Share News

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌

ABN , Publish Date - May 06 , 2024 | 01:48 AM

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌...ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్న పదం. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న చట్టం. వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న ఈ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2024) అన్నివర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌

  • ఆస్తి మీదే...హక్కులు ఎవరివైనా కావచ్చు

  • ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో భూమి హక్కుదారులకు అనేక రకాల ఇబ్బందులు

  • తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని టీడీపీ, జనసేన ప్రకటన

  • డిఫెన్స్‌లో పడిన వైసీపీ ప్రభుత్వం

  • ఈ నిర్ణయాన్ని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్న న్యాయవాదులు

విశాఖపట్నం, మే 4 (ఆంధ్రజ్యోతి):

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌...ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్న పదం. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న చట్టం. వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్న ఈ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2024) అన్నివర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడే న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేశారు. వేర్వేరు రూపాల్లో తమ నిరసన తెలియజేశారు. ఈ యాక్ట్‌ అమలులోకి వస్తే అనేక రకాల ఇబ్బందులు ఉంటాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల స్థిరాస్తులపై చట్టబద్ధమైన హక్కులను ప్రభుత్వం నియమించే వ్యక్తుల చేతిలో పెట్టే అవకాశాన్ని ఈ యాక్ట్‌ కల్పిస్తోందన్న భావనను వ్యక్తపరుస్తున్నారు. దీనివల్ల స్థిరాస్తులు, వివాదాస్పద భూములు, స్థలాలకు సంబంధించిన వ్యవహారాల్లో రాజకీయ జోక్యానికి ఆస్కారాన్ని కల్పించినట్టు అవుతుందని, తద్వారా అధికారంలో ఉన్న పార్టీ నేతలు చెప్పిన వారికి మేలు జరిగేందుకు అవకాశం ఏర్పడుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ యాక్టును వైసీపీ ప్రభుత్వం సమర్ధించుకుంటుండగా, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు ప్రకటించారు. ఈ యాక్ట్‌పై న్యాయవాదులు ఏమంటున్నారో చూద్దాం...

న్యాయాన్ని నిరుపేదలకు దూరం చేసే యాక్ట్‌

- నాదెండ్ల వెంకట సుమన్‌, సీనియర్‌ న్యాయవాది, విశాఖ బార్‌ అసోసియేషన్‌ మాజీ ప్రెసిడెంట్‌

భూ సంబంధిత సమస్యల్లో న్యాయాన్ని నిరుపేదలకు దూరం చేసేలా ఈ యాక్ట్‌ చేస్తోంది. ఇప్పటివరకు భూములకు సంబంధించిన వివాదాలపై తీర్పులను సీనియర్లు అయిన న్యాయవాదులు ఇస్తున్నారు. వీరికి ఎంతో అనుభవం, ఎంతో శిక్షణ ఉంటాయి. తాజాగా తెచ్చిన యాక్ట్‌ వల్ల ప్రభుత్వం నియమించిన వ్యక్తులకు అధికారాన్ని కట్టబెట్టడం వల్ల రాజకీయ ప్రమేయాన్ని పెంచేందుకు అవకాశం ఉంది. యాజమాన్య హక్కులను నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం నియమించే వ్యక్తులకు కట్టబెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని చోట్ల కావాలనే వివాదాలు సృష్టించే వ్యక్తులు ఉంటారు. దీనివల్ల అవసరార్థం ఆస్తులను అమ్ముకునే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ చట్టంతో ప్రజల ఆస్తులకు రక్షణ కొరవడే ప్రమాదం ఉంది.

భూ యజమానులను ఇబ్బందులకు గురి చేసే చట్టం

- డి.నరేష్‌ కుమార్‌, ప్రముఖ న్యాయవాది, బార్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ భూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. దీనివల్ల భూ యజమానుల నష్టపోయే ప్రమాదం ఉంది. వివాదాలను క్లియర్‌ చేయించుకోవడానికి లంచాలు ఇవ్వాల్సి రావచ్చు. కొన్నిసార్లు రాజకీయ నాయకుల ప్రమేయంతో అసలు యజమానులకు బదులు...ఎవరికైనా వాటిపైనా హక్కులు దక్కే ప్రమాదం ఉంది. ఉన్నత స్థానంలో అప్పీల్‌ చేసుకోవడానికి రెండేళ్లకుపైగా సమయం పడుతుంది. అత్యవసర సమయాల్లో ఆస్తులు అమ్మడానికి అవకాశం ఉండదు. క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ కోసం టైటిలింగ్‌ పర్సన్‌ చుట్టూ తిరగాల్సి రావచ్చు. న్యాయ పరిజ్ఞానం లేని వ్యక్తులకు టైటిలింగ్‌ పర్సన్‌ అధికారాలు ఇస్తే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా మాత్రమే ప్రజలకు మేలు కలుగుతుంది.

సామాన్యుల భూములకు రక్షణ కరవు

గూనూరు లక్ష్మీనారాయణ, న్యాయవాది, చోడవరం

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అనేది చాలా ప్రమాదకరమైన చట్టం. ఈ చట్టం అమల్లోకి వస్తే పేదల భూములకు రక్షణ లేకుండా పోతుంది. డబ్బు, పలుకుబడి ఉన్నవారికే ఈ చట్టం ఉపయోగపడుతుంది. పేదలు తమ భూములను కాపాడుకోవడం తలకు మించిన భారమే. ఆయాక్టు అంత ప్రమాదకరంగా ఉండడం వల్లే, దీనికి వ్యతిరేకంగా న్యాయవాదులందరూ ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకంగా పోరాటం చేశాం. ఇప్పటికీ పోరాటం చేస్తున్నాం. ఈ చట్టం వల్ల భూములకు పూర్తి రక్షణ కలుగుతుందని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఈ చట్టం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ. ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి.

దుర్మార్గమైన చట్టం

- ఇల్లా అవినాష్‌, న్యాయవాది, అనకాపల్లి

వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు వల్ల ప్రజల ఆస్తులకు భద్రత కరవవుతుంది. ఆ యాక్టును అనుసరించి ఇప్పటికే రాష్ట్రంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రైతులకు నష్టం కలిగించే విధంగా రీ సర్వే పేరుతో పెద్దఎత్తున దోపిడీ జరుగుతుంది. రైతాంగం వారికి జరిగిన అన్యాయం గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియని మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలు జరిగితే తీవ్రంగా నష్టపోయేది చిన్న, సన్నకారు రైతులే. వారి హక్కును నిర్ధారించుకునేలోపే రికార్డు రూపంగా మరొకరికి ఆస్తి బదిలీ అయిపోతుంది. ఇది దుర్మార్గమైన చట్టం. ఈ చట్టాన్ని రద్దు చేయాలి

చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బంది

కామిరెడ్డి సత్యనారాయణ, సీనియర్‌ న్యాయవాది, నర్సీపట్నం

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వ్ల చిన్న, సన్నకారు రైతులు ఇబ్బంది పడతారు. ఏదైనా భూ సమస్య వస్తే ల్యాండ్‌ టైటిలింగ్‌ అధికారి వద్దకు వెళ్లాలి తప్పితే కోర్టుకు వెళ్లడానికి వీలు లేదు. అడంగల్‌, 1-బి రికార్డులు ఉండవు. టైటిల్‌ ఒక్కటే ఉంటుంది. అత్యవసరంగా భూములు అమ్ముకోవాలన్నా, తనఖా పెట్టాలన్నా అధికారులు అనుమతి తీసుకోవల్సి ఉంటుంది.

ఆస్తి యజమానులకు నష్టాన్ని చేకూర్చే నిర్ణయం

- కేవీ రామమూర్తి, న్యాయవాది

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ యాక్ట్‌ అమలులోకి వస్తే ప్రభుత్వం నియమించే వ్యక్తుల ఆధ్వర్యంలో సమస్యలను క్లియర్‌ చేస్తామని చెబుతున్నారు. దీనివల్ల రాజకీయ జోక్యానికి, లంచాలకు, అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది. న్యాయ అవగాహన లేని వారితో ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఎకరా, అర ఎకరా భూములు ఉన్న సాధారణ రైతులకు ఈ యాక్ట్‌తో పెను ప్రమాదమే. జిల్లా కోర్టులో, ట్రిబ్యునల్స్‌లో అప్పీల్‌ చేయడానికి అవకాశం ఉండదు. అలాగే రైతు తన భూమిని మరొకరు వివాదంలోకి లాగిన విషయాన్ని రెండేళ్లలో తెలుసుకోలేకపోతే పెద్ద నష్టమే కలుగుతుంది. రిజిస్ర్టేషన్లను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ జనరల్‌ లిమిటేషన్‌ యాక్ట్‌, ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ యాక్ట్‌కు పూర్తి విరుద్ధం. ఇందులో ఎన్ని సెక్షన్లు నిలబడతాయో కూడా చెప్పలేం. ఈ యాక్ట్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ఆస్తి యజమానులకు నష్టాన్ని చేకూర్చే నిర్ణయం.

కబ్జాదారుల చేతుల్లో భూములు పెట్టే యాక్ట్‌

- జీవీఏ సాయిబాబా, న్యాయవాది

ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసే చట్టం ఇది. ఈ యాక్ట్‌ అమలులోకి వస్తే సాధారణ ప్రజల ఆస్తులకు ఇబ్బందులు తప్పవు. రెవెన్యూలో అవినీతిని ప్రోత్సహించేందుకు ఈ యాక్ట్‌ దోహదం చేస్తుంది. ఉదాహరణకు రెండు ఎకరాల భూ యజమాని ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. ఐదేళ్లకో, పదేళ్లకో ఊరు వస్తుంటాడు. అతని భూమిని ఎవరైనా కబ్జా చేసి తన పేరు మీద టైటిల్‌ రాయించుకున్నాడనుకోండి. ఈ విషయం ఎక్కడో ఉన్న యజమానికి రెండేళ్ల వరకు తెలియకపోతే...దానిపై అతను హక్కును కోల్పోయే ప్రమాదముంది. ఈ తరహా ఇబ్బందులు పరిష్కారానికి ఇప్పటివరకు కింది స్థాయి కోర్టులకు వెళ్లేఅవకాశం లభించేది. ఇప్పుడు ఆ అవకాశమే లేదు. నేరుగా హైకోర్టుకు మాత్రమే వెళ్లాలి. పూర్తి అధికారాలను టైటిలింగ్‌ ఆఫీసర్‌ చేతిలో పెట్టడం వల్ల అవినీతిని ప్రోత్సహించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కబ్జాదారుల చేతుల్లోకి భూములను తీసుకువెళ్లి పెట్టేందుకు మార్గాన్ని యాక్ట్‌ ద్వారా కల్పిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన చట్టం.

Updated Date - May 06 , 2024 | 01:48 AM