Share News

సంపంగిపుట్టులో జీపు బోల్తా

ABN , Publish Date - Feb 12 , 2024 | 11:17 PM

మండలంలోని అన్నవరం పంచాయతీ సంపంగిపుట్టు బ్రిడ్జి వద్ద ఓ సర్వీసు జీపు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు గిరిజనులు మృతి చెందగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సంపంగిపుట్టులో జీపు బోల్తా
సంపంగిపుట్టు బ్రిడ్జి వద్ద బోల్తా పడిన సర్వీసు జీపు

ఇద్దరు గిరిజనులు మృతి

మరో 11 మందికి గాయాలు

క్షతగాత్రులను పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలింపు

చింతపల్లి, ఫిబ్రవరి 12: మండలంలోని అన్నవరం పంచాయతీ సంపంగిపుట్టు బ్రిడ్జి వద్ద ఓ సర్వీసు జీపు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు గిరిజనులు మృతి చెందగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించి పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలిలా వున్నాయి. కుడుముసారి పంచాయతీ పరిధిలో పలు గ్రామాల ఆదివాసీలు సోమవారం అన్నవరం వారపు సంతకు వచ్చారు. సంతలో అవసరమైన సరకులు కొనుగోలు చేసుకుని సాయంత్రం స్వగ్రామాలకు సర్వీసు జీపులో ప్రయాణమయ్యారు. అన్నవరం నుంచి తమ్మంగుల వెళుతున్న జీపులో 12 మంది గిరిజనులు ఉన్నారు. సంపంగిపుట్టు బ్రిడ్జి మలుపు వద్దకు వచ్చే సరికి జీపు అదుపుతప్పి బోల్తా పడింది. సంఘటన స్థలంలో మెరకలు గ్రామానికి చెందిన జర్త చిన్నమ్మ(60) మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను 108లో లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మెరకలు గ్రామానికి చెందిన వంతల అప్పారావు(55) మృతి చెందాడు. ఆస్పత్రిలో చేరిన క్షతగాత్రులకు కాళ్లు, చేతులు విరిగిపోయాయి. కొంత మందికి తల, ఛాతి భాగాల్లో బలమైన గాయాలయ్యాయి. గాయపడిన వారికి లోతుగెడ్డ, కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు లక్ష్మికాంత్‌, ఎల్‌.శివప్రసాద్‌ ప్రాథమిక చికిత్స అందించారు. బాధితులను పీహెచ్‌సీ అంబులెన్సు, 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Feb 12 , 2024 | 11:17 PM