Share News

కొండెక్కిన థీమ్‌పార్క్‌

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:48 AM

నగరంలో అతిపెద్దదైన ముడసర్లోవ పార్కుని అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు గొప్పలు చెప్పారు.

కొండెక్కిన థీమ్‌పార్క్‌

మాటలకే పరిమితమైన ముడసర్లోవ పార్కు అభివృద్ధి

రూ.120 కోట్లతో రిజర్వాయర్‌లో బోటింగ్‌, రిక్రియేషన్‌ సదుపాయాలకు ప్రణాళిక

సర్కారుకు ప్రతాపాదనలు పంపిన జీవీఎంసీ

ఇప్పటివరకు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం

నగరవాసుల నుంచి వెల్లువెత్తిన విమర్శలు

ఎన్నికల వేళ నష్టం జరగకుండా చర్యలు

జీవీఎంసీ నిధులతో అభివృద్ధి పనులకు ప్రణాళిక

రూ.30 లక్షలతో పిల్లలకు ఆటపరికరాల ఏర్పాటుతో సరి

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

నగరంలో అతిపెద్దదైన ముడసర్లోవ పార్కుని అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు గొప్పలు చెప్పారు. సుమారు 800 ఎకరాల్లో విస్తరించిన పార్కులో పిల్లల నుంచి వయోవృద్ధులు వరకూ అన్నివర్గాలవారికి ఆహ్లాదం కలింగేలా థీమ్‌పార్కు పేరుతో అభివృద్ధి చేయడంతోపాటు పార్కుని ఆనుకుని ఉన్న రిజర్వాయర్‌లో బోటింగ్‌ సదుపాయం కల్పించి పర్యాటకులను ఆకట్టుకుంటామని ప్రగల్భాలు పలికారు. ఇందులో భాగంగా నాలుగేళ్ల కిందట రూ.120 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదానికి పంపించారు. అయితే ఇంతవరకూ ఈ ప్రతిపాదనపై అతీగతీలేదు.

ఆరిలోవ నుంచి సింహాచలం బీఆర్‌టీఎస్‌ రోడ్డుకు ఆనుకుని ముడసర్లోవ పార్కు ఉంది. జీవీఎంసీకి చెందిన ఈ పార్కు దాదాపు 800 ఎకరాల్లో విస్తరించి ఉంది. ముడసర్లోవ రిజర్వాయర్‌ ఒక వైపు, గోల్ఫ్‌ కోర్ట్‌ మరోవైపు ఉండడంతో పార్కు నిత్యం సందర్శకులతో కళకళలాడుతుండేది. పార్కు నిర్వహణపై జీవీఎంసీ నిర్లక్ష్యం వహించడంతో ఇక్కడి చిన్నపిల్లల ఆట వస్తువులు మూలకు చేరాయి. వాటర్‌ఫౌంటైన్లు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలో పిక్నిక్‌లకు మినహా మిగిలిన రోజుల్లో సందర్శకుల సంఖ్య పెద్దగా ఉండడం లేదు.

గత ప్రభుత్వంలోనే అభివృద్ధి ప్రణాళిక

నగరానికి తలమానికంగా నిలిచే ముడసర్లోవ పార్కును అభివృద్ధి చేస్తే సందర్శకులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే పర్యాటకులను సైతం ఆకర్షించవచ్చునని జీవీఎంసీ అధికారులు గుర్తించారు. ఇందులోభాగంగా గత ప్రభుత్వ హయాంలోనే జీవీఎంసీ కమిషనర్‌ ప్రతిపాదనలు పంపించారు. ఇంతలోనే ఎన్నికలు జరగడం, వైసీపీ అధికారంలోకి రావడంతో పార్కు అభివృద్ధి ప్రతిపాదనలు అటకెక్కిపోయాయి. ఆ తరువాత అప్పటి వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా వ్యవహరించిన విజయసాయిరెడ్డితో పాటు వైసీపీ పెద్దల కళ్లు ముడసర్లోవ పార్కుపై పడ్డాయి. పార్కుని పీపీపీ పద్ధతిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. పార్కుతోపాటు రిజర్వాయర్‌ భూములను విజయసాయిరెడ్డి, కొందరు వైసీపీ పెద్దలు కొందరు జీవీఎంసీ అధికారులతో సహా పరిశీలించారు. పార్కులో చిన్నపిల్లలకు ఆటవస్తువుల ఏర్పాటు, వాకింగ్‌ట్రాక్‌లు, రిక్రియేషన్‌ సెంటర్‌లు, ఫుడ్‌కోర్ట్‌లు, అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ సదుపాయాలు క ల్పించాలని నిర్ణయించారు. ముడసర్లోవ రిజర్వాయర్‌లో బోటింగ్‌ సదుపాయం, కంబాల కొండ వరకూ వెళ్లి వచ్చేలా రోప్‌వే ఏర్పాటు ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించవచ్చని భావించారు. తద్వారా ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చునని వైసీపీ నేతలు గొప్పలు చెప్పారు. ఇందుకోసం అవసరమయ్యే మొత్తాన్ని అంచనా వేసి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. దీంతో మూడేళ్ల కిందట రూ.120 కోట్లతో ముడసర్లోవ అభివృద్ధికి ప్రతిపాదనలు తయారుచేసి పంపించారు. అయితే ముడసర్లోవ భూములను కొల్లగొట్టేందుకు ప్రణాళిక సిద్ధమవుతోందనే విమర్శల నేపథ్యంలో విజయసాయిరెడ్డి వెనక్కి తగ్గారని, ఫలితంగా ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

జీవీఎంసీ నిధులతో పనులకు యత్నం

పార్కు అభివృద్ధికి అడుగులు పడకపోవడంతో నగర వాసుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇవి పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తాయని గుర్తించిన వైసీపీ నేతలు జీవీఎంసీ నిధులతో పార్కు అభివృద్ధి చేసినట్టు కలరింగ్‌ ఇవ్వాలని భావించారు. ఇందులో భాగంగా జీవీఎంసీ పాలకవర్గంలోని వైసీపీ పెద్దల సూచన మేరకు అధికారులు ఇటీవల రూ.30 లక్షలు జీవీఎంసీ నిధులు వెచ్చించి చిన్నపిల్లల ఆటవస్తువుల ఏర్పాటు, సివిల్‌వర్కుల రిపేర్ల కోసం ప్రతిపాదనలను గతనెలలో జరిగిన చివరి స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఆమోదించారు. ఎన్నికల్లో నష్టం జరుగుతుందనే భయంతోనే ముడసర్లోవ పార్కులో చిన్న పిల్లల ఆటవస్తువులను మొక్కుబడిగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రజలను మభ్యపెట్టడం మినహా, ఇంతవరకూ పనులు ప్రారంభించలేదని నగరవాసులు దుమ్మెత్తిపోస్తున్నారు.

Updated Date - Apr 08 , 2024 | 01:48 AM