Share News

సంక్షేమ హాస్టళ్లపై పర్యవేక్షణ కరువు

ABN , Publish Date - Jan 28 , 2024 | 01:05 AM

సంక్షేమ హాస్టళ్లలో ఉండాల్సిన వార్డెన్లు ఇళ్లకు వెళ్లిపోతుండ డంతో విద్యార్థులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు.

సంక్షేమ హాస్టళ్లపై పర్యవేక్షణ కరువు

ఉదయం వచ్చి సాయంత్రం ఇళ్లకు వెళ్లిపోతున్న వార్డెన్లు

అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది విద్యార్థులు

పట్టనట్టు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు

తల్లిదండ్రుల్లో ఆందోళన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సంక్షేమ హాస్టళ్లలో ఉండాల్సిన వార్డెన్లు ఇళ్లకు వెళ్లిపోతుండ డంతో విద్యార్థులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. నగర పరిధిలోని అనేక హాస్టళ్లలో విద్యార్థులు ఎప్పుడు బయటకు వెళతారో, ఎప్పుడు తిరిగి వస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది. బయట వ్యక్తులు కూడా హాస్టళ్లలో ఉంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు.

అనకాపల్లి జిల్లా చోడవరం బీసీ సంక్షేమ వసతి గృహానికి చెందిన పదో తరగతి విద్యార్థులు నూతన సంవత్సరం సందర్భంగా మందు పార్టీ చేసుకోవడం కలకలం రేపింది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవు తోంది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. అయితే, జిల్లాలోని అనేక వసతి గృహాల్లో విద్యార్థులు ఇప్పటికీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నచ్చినప్పుడు వెళ్లడం, రావడం పరిపాటిగా మారింది. సదరు విద్యార్థి ఎక్కడకు వెళుతున్నాడన్న విషయాన్ని అడిగే నాథుడు లేడు. నిత్యం హాస్టల్‌లో ఉండాల్సిన వార్డెన్లు ఉదయం పది గంటలకు వచ్చి, సాయంత్రం ఐదు గంటలు దాటకముందే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కుక్‌, వాచ్‌మన్లకు విద్యార్థుల పర్య వేక్షణ బాధ్యతలను అప్పగిస్తున్నారు. అయితే, వారి మాటను విద్యార్థులు లెక్కచేయడం లేదు. కొన్నిచోట్ల డబ్బులిచ్చి వారిని మేనేజ్‌ చేస్తున్నారు.

తీవ్రమైన ఇబ్బందులకు అవకాశం

విశాఖ జిల్లాలో 22 సాంఘిక సంక్షేమ, 29 బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో సుమారు ఆరు వేల మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో సుమారు 25 వరకూ హాస్టళ్లు నగర పరిధిలోనే ఉన్నాయి. ఆయా హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న కొంతమంది విద్యార్థులు ఉదయం వెళ్లి రాత్రికి వస్తున్నారు. ఎక్కడికి వెళ్లింది, ఏం చేస్తున్నదీ అడిగేవారు ఉండడం లేదు. కొంతమంది సినిమాలు, షికార్లు అంటూ తిరుగుతున్నారు. మరికొంతమంది దురలవాట్లకు అలవాటు పడుతున్నారు. వీటిని అరికట్టాలంటే ఉన్నతాధికారులు దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వార్డెన్లు తప్పకుండా హాస్టళ్లలోనే ఉండేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతున్నారు. అతికొద్ది చోట్ల మినహా అనేకచోట్ల వార్డెన్లు హాస్టళ్లలో ఉండడమే లేదన్నది బహిరంగ రహస్యం. ఈ విషయం ఉన్నతాధికారు లకు తెలిసినా పట్టించుకోవడం లేదు.

Updated Date - Jan 28 , 2024 | 01:05 AM