సంబరాలకు వేళాయె
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:06 AM
నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు.

హోటళ్లలో నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు
పలు చోట్ల ప్రత్యేక ఈవెంట్లు నిర్వహణ
విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. హోటళ్లు, రిసార్ట్స్ నిర్వాహకులు లైవ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటుచేస్తున్నారు. మంగళవారం రాత్రి రాడిసన్ బ్లూ హోటల్‌లో బాలీవుడ్ డీజే, సింగర్ కారుణ్య లైవ్ ప్రోగ్రామ్, నోవాటెల్‌లో ‘రోరింగ్ ట్వంటీస్’, ఫోర్ పాయింట్స్ షెరటాన్ హోటల్‌లో ‘టోబో వుడ్’ పేర్లతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు బీచ్‌రోడ్డులోని ప్రముఖ హోటళ్లు, రిసార్ట్స్‌లో నూతన సంవత్సర వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సింగిల్, కపుల్స్‌కు ఎంట్రీ పాస్‌లు విక్రయిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతోపాటు కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు ప్రత్యేక పాస్‌లను కొనుగోలు చేసినట్టు తెలిసింది. అదేవిధంగా పలు అపార్టుమెంట్‌లు, గ్రూపు హౌస్‌లలో డిన్నర్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, గేమ్స్ వంటివి నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
--------------------------------------------------------------------------
ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువల సవరణ
రిజిస్ట్రేషన్ల శాఖ విశాఖ డీఐజీ బాలకృష్ణ
విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
రిజిస్ట్రేషన్ల శాఖ సవరించిన భూముల రేట్లను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నట్టు విశాఖపట్నం డీఐజీ బాలకృష్ణ సోమవారం తెలిపారు. జనవరి ఒకటి నుంచి కొత్త రేట్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత నిర్ణయించిందని, అయితే పెంచిన రేట్లపై మరోసారి సమగ్రంగా చర్చించాలని ఆదేశాలు రావడంతో వాయిదా వేయడం జరిగిందన్నారు. వచ్చిన అభ్యంతరాలను మరోసారి సమీక్షించుకొని, ఫైనల్‌గా రేట్లు ఖరారు చేసి ఫిబ్రవరి ఒకటి నుంచి అమలు చేయాలని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ సోమవారం జరిగిన సమావేశంలో సూచించారన్నారు. జనవరి 31వ తేదీ వరకు ప్రస్తుతం అమలులో ఉన్న ధరల ప్రకారమే స్టాంపు డ్యూటీ వసూలు చేస్తామని బాలకృష్ణ వివరించారు.
--------------------------------------------------------------------------
నేడే సామాజిక పింఛన్లు పంపిణీ
విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
జనవరి ఒకటో తేదీన ఇవ్వాల్సిన సామాజిక పింఛన్లను మంగళవారం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. జిల్లాలో 1,61,253 మంది పింఛనుదారుల కోసం ప్రభుత్వం రూ.69.84 కోట్లు విడుదల చేసింది. నాలుగు గ్రామీణ మండలాల పరిధిలో 26,681 మందికి రూ.11,15,61,000, జీవీఎంసీ పరిధిలో 1,34,572 మంది పింఛనుదారులకు రూ.58,68,91,500 అందజేయనున్నారు. పింఛన్‌దారులకు పంపిణీకి అవసరమైన సొమ్ములు సోమవారం సచివాలయ సిబ్బందికి అందజేశారు.