Share News

ఏఎంసీలో అమ్మకానికి ఉద్యోగాలు!

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:51 AM

వందేళ్ల చరిత్ర గల ఆంధ్ర వైద్య కళాశాలలో ఉద్యోగాలను కొందరు దళారులు, అధికారులు అంగట్లో అమ్మకానికి పెట్టారు.

ఏఎంసీలో అమ్మకానికి ఉద్యోగాలు!

100 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌

కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్‌ విధానంలో పోస్టింగ్స్‌

ఒక్కో ఉద్యోగానికి ఒక్కో రేటు

రూ.లక్షన్నర నుంచి రూ.7 లక్షల వరకు వసూళ్లు

చక్రం తిప్పుతున్న దళారులు

తెరవెనుక కళాశాల ఉద్యోగులు

మహారాణిపేట, మార్చి 15:

వందేళ్ల చరిత్ర గల ఆంధ్ర వైద్య కళాశాలలో ఉద్యోగాలను కొందరు దళారులు, అధికారులు అంగట్లో అమ్మకానికి పెట్టారు. ఈ కళాశాలలో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో సుమారు వంద పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే అదనుగా రంగంలోకి దిగిన దళారులు ఒక్కో పోస్టుకు ఒక్కో ధర నిర్ణయించి మరీ వికయ్రించేస్తున్నారు. ఇందులో ఏఎంసీలోని ముగ్గురు ఉద్యోగులు కీలకంగా వ్యవహరిస్తున్నారని, వారికి ఉన్నతాధికారుల మద్దతు ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర వైద్య కళాశాలలో క్లాస్‌ ఫోర్‌తో పాటు ఇతర విభాగాల్లో సుమారు వంద పోస్టులను కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేసేందుకు అధికారులు ఈనెల మొదటి వారంలో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మార్చి ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం వంద పోస్టులకు 3,807 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించలేదు. కేవలం అకడమిక్‌ మార్కుల ఆధారంగా నియామకాలు చేపట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

రంగంలోకి దళారులు

దీనిని అవకాశంగా మలుచుకునేందుకు దళారులు రంగంలోకి దిగారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించారు. పోస్టును బట్టి రేటును నిర్ణయించి, వసూలుకు తెగబడ్డారు. ఒక్కో కాంట్రాక్టు పోస్టుకు సుమారు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు, అవుట్‌ సోర్సింగ్‌ పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ. నాలుగు లక్షల వరకు రేటు నిర్ణయించారు. ఇప్పటికే చాలామంది నుంచి డబ్బు వసూలు చేసినట్టు తెలిసింది. అంతేకాదు క్లాస్‌ఫోర్‌ వాచ్‌మెన్‌ పోస్టులకు కూడా సుమారు రూ.లక్షన్నర చొప్పున వసూలు చేశారని సమాచారం.

దందాలో ఏఎంసీ ఉద్యోగులు

ఉద్యోగాల అమ్మకాల వ్యవహారంలో వైద్య కళాశాలకు చెందిన ముగ్గురు ఉద్యోగులు కూడా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ వసూళ్లకు వైద్య కళాశాలకు చెందిన ఉన్నతాధికారుల ప్రోద్బలం ఉందనే విమర్శలున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, ఉద్యోగాల ఎంపికను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.

Updated Date - Mar 16 , 2024 | 12:51 AM