Share News

ఉల్లంఘనులపై విచారణ

ABN , Publish Date - Jun 27 , 2024 | 01:09 AM

గత ప్రభుత్వంలో క్వారీల లీజులు, అడ్డగోలుగా చేపట్టిన తవ్వకాలపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టిసారించింది.

ఉల్లంఘనులపై విచారణ

అక్రమ క్వారీయింగ్‌పై ప్రభుత్వం దృష్టి

ఉమ్మడి జిల్లాలో నాలుగింటిపై విచారణకు ఆదేశం

నగరంలో సీబీసీఎన్‌సీ భూముల్లో మొదలైన సర్వే

పరవాడలో మాజీ మంత్రి

ముత్యాలనాయుడు క్వారీపై త్వరలో దర్యాప్తు

గుర్రంపాలెంలో అడ్డగోలుగా తవ్వకాలు

విశాఖపట్నం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి):

గత ప్రభుత్వంలో క్వారీల లీజులు, అడ్డగోలుగా చేపట్టిన తవ్వకాలపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టిసారించింది. పర్మిట్లకు మించి తవ్వకాలు చేపట్టిన క్వారీల్లో ఏ మేరకు అక్రమాలు జరిగాయో నిగ్గు తేల్చాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో నాలుగు క్వారీలపై అందిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టాలని ఆదేశించింది.

విశాఖ నగరంలోని సిరిపురం జంక్షన్‌లో సీబీసీఎన్‌సీ భూముల్లో నిర్మాణాల కోసం చేపట్టిన తవ్వకాలు, పరవాడ మండలంలో మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు కుమారుడి పేరిట తీసుకున్న క్వారీ, తాడి గ్రామంలో మరో క్వారీ, పెందుర్తి మండలం గుర్రంపాలెంలో ఏపీఐఐసీ భూముల్లో పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన ప్లాట్ల చదును పేరిట సమీపంలో కొండను తవ్వడంపై విచారణ చేయాలని గనుల శాఖకు ప్రభుత్వం సూచించింది. క్వారీయింగ్‌కు ఎంత విస్తీర్ణం మేర లీజుకు తీసుకున్నారు?, తాత్కాలిక పర్మిట్లు ఇచ్చారా?, లేదా?, పర్మిట్‌కు మించి తవ్వకాలు జరిపారా?...తదితర విషయాలపై సమగ్ర సర్వే చేయాలన్న ఆదేశాలు వచ్చాయి.

సిరిపురం జంక్షన్‌లో సీబీసీఎన్‌సీ స్థలంలో బహుళ అంతస్థుల భవనాల నిర్మాణాల కోసం లోతుగా పునాదులు తీయాల్సి ఉంది. దీనికోసం రాళ్లను దొలిచి అక్కడ నుంచి బయటకు తరలించాల్సి ఉంటుంది. ఇందుకు మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు సంబంధించిన సంస్థ లక్ష క్యూబిక్‌ మీటర్ల రాయి, మట్టి తవ్వి తరలించడానికి తాత్కాలిక పర్మిట్‌కు గనుల శాఖ నుంచి అనుమతి తీసుకుని రూ.రెండు కోట్లు రాయిల్టీగా చెల్లించింది. అయితే ప్రభుత్వం మారిన నేపథ్యంలో పలువురు ఆ స్థలంలో క్వారీయింగ్‌పై ఫిర్యాదులు చేయడంతో బుధవారం గనుల శాఖ అధికారులు సర్వే ప్రారంభించారు. తీసుకున్న తాత్కాలిక పర్మిట్లకు లోబడే తవ్వకాలు జరిపారా? లేక అదనంగా తవ్వారా? అనేది తేల్చడానికి సర్వే చేస్తున్నామని, ఇందుకు రెండు రోజులు సమయం పడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే పెందుర్తి మండలం గుర్రంపాలెం ఏపీఐఐఈ పారిశ్రామికవాడలో పలువురికి స్థలాలు కేటాయించారు. ప్లాట్ల చదును సమయంలో లేఅవుట్‌కు ఆనుకుని ఉన్న కొండ, సమీపంలో భూముల నుంచి మట్టిని తరలించారు. కొండ నుంచి మట్టి తరలింపునకు ఎటువంటి పర్మిట్లు తీసుకోలేదు. ఏపీఐఐసీ అధికారులు, సిబ్బంది ప్రోత్సాహంతోనే అక్కడ తవ్వకాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలావుండగా పరవాడ మండలంలో రెండుచోట్ల గనుల శాఖ ఇచ్చిన క్వారీల్లో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుపై విచారణ చేపట్టనున్నారు. మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు తన కుమారుడి పేరిట గ్రావెల్‌ క్వారీ తీసుకున్నారు. ఇంకా తాడిలో మరో గ్రావెల్‌ క్వారీ ఉంది. ఈ రెండు క్వారీల్లో జారీచేసిన పర్మిట్లకు మించి తవ్వకాలు చేపట్టారని ఫిర్యాదు అందినందున త్వరలో విచారణ చేస్తామని గనుల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇంకా ఉమ్మడి జిల్లాలో మరికొన్ని క్వారీలపై కూడా ఫిర్యాదులు అందాయని, అయితే వాటి వివరాలు ప్రభుత్వం నుంచి రావలసి ఉందని చెబుతున్నారు.

Updated Date - Jun 27 , 2024 | 01:09 AM