పడతారు. అలా చేసినట్టు ఉద్యోగులపై ఫిర్యాదులు అందితే, కమిషన్‌ విచారణ జరుపుతుంది. నేరం రుజువైతే ఉద్యోగులకు కనీసం మూడు నెలల జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పోలింగ్‌ ఏజెంట్లుగా, ఓట్ల లెక్కింపు ఏజెంట్లుగా పార్టీల తరుపున వెళితే అటువంటి వారిపై ఫిర్యాదులు అందితే కమిషన్‌ సెక్షన్‌ 134ఎ ప్రకారం చర్యలు చేపట్టనున్నది. నేరం రుజువైతే కనీసం మూడు నెలలు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.

- ఈవీఎంలు అపహరిస్తే ఏడాది జైలు

పోలింగ్‌ కేంద్రాల నుంచి అల్లరి మూకలు ఈవీఎంలు అపహరిస్తే అటువంటి వారిపై పోలీసులు చట్టంలోని 135వ సెక్షన్‌ ప్రకారం కేసులు నమోదు చేస్తారు. దుండగులకు ఏడాది జైలు శిక్ష, రూ500 జరిమానా విధించే అవకాశం ఉంది.

- మారణాయుధాలతో తిరిగితే...

ఎన్నికల సందర్భంగా ఎవరైనా మారణాయుధాలతో తిరగడం నేరం. సంబంధిత పోలీసులు మారణాయుధాలతో పట్టుబడిన వ్యక్తులకు రెండు నెలల జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.

- మీ ఓటు మరొకరు వేస్తే...

పోలింగ్‌ కేంద్రానికి వెళ్లేసరికే మీ ఓటు ఎవరైనా వేసేస్తే పోలింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. మీ ఓటుకు సంబంధించి సరైన ఆధారాలు చూపిస్తే, ఓటు దుర్వినియోగం అయినట్టు తేలితే పోలింగ్‌ అధికారి మీకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. దీన్నే ఛాలెంజింగ్‌ ఓటు అంటారు. దీన్ని బ్యాలెట్‌ బాక్స్‌లో కాకుండా ప్రత్యేకంగా భద్రపరుస్తారు.

- బహిరంగంగా ఓటేసినా ఇబ్బందే

ఎన్నికల నిబంధనావళి ప్రకారం ఓటు వేసే ప్రక్రియ రహస్యంగా సాగాలి. ఓటర్లు ఎవరైనా బహిరంగంగా ఓటు వేస్తే ఆ ఓటరుకు చట్టం ప్రకారం మూడు నెలల జైలు, జరిమానా విధిస్తారు. ఓటేసే వారు నియమ నిబంధనలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవు.

- పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రచారం నిషేధం

పోలింగ్‌ కేంద్రాలకు 100 మీటర్లలోపు ఎన్నికల ప్రచారాన్ని కమిషన్‌ నిషేధించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమించి పోలింగ్‌ కేంద్రం పరిధిలో ప్రచారం చేస్తే ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు బాధ్యత వహించాల్సి వస్తుంది. పోలింగ్‌ కేంద్రానికి సమీపంలో ప్రచార సామగ్రిని స్వాధీనం చేసుకునే అధికారం కమిషన్‌ కల్పించింది.

  • విశాఖపట్నం

Updated Date - Apr 30 , 2024 | 01:58 AM