Share News

జగన్‌ బీసీ వ్యతిరేకి

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:04 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీసీలను అణగదొక్కేసారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ విమర్శించారు.

జగన్‌ బీసీ వ్యతిరేకి

ఎంవీపీ కాలనీ, జనవరి 7 : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీసీలను అణగదొక్కేసారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ విమర్శించారు. ఉత్తరాంధ్ర నుంచి లక్షల మంది తెలంగాణలో ఉపాధి కోసం ఉండేవారని, వారిని బీసీ జాబితా నుంచి కేసీఆర్‌ తొలగిస్తే, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఏమి చేశారని ప్రశ్నించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీ ఏఎస్‌ రాజా మైదానంలో ఆదివారం సాయంత్రం బీసీ సామాజిక చైతన్య సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మాత్రమే బీసీలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఉత్తరాంధ్రలో తూర్పు కాపు, శిష్ఠకరణ, కళింగ, కోమటి, అరవ కులాలు తమను కేంద్ర జాబితాలో చేర్చాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నా, బీసీ వ్యతిరేక పార్టీలు పట్టించుకోలేదని, త్వరలోనే ఈ కులాలు కేంద్ర జాబితాలో చేరుతాయని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు జగన్‌ కూడా బీసీలకు వ్యతిరేకి అన్నారు. ఓట్ల కోసం ఉచిత పథకాలు పెట్టారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ పుణ్యమా అని ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, దేవందర్‌ గౌడ్‌ వంటివారు ఉన్నత స్థానాల్లో కనిపించారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి మాట్లాడుతూ బీసీ కులాల అభివృద్ధి కోసం పరితపించే పార్టీ బీజేపీ అన్నారు. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇక్కడి బీసీ కమిషన్‌కు చట్టబద్దత ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఓబీసీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, నాయకులు పీవీఎన్‌ మాధవ్‌, మేడపాటి రవీంద్ర, కొత్తపల్లి గీత, గోపి శ్రీనివాస్‌, విష్ణుకుమార్‌ రాజు, కాశీవిశ్వనాథరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 01:04 AM