Share News

వాగులో జగనన్న కాలనీ

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:32 AM

నగరంలో పేదల కోసం శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్న జగనన్న కాలనీలు నివాసానికి అనువుగా లేవన్న ఆరోపణలు/విమర్శలపై అధికారులు కనీసం స్పందించడం లేదు. వర్షపు నీరు ప్రవహించే గెడ్డల్లో లబ్ధిదారులకు ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇందుకు కణమాంలోని జగనన్న కాలనీయే నిలువెత్తు నిదర్శనం.

వాగులో జగనన్న కాలనీ

వర్షం వస్తే ముంచెత్తుతున్న వరద

ఇదీ ఆనందపురం మండలం కణమాం లేఅవుట్‌ పరిస్థితి

అయినా పట్టించుకోని అధికారులు

ఇళ్ల నిర్మాణం కొనసాగింపు

అక్కడ నివాసం ఉండడం కష్టమంటున్న లబ్ధిదారులు

విశాఖపట్నం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి):

నగరంలో పేదల కోసం శివారు ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్న జగనన్న కాలనీలు నివాసానికి అనువుగా లేవన్న ఆరోపణలు/విమర్శలపై అధికారులు కనీసం స్పందించడం లేదు. వర్షపు నీరు ప్రవహించే గెడ్డల్లో లబ్ధిదారులకు ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇందుకు కణమాంలోని జగనన్న కాలనీయే నిలువెత్తు నిదర్శనం.

నగర శివారునున్న ఆనందపురం మండలంలో ఎక్కువగా జగనన్న కాలనీలకు లేఅవుట్‌లు అభివృద్ధి చేశారు. గిడిజాల లేఅవుట్‌కు ఆనుకుని కణమాం పంచాయతీలో గెడ్డవాగులు ప్రవహించే ప్రాంతంలో లేఅవుట్‌ అభివృద్ధి చేశారు. సుమారు 30 ఎకరాల్లో 1,300 మందికి పట్టాలు పంపిణీ చేశారు. గిడిజాల లేఅవుట్‌లో 90 శాతం ఎత్తైన ప్రాంతం కావడంతో ఇళ్ల నిర్మాణాలకు అనువుగా ఉంది. ఇక కణమాం లేఅవుట్‌లో 30 శాతం వరకూ ఇబ్బంది లేదు. మిగిలిన ప్లాట్లలో నిర్మాణాలు చేస్తే నివాసం ఉండడం కష్టమని లబ్ధిదారులు వాపోతున్నారు. కొండల నుంచి గట్టిగా వరద వస్తే ప్లాట్లకు కేటాయించిన ప్రాంతంలో నడుము లోతు నీరు నిల్వ ఉంటుందని స్థానిక రైతులు వివరించారు. ఇప్పటివరకు కణమాం జగనన్న కాలనీలో 350 ఇళ్లకు పునాదులు తీసిన కాంట్రాక్టర్‌ 200 ఇళ్లకు సంబంధించి బేస్‌మెంట్‌ వరకు నిర్మాణాలు చేపట్టారు. లేఅవుట్‌ ఎగువ భాగంలో 100 ఇళ్లు రూఫ్‌ వరకూ నిర్మించిన కాంట్రాక్టర్‌ 30 ఇళ్లకు స్లాబులు వేశారు. వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నట్టు ఇళ్ల నిర్మాణ పనులు చేస్తున్న సిబ్బందే చెబుతున్నారు. ఇంకా లేఅవుట్‌ మధ్యలో రెండు గెడ్డలు ప్రవహిస్తున్నాయి. వర్షాకాలంలో వరద వస్తే గెడ్డలకు దక్షిణ భాగంలో కణమాం గ్రామం వైపు ఉన్న ప్లాట్ల వైపునకు వెళ్లడం సాధ్యం కాదని గ్రామానికి చెందిన అప్పలరాజు అనే రైతు పేర్కొన్నారు. వర్షాకాలంలో పొలాలకు వెళ్లడానికి తామే అనేక ఇబ్బందులు పడుతుంటామని, అటువంటిది ఆ ప్రాంతంలో కాలనీ నిర్మిస్తే ప్రజలు ఎలా ఉంటారని ప్రశ్నించారు. నగర శివారుల్లో వేసిన లేఅవుట్‌లలో చాలా వరకు నీరు ప్రవహించే ప్రాంతాలున్నా అధికారులు పట్టించుకోకుండా ప్లాట్లుగా అభివృద్ధి చేసి తమకు అప్పగించారని గృహ నిర్మాణ సంస్థ అధికారి ఒకరు వాపోయారు. జిల్లా యంత్రాంగం ఆదేశాలతో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. కాగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో 680 మందికి, విశాఖ దక్షిణ పరిధిలో 180 మందికి, విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలో 100 మందికి, భీమిలి పరిధిలోని 80 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు కణమాంలో ప్లాట్లు కేటాయించారు. కణమాం లేఅవుట్‌ ఎంవీపీ కాలనీకి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉందని, నగరంలో చిన్నచిన్న పనులు చేసుకునే తమకు అంత దూరంలో ఇళ్లు...అది కూడా గెడ్డవాగులో ఇస్తే ఎలా నివాసం ఉంటామని ఒక మహిళ ప్రశ్నించారు. గెడ్డవాగులో కేటాయించిన ప్లాట్లు రద్దు చేసి కొండకు ఆనుకుని ఎత్తైన ప్రాంతంలో ఇస్తే మంచిదని కోరుతున్నారు.

Updated Date - Jan 03 , 2024 | 01:32 AM