ఖాకీ వసూల్
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:24 AM
నగర పోలీస్ కమిషనరేట్‌లోని ఒక సబ్‌డివిజన్‌లో పనిచేస్తున్న అధికారి అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు.

ఒక సబ్ డివిజన్ అధికారి దందా
ప్రత్యేకంగా ఇద్దరు కానిస్టేబుళ్ల నియామకం
తన పరిధిలోని స్టేషన్లకు వచ్చే సివిల్ కేసులపై ఆరా
ఇరువర్గాలను తన వద్దకు పంపాలని సీఐలకు ఆదేశం
బెదిరించి సెటిల్‌మెంట్లు
కొన్ని కేసుల్లో రూ.లక్షల్లో వసూలు
ఎన్ని ఫిర్యాదులున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగర పోలీస్ కమిషనరేట్‌లోని ఒక సబ్‌డివిజన్‌లో పనిచేస్తున్న అధికారి అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. తనకు సంబంధం లేని కేసుల్లో కూడా తలదూర్చి అందినకాడికి దండుకుంటున్నారు. తన కార్యాలయంలో ఇద్దరు కానిస్టేబుళ్లను పెట్టుకుని తన పరిధిలోని స్టేషన్లపై నిఘా పెట్టారు. సివిల్ కేసులు, చీటింగ్ కేసులకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినట్టు తెలియగానే రెండు వర్గాలను పిలిపించుకుని తనదైన శైలిలో బెదిరించి సెటిల్‌మెంట్ చేస్తున్నారని సంబంధిత సీఐలే వాపోతున్నారు. పొరపాటున పరిశ్రమల్లో ఏదైనా ప్రమాదం జరిగితే రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు.
నగరంలోని ఒక సబ్‌డివిజన్ అధికారి వ్యవహారశైలి పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. తన పరిధిలోని నాలుగు స్టేషన్లలో నమోదయ్యే ముఖ్యమైన కేసుల దర్యాప్తులో సీఐలకు మార్గనిర్దేశం చేయడం, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు, సీపీ, డీసీపీ స్థాయి అధికారులు ఆదేశాలున్నప్పుడు మాత్రమే ఇతర కేసుల దర్యాప్తులో సదరు అధికారి జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధన తనకు వర్తించదన్నట్టు ఆయన వ్యవహరిస్తున్నారని ఆ పరిధిలో పనిచేసే సీఐలు వాపోతున్నారు. ఇతర స్టేషన్లలో పోస్టింగ్ ఆర్డర్ పొందిన ఇద్దరు కానిస్టేబుళ్లను తన కార్యాలయానికి సీ-నంబర్‌పై తెచ్చుకున్నారని చెబుతున్నారు. వారిద్దరినీ తమ స్టేషన్లపై నిఘాకు ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల్లో భూవివాదాలు, చీటింగ్‌కు సంబంధించినవి ఉంటే ఇరు వర్గాలను తన వద్దకు పంపాలంటూ తమను లేదంటే తమ కింద పనిచేసే ఎస్‌ఐలను ఆదేశిస్తున్నారని వాపోతున్నారు. రెండు వర్గాలను పంపిస్తే వారిద్దరినీ తన ఎదుట కూర్చోబెట్టుకుని బెదిరించి, ఏదోలా సెటిల్‌మెంట్ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేలా చేయడం ఆయన ప్రత్యేకతగా చెబుతున్నారు. ఆయన పరిధిలో ఒక సంస్థ గోడ నిర్మాణం పనులు చేస్తోంది. ఆ గోడ నిర్మాణం జరుగుతుండగా ఒక కార్మికుడు కిందపడి మృతిచెందాడు. దీనిపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో 174 సెక్షన్ కింద కేసు నమోదుచేశారు. కానీ సదరు అధికారి మాత్రం వదలిపెట్టకుండా ఆ కేసు దర్యాప్తు చేస్తున్న మహిళా ఎస్‌ఐకి ఫోన్ చేసి ఆ సంస్థ ప్రతినిధులను తన వద్దకు పంపించాలని ఆదేశించారు. మహిళా ఎస్‌ఐ ఆ సంస్థ ప్రతినిధులకు ఫోన్ చేసి ఆ అధికారిని కలవాలని సూచించారు. ఆమె సూచన మేరకు సంస్థ పీఆర్‌ఓ వెళ్లి కలిస్తే...‘నువ్వు కాదు...మేనేజర్‌ను రమ్మని చెప్పు’ అని పంపించేశారు. దీంతో మేనేజర్ వెళ్లగా సంస్థ నిర్లక్ష్యం వల్లే కార్మికుడు మృతిచెందాడని, చర్యలు తప్పవని బెదిరించారు. కేసు అక్కడి తో ఆగిపోవాలంటే తనకు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని పోలీస్ శాఖలో చర్చజరిగింది. చివరకు రూ.15 లక్షలకు బేరం కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది. అదే పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల కిందట ఒక రసాయన పరిశ్రమలోని సీపీ-3 యూనిట్ వద్ద ప్రమాదం జరిగింది. అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడడంతో పోలీసులు సెక్షన్ 338 కింద కేసు నమోదుచేశారు. సదరు సంస్థ కూడా గాయపడిన వారిని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించింది. దీనికోసం రూ.20 లక్షల వరకూ ఖర్చయినట్టు సమాచారం. కానీ ఆ సంస్థ ప్రతినిధిని సదరు అధికారి తన కార్యాలయానికి పిలిపించుకుని రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. సాధారణంగా గాయాలైన కేసులో రూ.50 వేలు కాదంటే రూ.లక్ష వరకూ పోలీసులు అడగడం సహజమని...అంతభారీ మొత్తం అడగమేమిటని, సదరు అధికారి నియమించుకున్న ఇద్దరు కానిస్టేబుళ్ల వద్ద సంస్థ ప్రతినిధులు వాపోయినట్టు పోలీస్ సిబ్బందే పేర్కొంటున్నారు. తర్వాత ఎంతకి సెటిల్ చేసుకున్నారనేది తమకు తెలియనివ్వలేదని సంబంధిత స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. అదేవిధంగా నగరంలో రేషన్ బియ్యం తరలించే ఎండీయూ వాహనాల యూనియన్ నేతను బెదిరించి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నట్టు సదరు అధికారిపై ఆరోపణలు ఉన్నాయి. తన పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్‌కు చీటింగ్ అభియోగంపై ఫిర్యాదు వస్తే..ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పిలిచి తన కార్యాలయంలో నిర్బంధించారు. తనదైన శైలిలో బూతులతో బెదిరించారు. తాను తప్పుచేయలేదని అతను మొత్తుకున్నాసరే...భారీగా లాభాలు పొందావని చెప్పి రూ.లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన వ్యవహారశైలిపై గతంలో సీపీలుగా పనిచేసిన వారికి కొంతమంది ఫిర్యాదులు చేసినప్పటికీ ఎందుచేతనో చర్యలు మాత్రం తీసుకోలేకపోయారు. కొత్త సీపీ బాధ్యతలు చేపట్టడంతో సదరు అధికారి ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.