Share News

విస్సన్నపేటపై విచారణ?

ABN , Publish Date - Jun 08 , 2024 | 01:26 AM

అధికారం అడ్డు పెట్టుకుని వైసీపీ నాయకులు చేసిన భూ దందాపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. కొండలు, వాగులు, వంకలు, కాలువలు, డీ పట్టా భూములను సొంతం చేసుకుని అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం విస్సన్నపేటలో రియల్‌ వ్యాపారం సాగించిన వారిపై విచారణకు ఆదేశాలు వెలువడనున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు...గెద్దల్లా వాలిపోయి...సొంతం చేసుకున్న వ్యవహారంలో నేతలు, వారికి సహకరించిన రెవెన్యూ యంత్రాంగంతో పాటు, చర్యలు తీసుకునేందుకు వెనుకాడిన జిల్లా స్థాయి అధికారులు సైతం విచారణను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

విస్సన్నపేటపై విచారణ?
విస్సన్నపేటలో ఆక్రమిత భూము వద్ద రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన దృశ్యం

అడ్డగోలు భూ దోపిడీపై చర్యలకు రంగం సిద్ధం

ఐదేళ్లుగా వైసీపీ నేతల ఆధ్వర్యంలో కొనసాగిన దందా

ప్రభుత్వ, డీ పట్టా భూములు, గెడ్డలు, వాగులను కప్పేసి వెంచర్లు

ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు

అడుగడుగునా సహకరించిన రెవెన్యూ

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

అధికారం అడ్డు పెట్టుకుని వైసీపీ నాయకులు చేసిన భూ దందాపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. కొండలు, వాగులు, వంకలు, కాలువలు, డీ పట్టా భూములను సొంతం చేసుకుని అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం విస్సన్నపేటలో రియల్‌ వ్యాపారం సాగించిన వారిపై విచారణకు ఆదేశాలు వెలువడనున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు...గెద్దల్లా వాలిపోయి...సొంతం చేసుకున్న వ్యవహారంలో నేతలు, వారికి సహకరించిన రెవెన్యూ యంత్రాంగంతో పాటు, చర్యలు తీసుకునేందుకు వెనుకాడిన జిల్లా స్థాయి అధికారులు సైతం విచారణను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అనుచరుల కనుసన్నల్లో ఆక్రమణల పరంపర యథేచ్ఛగా సాగిపోయింది. కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలో రికార్డుల ప్రకారం వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. సర్వే నంబరు 195/2లో సుమారు 609.24 ఎకరాలను వైసీపీ నేతలు తమ కబంధ హస్తాల్లోకి తెచ్చుకున్నారు. ఇందులో కొంతమేర జిరాయితీ కాగా సుమారు 300 ఎకరాలు ప్రభుత్వ బంజరు, డీపట్టా భూములు, కొండలు, వాగులు, గోర్జులు, పంట కాలువలు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం 195/2 సర్వే నంబరులో 49.66 ఎకరాలు రంగబోలు గెడ్డగా నమోదైంది. ఇక్కడి ప్రభుత్వ భూముల్లో వందల ఎకరాలను గతంలో ప్రభుత్వాలు కొంతమంది ఎస్సీ, ఎస్టీలకు సాగు కోసం పట్టాలు అందజేశాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఖాళీ భూములపై వైసీపీ నేతల కన్ను పడింది. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగి భారీ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాకు చెందిన మంత్రి అనుచరుడు, వైసీపీ జిల్లా ముఖ్య నేత ఆధ్వర్యంలో వింటేజ్‌ రిసార్ట్స్‌ పేరుతో రియల్టర్లను రంగంలోకి దించి పనులు ప్రారంభించారు. వాస్తవానికి ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వెంచర్‌ వేయాలంటే ముందుగా గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారుల అనుమతితో పాటు తప్పనిసరిగా వీఎంఆర్‌డీఏ అప్రూవల్‌ తీసుకొని పనులు ప్రారంభించాలి. కానీ మంత్రి అండతో రియల్‌ వ్యాపారి అనుమతులు లేకుండానే పనులు చేపట్టారు. ప్రభుత్వ కొండ వాగులు, గోర్జులు, ఇతర డీపట్టా భూములను కబ్జా చేశారు. దీనికి టీడీపీ, జనసేన నాయకులు అడ్డు చెప్పడంతో గ్రామంలోని వైసీపీ కార్యకర్తలను తెరపైకి తెచ్చి, ఏళ్ల కిందటే తమకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని చెప్పించారు. ఈ వ్యవహారం వెనుక వైసీపీ పెద్దలు ఉండడంతో రెవెన్యూ అఽధికారులు అడ్డు చెప్పలేదు. దీంతో ప్రభుత్వ, డీపట్టా భూములు, కొండలు, గోర్జులు, పంట కాలువలను కలిపేసుకున్నారు. ఎక్స్‌కవేటర్లు, పొక్లైనర్‌లతో పచ్చని కొండలను పిండి చేసిన వైసీపీ నేతలు గ్రావెల్‌ను కూడా యథేచ్ఛగా విక్రయించి సొమ్ము చేసుకున్నారు. దీనిపై ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా రోడ్లు వేసేశారు.

స్పందించని యంత్రాంగం

విస్సన్నపేటలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయనే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై టీడీపీ, జనసేన నాయకులు నాడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌కు, ఆ తరువాత కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు అనేకసార్లు ఫిర్యాదులు చేశారు. అయినా వారు కనీసం పట్టించుకోలేదు. చివరకు లోకాయుక్త సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించడంతో మొక్కుబడిగా విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు కేవలం 5.39 ఎకరాలకు ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటుచేసి చేతులు దులుపుకున్నారు. ఈ భూముల విషయంలో విచారణ నివేదికను రెవెన్యూ అధికారులు గోప్యంగా ఉంచి, వైసీపీ నేతలకు సహకరించారనే విమర్శలు వెల్లువెత్తాయి.

మంత్రి భూ కబ్జాలపై విచారణ జరిపిస్తాం

విస్సన్నపేటలో అప్పటి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఆయన అనుచరులు సాగించిన భూదోపిడీపై విచారణ జరిపిస్తాం. ఈ వ్యవహారంలో కలెక్టర్‌కు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ఆక్రమిత భూముల వద్ద ధర్నా చేసినా స్పందన లేదు. మంత్రి భూదందాను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కూడా సందర్శించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో త్వరలోనే చంద్రబాబునాయుడును కలిసి విస్సన్నపేటలో వైసీపీ నేతల భూముల కబ్జా వ్యవహారంపై విచారణ జరిపించి, పేదల డీపట్టాల భూములు వారికే దక్కేలా చేస్తాం.

- పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి

Updated Date - Jun 08 , 2024 | 01:26 AM