Share News

జనసేనలోకి కొణతాల?

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:43 PM

ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రాజకీయంగా అనేక పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. అధికార పార్టీకి చెందిన అనేక మంది తెలుగుదేశం, జనసేనల్లో చేరిపోతున్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన తనయులు రెండు వారాల కిందట తెలుగుదేశం పార్టీలో చేరారు. కాగా, మరో సీనియర్‌ నేతగా పేరొందిన కొణతాల రామకృష్ణ జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

జనసేనలోకి కొణతాల?
హైదరాబాద్‌లో పవన్‌ కల్యాణ్‌ను కలిసిన సీనియర్‌ నేత కొణతాల రామకృష్ణ

పవన్‌కల్యాణ్‌తో భేటీ

ఈ నెలలోనే పార్టీలో చేరతానని చెప్పినట్టు సమాచారం

అనకాపల్లి ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నట్టు ప్రచారం

అనకాపల్లి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):

ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రాజకీయంగా అనేక పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. అధికార పార్టీకి చెందిన అనేక మంది తెలుగుదేశం, జనసేనల్లో చేరిపోతున్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన తనయులు రెండు వారాల కిందట తెలుగుదేశం పార్టీలో చేరారు. కాగా, మరో సీనియర్‌ నేతగా పేరొందిన కొణతాల రామకృష్ణ జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్‌ను కలిశారు. ఈ భేటీలో ఉత్తరాంధ్రకు సంబంధించిన అనేక విషయాలపై చర్చించినట్టు కొణతాల అనుచరులు చెబుతున్నారు. మంచి రోజు చూసుకుని ఈ నెలలోనే పార్టీలో చేరతానని పవన్‌కల్యాణ్‌కు కొణతాల చెప్పినట్టు సమాచారం. ఆయన అనకాపల్లి ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నట్టు తెలిసింది. గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణ 1989 నుంచి 1996 వరకు అనకాపల్లి ఎంపీగా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, న్యాయ శాఖల మంత్రిగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ...ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి వెంట నడిచారు. వైఎస్‌ఆర్‌ సీపీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2014 ఎన్నికల అనంతరం వైసీపీకి రాజీనామా చేశారు. అప్పటినుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉత్తరాంధ్ర సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లేందుకు యత్నిస్తున్నారు. అయితే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్‌ రాష్ట్ర బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆయన అందులో చేరవచ్చుననే ఊహాగానాలు వినిపించాయి. ఈ మేరకు కేవీపీ రామచంద్రరావు చర్చలు జరిపినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే కొణతాల జనసేన వైపు మొగ్గుచూపారు.

Updated Date - Jan 17 , 2024 | 11:43 PM