Share News

కలగానే ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:26 AM

పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎల్‌సీ) నిర్మాణం కలగానే మిగిలిపోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజయ్యపేట వద్ద సముద్ర తీరంలో ఎఫ్‌ఎల్‌సీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి ఇరవై నెలలు దాటినప్పటికీ ఇంతవరకు కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు.

కలగానే ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌
సముద్ర తీరంలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణానికి ఎంపిక చేసిన అటవీ శాఖ భూములు

రెండేళ్లు దాటినా మొదలుకాని పనులు

అటవీ శాఖ నుంచి భూమి బదలాయింపులో ప్రభుత్వం విఫలం

రాజయ్యపేట వద్ద ఎఫ్‌ఎల్‌సీ నిర్మిస్తామని నాలుగున్నరేళ్ల క్రితం వైసీపీ పాలకులు ఆర్భాటంగా ప్రకటన

రెండేళ్ల వరకు పట్టించుకోని ప్రభుత్వం

అనంతరం కేంద్ర ప్రభుత్వ సిఫారసుతో చెన్నై ఐఐటీ నిపుణుల బృందం సర్వే

ఎఫ్‌ఎల్‌సీ ఏర్పాటుకు ఈ ప్రాంతం అనుకూలమని నివేదిక

రూ.24.77 కోట్ల అంచనా వ్యయం... 2022 ఏప్రిల్‌లో అనుమతి

అటవీ శాఖ పరిధిలో సముద్ర తీర ప్రాంతం

ఆరు ఎకరాలు మంజూరు చేయాలని కలెక్టర్‌ ద్వారా మత్స్య శాఖ అధికారులు లేఖ

రెండేళ్లు కావస్తున్నప్పటికీ అటవీ శాఖ నుంచి కానరాని స్పందన

పట్టించుకోని అధికారులు, వైసీపీ ప్రజాప్రతినిధులు

నక్కపల్లి, ఏప్రిల్‌ 17:

పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎల్‌సీ) నిర్మాణం కలగానే మిగిలిపోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజయ్యపేట వద్ద సముద్ర తీరంలో ఎఫ్‌ఎల్‌సీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి ఇరవై నెలలు దాటినప్పటికీ ఇంతవరకు కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు. ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన ఆరు ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలో వుందని, దీనిని తమ శాఖకు అప్పగించాలని జిల్లా ఉన్నతాధికారులను లిఖితపూర్వకంగా కోరినట్టు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. కనీసం మూడు ఎకరాలు ఇచ్చినా సర్దుకుపోతామని కోరినప్పటికీ అటవీ శాఖ నుంచి ఎటువంటి స్పందన లేదని అంటున్నారు. ఎఫ్‌ఎల్‌సీ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎల్‌సీ) ఏర్పాటు చేస్తామని వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. కానీ రెండేళ్లపాటు ఎటువంటి కదలిక లేదు. తరువాత కేంద్ర ప్రభుత్వ సిఫారసు మేరకు 2021 జూన్‌ నెలలో చెన్నైకి చెందిన ఐఐటీ నిపుణుల బృందం ఇక్కడకు వచ్చి స్థల పరిశీలన చేపట్టింది. ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉందని కేంద్రానికి నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన, ఐఐటీ నిపుణుల బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం రూ.24.77 కోట్ల అంచనా వ్యయంతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు 2022 ఏప్రిల్‌లో అనుమతి ఇచ్చింది. మరుసటి నెలలో మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌, మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందింది. ఎఫ్‌ఎల్‌సీ ఏర్పాటుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తి చొప్పున భరించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూ.14.86 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ రూ.9.91 కోట్లు ఖర్చు చేయాల్సి వుంటుంది. ఈ నిధులతో చేపల వేలంపాటకు హాలు, చేపలు ఎండబెట్టుకోవడానికి ప్లాట్‌ఫారాలు, సామాజిక భవనం, మత్స్యకారులు వలలు బాగుచేసుకోవడానికి భవనం, విశ్రాంతి తీసుకునేందుకు గదులు, మరుగుదొడ్లు, చేపల నిల్వకు శీతలీకరణ గోదాములు, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నుంచి ప్రధాన రహదారి వరకు సీసీ రోడ్ల నిర్మాణం చేపడతారు. ఏడాదిలో పనులు పూర్తవుతాయని, మత్స్యకారులకు ఎఫ్‌ఎల్‌సీ అందుబాటులోకి వస్తుందని నాడు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటించారు. ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం జరిగితే రాజయ్యపేట, దొండవాడ, బోయపాడు, అమలాపురం పరిసర గ్రామాల్లో సుమారు ఐదు వేల మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, మరో రెండు వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు.

భూ సేకరణలో తీవ్రజాప్యం

ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణానికి ఆరు ఎకరాలు అవసరమని మత్స్య శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు రాజయ్యపేట సముద్ర తీరంలో భూమిని గుర్తించారు. ఇక్కడ సముద్ర తీర ప్రాంతం అటవీ శాఖ పరిధిలో వుండడంతో దీనిని ఆరు ఎకరాల భూమిని తమ శాఖకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ అధికారులు సుమారు రెండేళ్ల క్రితం జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వంగా లేఖ రాశారు. ఆ మేరకు కలెక్టరేట్‌ అధికారులు నోట్‌ ఫైల్‌ తయారు చేసి అటవీ శాఖకు పంపారు. తరువాత జిల్లా కలెక్టర్‌, జేసీ, ఆర్డీవో, మత్స్యశాఖ అధికారులు పలుమార్లు రాజయ్యపేట వచ్చి ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రం ఏర్పాటుకు ఎంపిక చేసిన భూమిని పరిశీలించారు. కానీ అటవీ శాఖ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఆరు ఎకరాలు కాకపోయినా.. కనీసం మూడు ఎకరాలు కేటాయిస్తే చాలని, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణ పనులు చేపడతామని మత్స్యశాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులను కోరారు. అయినా సరే ఫలితం లేకపోయింది.

వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

కొవిరి వెంకటేశ్‌, జిల్లా అధ్యక్షుడు, జాతీయ మత్స్యకార సంఘం (31ఎన్‌కేపీ3)

రాజయ్యపేట వద్ద ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే అనుమతులు, నిధులు మంజూరు చేసింది. ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన భూమిని అటవీ శాఖ నుంచి మంజూరు చేయించడంలో అధికారులు, వైసీపీ ప్రజాప్రతినిధులు విఫలం అయ్యారు. ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం విషయంలో వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడింది.

Updated Date - Apr 18 , 2024 | 01:26 AM