Share News

వాల్తేరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌గా లలిత్‌ బొహ్రా

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:01 AM

వాల్తేరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌గా లలిత్‌ బొహ్రా నియమితులయ్యారు.

వాల్తేరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌గా లలిత్‌ బొహ్రా

విశాఖపట్నం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి):

వాల్తేరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌గా లలిత్‌ బొహ్రా నియమితులయ్యారు. ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన బొహ్రా ప్రస్తుతం డిప్యూటేషన్‌పై రెన్యువబుల్‌ ఎనర్జీ విభాగంలో పనిచేస్తున్నారు. ఇక్కడ డీఆర్‌ఎంగా పనిచేస్తున్న సౌరభ్‌ నెల క్రితం ఒక కాంట్రాక్టర్‌ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ ముంబైలో సీబీఐకి పట్టుబడిన విషయం తెలిసిందే. దాంతో ఆయన్ను సస్పెండ్‌ చేశారు. ప్రస్తుతం ఇన్‌చార్జి డీఆర్‌ఎంగా సాహు వ్యవహరిస్తున్నారు.

-----------------------------------------------------------------------------------

విమ్స్‌లో బ్లడ్‌ బ్యాంక్‌

ప్రాథమిక అనుమతులు మంజూరు

కేంద్ర ఔషధ నియంత్రణ శాఖకు ప్రభుత్వ ప్రతిపాదనలు

బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు సంబంధించిన పనులు పూర్తి, పరికరాలు కొనుగోలు

విశాఖపట్నం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో పూర్తిస్థాయి బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటు కానుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు రక్తం అవసరమైతే హెల్త్‌ సిటీ లేదా నగరంలోని బ్లడ్‌ బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ సమస్యను గుర్తించిన అధికారులు బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటుకు విమ్స్‌ డైరెక్టర్‌ చర్యలను ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి కమిటీ బ్లడ్‌ బ్యాంకు అవసరాన్ని గుర్తించడంతోపాటు వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో కేంద్రస్థాయిలో అనుమతులకు ఔషధ నియంత్రణ మండలి విభాగానికి సమాచారం పంపించింది. కొద్దిరోజుల్లోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నారు.

పనులు పూర్తి..

బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటుకు విమ్స్‌ మొదటి అంతస్థులో సుమారు ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. దీంతో రక్త శుద్ధి, నిల్వ, పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేశారు.

రోగులకు మేలు

- డాక్టర్‌ కె.రాంబాబు, విమ్స్‌ డైరెక్టర్‌

విమ్స్‌లో బ్లడ్‌ బ్యాంకు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జిల్లా ఔషధ నియంత్రణ మండలితోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ప్రాథమిక అనుమతులు ఇచ్చాయి. కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే సేవలను ప్రారంభిస్తాం. విమ్స్‌లో ప్రతిరోజూ 30 వరకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాం. వీరిలో కనీసం ఐదుగురికి రక్తం అవసరం అవుతుంది. హెల్త్‌ సిటీలోని ఇతర ఆస్పత్రులకు కూడా విమ్స్‌లో ఏర్పాటయ్యే బ్లడ్‌ బ్యాంకు ఉపయోగపడుతుంది. రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కీలకంగా మారుతుంది.

Updated Date - Dec 27 , 2024 | 01:05 AM