Share News

సాగునీటి కల్పనలోనూ నిర్లక్ష్యం

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:35 AM

మన్యంలోని పంట భూములకు సాగునీరందించే విషయంలోనూ వైసీపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అఽధికారంలోకి వచ్చిన తరువాత గిరిజన ప్రాంతంలో చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు.

సాగునీటి కల్పనలోనూ నిర్లక్ష్యం
కనీస మరమ్మతులకు నోచుకోని పాడేరు మండలం లగిశపల్లి ప్రాంతంలోని చెక్‌డ్యామ్‌

కనీస మరమ్మతులకు నోచుకోని చెక్‌డ్యామ్‌లు

వైసీపీ అధికారంలోకి వచ్చాక పట్టించుకోని వైనం

ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న చెక్‌డ్యామ్‌లు 1,214

మరమ్మతులకు గురైనవి 591 పైనే..

గిరిజన రైతుల గగ్గోలు

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

మన్యంలోని పంట భూములకు సాగునీరందించే విషయంలోనూ వైసీపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అఽధికారంలోకి వచ్చిన తరువాత గిరిజన ప్రాంతంలో చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు.

ఏజెన్సీ వ్యాప్తంగా 1,214 చెక్‌డ్యామ్‌లున్నాయి. వాటి కింద 62,448 ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతో సుమారుగా 30 వేల మంది గిరిజన రైతుల పంట భూములకు సాగునీటి సదుపాయం సమకూరుతున్నది. అయితే నిత్యం నీటి ప్రవాహం తాకిడి కారణంగా ప్రతి ఏడాది చెక్‌డ్యామ్‌లు మరమ్మతులకు గురికావడం, చెక్‌డ్యామ్‌ గర్భంలో పూడిక పేరుకుపోవడం, చెక్‌ డ్యామ్‌ నుంచి పంట పొలాలకు నీరు మళ్లించే చానళ్లు మరమ్మతులకు గురికావడం జరుగుతుంది. దీంతో ప్రతి ఏడాది వేసవిలో మరమ్మతులకు గురైన చెక్‌డ్యామ్‌లను గుర్తించి వాటికి అవసరమైన మరమ్మతులకు సంబంధించిన ప్రతిపాదనలను చిన్ననీటి పారుదల శాఖ అధికారులు రూపొందిస్తారు. అధికారులు రూపొందించిన ఆ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తే, అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆయా నిధులతో ఖరీఫ్‌ సాగుకు ముందే అవసరమైన మరమ్మతులు చేపట్టి చెక్‌డ్యామ్‌లను అందుబాటులోకి తీసుకువస్తారు.

చెక్‌డ్యామ్‌ల వైపు కన్నెత్తి చూడని దుస్థితి

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏజెన్సీలో చెక్‌డ్యామ్‌ల బాగోగులను చూసే పరిస్థితే లేకుండాపోయింది. దీంతో గత నాలుగున్నరేళ్లుగా మరమ్మతులకు గురైన చెక్‌డ్యామ్‌లను బాగుచేయించని దుస్థితి కొనసాగుతున్నది. చిన్ననీటి పారుదల శాఖకు నిధులు విడుదల చేయకుండా, ఆ శాఖలోని ఇంజనీర్లను పని లేకుండా ప్రభుత్వం చేసేసింది. దీంతో ఏజెన్సీలోని చిన్న నీటిపారుదల శాఖకు చెందిన డీఈఈలు, ఏఈఈలను, పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించేందుకు వినియోగించుకుంటున్నారు. ఫలితంగా ఏజెన్సీలో చిన్న నీటి పారుదల శాఖకు చెందిన ఇంజనీర్లు చెక్‌డ్యామ్‌ల వైపు కన్నెత్తి చూసే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏజెన్సీ 11 మండలాల్లో 591 పైబడి చెక్‌డ్యామ్‌లు వివిధ స్థాయిల్లో మరమ్మతులకు గురయ్యాయని, వాటికి మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని గతంలోనే చిన్న నీటి పారుదల శాఖాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో మరమ్మతులకు గురైన చెక్‌డ్యామ్‌లు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తుండగా, వాటి కిందన ఉన్న ఆయకట్టు భూములకు సాగునీరు అందని దుస్థితి కొనసాగుతున్నది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో చెక్‌డ్యామ్‌లకు మహర్దశ

ఏజెన్సీలోని గిరిజన రైతుల సాగు భూములకు నీటిని అందించే విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరిచిందని రైతులు అంటున్నారు. ప్రతి ఏడాది ఎంపిక చేసిన చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేపట్టి, వాటి కిందనున్న భూములకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టేదని రైతులు తెలిపారు. 2015 నుంచి 2020 సంవత్సరం వరకు ఐదేళ్లలో 391 చెక్‌డ్యామ్‌లను రూ.34 కోట్ల 98 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టారు. ఏజెన్సీలో 2015- 16 ఆర్థిక సంవత్సరంలో 58 చెక్‌డ్యామ్‌లకు రూ.4 కోట్ల 65 లక్షలతో మరమ్మతులు చేపట్టారు. అలాగే 2016- 17లో 22 చెక్‌డ్యామ్‌లకు రూ.కోటి 95 లక్షలు, 2017- 18లో 133 చెక్‌డ్యామ్‌లకు రూ.8 కోట్ల 59 లక్షలు, 2018- 19లో 28 చెక్‌డ్యామ్‌లకు రూ.3 కోట్లతో, 2019- 2020 ఆర్థిక సంవత్సరంలో 150 చెక్‌డ్యామ్‌లకు రూ.16 కోట్ల 79 లక్షలతో మరమ్మతులు చేపట్టారు.

--------------

మన్యంలోని మొత్తం చెక్‌డ్యామ్‌లు, వాటి కింద ఆయకట్టు వివరాలు

మండలం చెక్‌డ్యామ్‌లు ఆయకట్టు(ఎకరాల్లో..)

కొయ్యూరు 144 10,492

చింతపల్లి 93 8,260

జీకేవీధి ఽ 63 3,486

జి.మాడుగుల 80 4,495

పాడేరు 98 5207

హుకుంపేట 95 4,814

పెదబయలు 104 3,754

ముంచంగిపుట్టు 82 3,460

డుంబ్రిగుడ 85 3,877

అరకులోయ 167 7,179

అనంతగిరి 203 7,064


మొత్తం 1,214 62,448

---------------------------------------------------------------------

Updated Date - Apr 13 , 2024 | 12:35 AM