రాజీనామాకు ససేమిరా?
ABN , Publish Date - Jun 27 , 2024 | 01:11 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి మొండిగా వ్యవహరిస్తున్నారు

నోటి మాటతో చెబితే చేయను, రాతపూర్వకంగా ఇవ్వాల్సిందే
మొండికేస్తున్న ఏయూ వీసీ ప్రసాదరెడ్డి
ఆ ఉత్తర్వులు తీసుకుని న్యాయ స్థానానికి వెళ్లే యోచన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి మొండిగా వ్యవహరిస్తున్నారు. రాజీనామా చేయాలని ఉన్నతాధికారులు సూచించినా లెక్క చేయడం లేదు. తనకు నోటి మాటతో చెబితే చాలదని, రాతపూర్వకంగా ఇస్తేనే రాజీనామా చేస్తానని సందేశం పంపారు.
ఏయూ వీసీ ప్రసాదరెడ్డి గడచిన ఐదేళ్లుగా వైసీపీ కోసం బహిరంగంగానే పనిచేశారు. టీడీపీ నాయకులను విమర్శించారు. ఒక ఉన్నత విద్యా సంస్థకు జవాబుదారీగా ఉంటూ అలా మాట్లాడడం తప్పు అయినప్పటికీ ఆయన వెనకడుగు వేయలేదు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని, యూనివర్సిటీని ఏలవచ్చునని భ్రమించారు. వైసీపీ ఓడిపోయినా కుర్చీ వదలడం లేదు. గవర్నర్ నియామకం ద్వారా తనకు పదవి వచ్చింది కాబట్టి ప్రభుత్వం దానిని రద్దు చేయలేదని ఆయన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఒకవేళ రాజీనామా చేయాలని ఆర్డర్ ఇస్తే, అది చెల్లదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని అంటున్నట్టు తెలిసింది. తనను వేధిస్తే ఏ విధంగా ఎదుర్కోవాలో తెలుసునని చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై వాట్సాప్ గ్రూపుల్లో రిటైర్డ్ ఏయూ ఉద్యోగులు చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రసాదరెడ్డి పవర్ మాంగర్ (పదవీ వ్యామోహం కలిగినవాడు) అని ఒకరు విమర్శించారు. ఇంకొకరు ఆయన్ను మామూలుగా పంపకూడదని, బలవంతంగా గెంటాలని సూచించారు. ఒక విద్యా సంస్థకు అధిపతిగా వ్యవహరిస్తున్న ఆయనపై ఉద్యోగులలో ఇంత వ్యతిరేకత ఉందా?...అని అంతా ఆశ్చర్యపోతున్నారు.