కూటమి జోరు.. వైసీపీ బేజారు
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:05 AM
ఐదేళ్లకొకసారి జరిగే సాధారణ ఎన్నికలు 2024లో రావడంతో జిల్లా రాజకీయ ముఖచిత్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటివరకూ అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని దుస్థితికి చేరగా, విపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అనూహ్య విజయాన్ని సాధించి అధికార పగ్గాలు చేపట్టాయి. జిల్లాలో వైసీపీకి ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కకపోవడం గమనార్హం. ఎంపీ స్థానాన్ని కూటమి బలపరిచిన బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినట్టయింది.

- జిల్లాలో మారిన రాజకీయ ముఖ చిత్రం
- ఒక ఎంపీ, ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఓటమి
- అన్ని చోట్లా కూటమి విజయదుందుభి
- వైసీపీ నుంచి నేతల వలస బాట
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
ఐదేళ్లకొకసారి జరిగే సాధారణ ఎన్నికలు 2024లో రావడంతో జిల్లా రాజకీయ ముఖచిత్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటివరకూ అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని దుస్థితికి చేరగా, విపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అనూహ్య విజయాన్ని సాధించి అధికార పగ్గాలు చేపట్టాయి. జిల్లాలో వైసీపీకి ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కకపోవడం గమనార్హం. ఎంపీ స్థానాన్ని కూటమి బలపరిచిన బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినట్టయింది.
ఓడలు బళ్లు...బళ్లు ఓడలు
ఉమ్మడి విశాఖ జిల్లాగా ఉన్నప్పుడు 2019లో జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం నగరంలోని నాలుగు (తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ) నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా, మిగిలిన 11 (భీమిలి, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, ఎలమంచిలి, పాయకరావుపేట, మాడుగుల, అరకు, పాడేరు) స్థానాలు, మూడు ఎంపీ స్థానాలను వైసీపీయే గెలుచుకుంది. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాలు, అరకు ఎంపీ స్థానాన్ని వైసీపీ దక్కించుకోగా, మిగతావి కూటమి పార్టీలు గెలుచుకున్నాయి.
వైసీపీకి కోలుకోని దెబ్బ
గత ఐదేళ్లు అరాచక పాలన సాగించిన వైసీపీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. రెండేళ్ల క్రితం జిల్లాలను పునర్విభజన చేయడంతో జిల్లాలో ఒక ఎంపీ, ఏడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. 2024లో జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి వైసీపీ నుంచి బూడి ముత్యాలునాయుడు పోటీ చేయగా, ఆయనపై కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్ విజయం సాధించారు. అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి వైసీపీ నేత మలసాల భరత్‌కుమార్ బరిలో దిగగా, జనసేన నేత కొణతాల రామకృష్ణ గెలుపొందారు. పెందుర్తిలో అదీప్‌రాజ్(వైసీపీ)పై పంచకర్ల రమేశ్‌బాబు (జనసేన), చోడవరంలో కరణం ధర్మశ్రీ(వైసీపీ)పై కేఎస్‌ఎన్‌ఎస్ రాజు(టీడీపీ), మాడుగులలో ఈర్లె అనురాధ(వైసీపీ)పై బండారు సత్యనారాయణ మూర్తి(టీడీపీ), నర్సీపట్నంలో పెట్ల ఉమాశంకర్ గణేశ్(వైసీపీ)పై అయ్యన్న పాత్రుడు(టీడీపీ), ఎలమంచిలిలో కన్నబాబురాజు(వైసీపీ)పై సుందరపు విజయ కుమార్(జనసేన), పాయకరావుపేటలో కంబాల జోగులు(వైసీపీ)పై వంగలపూడి అనిత(టీడీపీ) ఘన విజయం సాధించారు.
కూటమి నేతలను వరించిన పదవులు
కూటమి ప్రభుత్వంలో జిల్లాలో ఈ ఏడాది పలువురికి రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా ప్రాధాన్యం దక్కింది. నర్సీపట్నం ఎమ్మెల్యే సీహెచ్ అయ్యన్నపాత్రుడుకి శాసనసభ స్పీకర్ పదవి, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు హోం మంత్రి పదవి దక్కాయి. అలాగే మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు అర్బన్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైౖర్మన్‌గా, టీడీపీ చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగిన బత్తుల తాతయ్యబాబుకు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా, టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావుకు రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా, టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌కు వెలమ సంక్షేమ కార్పొరేషన్ చైౖర్మన్ పదవులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన పలువురు నాయకులకు వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా పదవులు దక్కాయి.
వైసీపీ నేతల చూపు కూటమి వైపు..
జిల్లాలో పలువురు వైసీపీ నాయకులు పార్టీ మారారు. ఇటీవల విశాఖ డెయిరీ చైౖర్మన్ అడారి ఆనంద్‌కుమార్‌తో పాటు పలువురు డైరెక్టర్లు, ఎలమంచిలి మునిసిపల్ చైర్‌పర్సన్ పిల్లా రమాకుమారి బీజేపీలో చేరారు. కొందరు వైసీపీ సీనియర్ నాయకులు బీజేపీలో చేరారు. అలాగే మరికొందరు ముఖ్య నేతలు కూటమి పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.