Share News

బస్సెక్కితే బాదుడే

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:37 AM

పేద, మధ్య తరగతి ప్రజల చైతన్యరథంగా పేరొందిన ఆర్టీసీ (పీటీడీ) బస్సుల్లో ప్రయాణం భారంగా పరిణిమించింది.

బస్సెక్కితే బాదుడే

వైసీపీ పాలనలో రెండుసార్లు భారీగా పెంపు

25 నుంచి 50 శాతం మేర వడ్డించిన సర్కారు

పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం

ఉమ్మడి జిల్లాలోని ప్రయాణికులపై నెలకు రూ.పది కోట్లు అదనపు భారం

ఆక్యుపెన్సీ రేషియో తగ్గిందనే నెపంతో పలు ప్రాంతాలకు పేరుతో సర్వీసులు రద్దు

వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

పేద, మధ్య తరగతి ప్రజల చైతన్యరథంగా పేరొందిన ఆర్టీసీ (పీటీడీ) బస్సుల్లో ప్రయాణం భారంగా పరిణిమించింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన ఐదేళ్లలో రెండుసార్లు భారీగా టికెట్‌ చార్జీలను పెంచడంతో ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రయాణికులపై నెలకు సుమారు రూ.10 కోట్లు అదనపు భారం పడింది. 2019లో పోల్చితే సిటీబస్సుల నుంచి లగ్జరీ ఎక్స్‌ప్రెస్‌ల వరకు బస్సు టికెట్‌ల ధరలను 25శాతం నుంచి 50 శాతం వరకూ పెంచేయడంతో సగటు ప్రయాణికులు గగ్గోలుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

విశాఖ రీజియన్‌ పరిధిలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధఙలో సుమారు 1,063 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. 256 రూట్లలో ప్రతిరోజూ 3.5 లక్షల మంది ప్రయాణికుల ను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. వీటిద్వారా ఆర్టీసీకి రోజుకు సగటున రూ.1.35 కోట్లు ఆదాయం సమకూరుతోంది. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆర్టీసీ చార్జీలను పెంచలేదు. కాగా 2019లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ఆదాయవనరుగా మార్చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రెండుసార్లు భారీగా చార్జీలను పెంచారు. దీనివల్ల పేద, మధ్యతరగతి జనాలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం భారంగా పరిణమించింది. ఆదాయమే పరమావధిగా జగన్‌ ప్రభుత్వం చార్జీలను భారీగా పెంచడంతో వారిపై అదనపు భారం పడింది. నగర పరిధిలోని వివిధ రూట్లలో తిరిగే సిటీబస్సులతోపాటు ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రూట్లలో తిరిగే ఎక్స్‌ప్రెస్‌, లగ్జరీ బస్సుల చార్జీలను 2019తో పోల్చితే 25 శాతం నుంచి గరిష్టంగా 50 శాతం వరకూ పెంచారు.

ప్రయాణికులపై భారం ఇలా...

ద్వారకాబస్‌స్టేషన్‌ నుంచి చోడవరం ప్రయాణానికి 2019లో చార్జీ రూ.55 ఉండగా ఇప్పుడు రూ.75, నర్సీపట్నానికి 2019లో రూ.105 ఉండగా ప్రస్తుతం రూ.150, విజయనగరానికి 2019లో రూ.60 ఉంటే ప్రస్తుతం రూ.90, పార్వతీపురానికి రూ.170 ఉంటే ప్రస్తుతం రూ.220, శ్రీకాకుళానికి రూ.150 ఉంటే ప్రస్తుతం రూ.175, పాలకొండకి రూ.150 నుంచి రూ.185కి, అనకాపల్లికి రూ.50 నుంచి రూ.60, సబ్బవరం రూ.30 నుంచి రూ.40, కొత్తవలస రూ.25 నుంచి రూ.35, ఎలమంచిలి రూ.60 నుంచి రూ.85కి పెరిగిపోయాయి.

నగర వాసులపైనా వడ్డన

నగర పరిధిలో సింహాచలం వరకు 2019లో రూ.20 చార్జీ ఉండగా ప్రస్తుతం రూ.30, గాజువాకకి రూ.25 నుంచి రూ.35కి, భీమిలికి రూ.30 ఉంటే ప్రస్తుతం రూ.45, కొమ్మాదికి రూ.20 నుంచి రూ.40, విశాఖ రైల్వేస్టేషన్‌ నుంచి తగరపువలస రూ.30 నుంచి రూ.45కి పెంచేశారు. దీనివల్ల ప్రయాణికులపై రూ.పది కోట్లు అదనపు భారం పడిందని అంచనా.

పెంపుపై సామాన్యుల ఆగ్రహం

ఆర్టీసీ బస్సు చార్జీలను ఐదేళ్లలో రెండుసార్లు ఏకంగా 50 శాతం మేరకు పెంచడంపై సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు, స్వయంసహాయక వృత్తుల్లో ఉన్నవారంతా అద్దెలు తక్కువగా ఉంటాయనే భావనతో నగర శివారు ప్రాంతాల్లో నివసిస్తారు. వారంతా పనుల కోసం నగరానికి నిత్యం బస్సుల్లోనే వచ్చిపోతుంటారు. వచ్చే కూలీ/ వేతనంలో చార్జీలకే ఎక్కువ మొత్తం కేటాయించాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పైగా ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) తక్కువగా ఉందనే కారణంతో పలు రూట్లలో బస్సులను రద్దుచేస్తున్నారని, దీనివల్ల ఆయా ప్రాంతాల వారికి ఆటోలే శరణ్యమవుతున్నాయంటున్నారు. ఆర్టీసీ చార్జీలను పెంచి ఆదాయం సమకూర్చుకోవాలనే వైసీపీ సర్కారు తీరును వారంతా తూర్పారబడుతున్నారు.

చార్జీలు తగ్గించాలి

నేను ఆరిలోవ హెల్త్‌సిటీ ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తున్నాను. ప్రతి రోజూ బస్సులోనే డ్యూటీకి వెళ్లి వస్తుంటాను. ఒక పక్క చార్జీ రూ.40 తీసుకుంటున్నారు. గతంలో రెండువైపులా రూ.40 సరిపోయేది. నెలకు రూ.600 చార్జీల రూపంలో అదనపు భారం పడడంతో ఆర్థికంగా ఇబ్బంది గా మారింది. పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలి.

- గండిబోయిన లక్ష్మి, కొమ్మాది

సగం ఆదాయం చార్జీలకే

నేను, నా భర్త, మా అన్నయ్య అందరం పూర్ణామార్కెట్‌లో ఫ్యాన్సీ వ్యాపారం చేస్తాం. కొమ్మాది నుంచి బస్సులోనే వెళ్లి వస్తుంటాం. నెలావారీ పాస్‌ తీసుకునేవాళ్లం. పాస్‌ రేట్లు పెరిగిపోవడంతో ఒకేసారి డబ్బు పెట్టి కొనలేక రెండేళ్లుగా తీసుకోవడం లేదు. ఏరోజు చార్జీ ఆరోజే కట్టుకుని వెళ్లి వస్తున్నాం. గతంలో రూ.15 చార్జీ ఉంటే ఇప్పుడు రూ.35కి పెరిగిపోయింది. మాలాంటివారికి ఇది భారంగా మారింది.

- కేరళ కనక, కొమ్మాది

విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు చార్జీల వివరాలు

ప్రాంతం 2019 2024

చోడవరం రూ.55 రూ.75

నర్సీపట్నం రూ.105 రూ.150

విజయనగరం రూ.60 రూ.90

పార్వతీపురం రూ.170 రూ.220

శ్రీకాకుళం రూ.150 రూ.175

పాలకొండ రూ.150 రూ.185

అనకాపల్లి రూ.50 రూ.60

సబ్బవరం రూ.30 రూ.40

కొత్తవలస రూ.25 రూ.35

ఎలమంచిలి రూ.60 రూ.85

సింహాచలం రూ.20 రూ.30

గాజువాక రూ.25 రూ.35

భీమిలి రూ.30 రూ.45

కొమ్మాది రూ.20 రూ.40

రైల్వేస్టేషన్‌- తగరపువలస రూ.30 రూ.45

ఆర్టీసీ కాంప్లెక్స్‌- తగరపువలస రూ.30 రూ.40

రైల్వేస్టేషన్‌-ఆరిలోవ రూ.15 రూ.25

Updated Date - Apr 16 , 2024 | 01:37 AM