Share News

తిరుపతికి వందే భారత్‌?

ABN , Publish Date - Dec 20 , 2024 | 01:20 AM

విశాఖపట్నం నుంచి వందేభారత్‌ రైళ్ల సంఖ్యను పెంచాలనే డిమాండ్‌ గట్టిగా వినిపిస్తోంది.

తిరుపతికి వందే భారత్‌?

స్లీపర్‌ కోచ్‌లతో నడిపే ప్రతిపాదన

అయితే 6 నెలలు సమయం

పడుతుందంటున్న అధికారులు

16 కోచ్‌లు, 832 నుంచి 1,128 వరకూ బెర్తులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం నుంచి వందేభారత్‌ రైళ్ల సంఖ్యను పెంచాలనే డిమాండ్‌ గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం విశాఖ నుంచి నాలుగు వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య రెండు, భువనేశ్వర్‌కు ఒకటి, దుర్గ్‌కు మరొకటి వెళుతున్నాయి. తిరుపతి, బెంగళూరు నగరాలకు కూడా విశాఖ నుంచి వందేభారత్‌ రైళ్లు నడపాలని ప్రజా ప్రతినిధులు రైల్వే అధికారులను కోరారు. అందుకు వారి నుంచి సానుకూల స్పందన వచ్చింది. అయితే ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్‌ రైళ్లు కాకుండా కొత్తగా తయారుచేస్తున్న స్లీపర్‌ కోచ్‌ రైళ్లను ఇవ్వనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. స్లీపర్‌ క్లాస్‌ వందేభారత్‌ను తొలుత డిమాండ్‌ ఎక్కువగా ఉన్న తిరుపతికి నడిపే అవకాశం ఉందంటున్నారు.

తయారీ మందగమనంతో వాయిదా

చెన్నైలోని ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో వందే భారత్‌ స్లీపర్‌ క్లాస్‌ రైళ్లు తయారవుతున్నాయి. వీటిని అత్యంత ఆధునిక టెక్నాలజీతో విలాసవంతమైన సౌకర్యాలతో రూపొందిస్తున్నారు. ఇవి గంటకు 160 కి.మీ. వేగంతో నడుస్తాయి. ప్రతి రైలులో 16 కోచ్‌లు, 832 నుంచి 1,128 వరకూ బెర్తులు ఉంటాయి. ఏసీ కోచ్‌లలో మూడు రకాలు ఉంటాయి. వీటిని ముందు 700 కి.మీ. దూరం పైబడి రాత్రిపూట ప్రయాణం చేసే మార్గాల్లో నడపాలని రైల్వే వర్గాలు నిర్ణయించాయి. స్లీపర్‌ క్లాస్‌ రైలు తయారీ పూర్తికాగానే సెప్టెంబరులో ప్రధాని మోదీ చేతులు మీదుగా ఢిల్లీ-శ్రీనగర్‌ల మధ్య ప్రారంభించాలని అనుకున్నారు. అయితే తయారీలో జాప్యం జరుగుతోంది. జనవరిలో మొదటి స్లీపర్‌ క్లాస్‌ వందే భారత్‌ పట్టాలపైకి వస్తుందని చెబుతున్నారు. ఆ లెక్కన చూసుకుంటే విశాఖపట్నం కోటా వచ్చేసరికి ఆరు నెలల సమయం పడుతుందని, జూన్‌ లేదా జూలైలో విశాఖ-తిరుపతి మధ్య స్లీపర్‌ క్లాస్‌ వందేభారత్‌ మొదలయ్యే అవకాశం ఉందని వాల్తేరు డివిజన్‌ రైల్వే వర్గాలు తెలిపాయి. ఇందులో టిక్కెట్‌ ధర రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రేట్లతో సమానంగా ఉంటుందని సమాచారం.

Updated Date - Dec 20 , 2024 | 01:20 AM