Share News

మార్కెట్‌యార్డులో నిలిచిన బెల్లం లావాదేవీలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:46 AM

స్థానిక ఎన్టీఆర్‌ మార్కెట్‌యార్డులో బెల్లం లావాదేవీలు గురువారం స్తంభించిపోయాయి. వర్తకులకు, కొలగార్ల మధ్య తలెత్తిన సమస్య కారణంగా లావాదేవీలు ఆగిపోయాయి.

మార్కెట్‌యార్డులో నిలిచిన బెల్లం లావాదేవీలు
బెల్లం దిమ్మలు రాక బోసిపోయిన ప్లాట్‌ఫారం

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 18 : స్థానిక ఎన్టీఆర్‌ మార్కెట్‌యార్డులో బెల్లం లావాదేవీలు గురువారం స్తంభించిపోయాయి. వర్తకులకు, కొలగార్ల మధ్య తలెత్తిన సమస్య కారణంగా లావాదేవీలు ఆగిపోయాయి. ఏ రోజుకు ఆ రోజు కొలగార్లకు తమ కొలగారం (వేతనం) ఇవ్వాలని కొలగార్ల సంఘం ప్రతినిధి దాడి భోగలింగం చెబుతున్నారు. ఇటీవల యార్డులో బెల్లం దిమ్మలు పోయాయని, దానికి తమ కొలగారం నుంచి వర్తకులు డబ్బులు కట్‌ చేస్తున్నారని చెబుతున్నారు. మార్కెట్‌ రూల్స్‌ ప్రకారం సాయంత్రం ఐదు గంటల వరకే పనిచేయాలని అయినా ఎనిమిది గంటల వరకు దుకాణాల వద్దే ఉంటున్నామని చెబుతున్నారు. వేలం పాటలో వర్తకులు పాడుకున్న బెల్లం రవాణా అయ్యే వరకు కొలగార్లే కాపాలా ఉండాలని వర్తకులు అంటున్నారని పేర్కొన్నారు. కొలగారం ఎప్పటి మాదిరిగానే వారానికి ఒకసారి ఇస్తామని వర్తకులు చెబుతున్నారన్నారు. ఏ రోజుకు ఆ రోజే ఇవ్వాలని తాము కోరుతున్నామన్నారు. ఎన్నికల సమయం కావడం వల్ల కొద్ది రోజులు ఆగిన తర్వాత కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవచ్చనని వర్తకులు చెబుతున్నారని మార్కెట్‌ కమిటీ సెక్రటరీ శకుంతల చెబుతున్నారు. ఏది ఏమైనా సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. కాగా గురువారం రైతులు మార్కెట్‌కు బెల్లం తీసుకురాకపోవడంతో లావాదేవీలు నిలిచిపోయాయి.

Updated Date - Apr 19 , 2024 | 12:46 AM