Share News

ఇంటర్‌ ఫలితాలు నిరాశాజనకం

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:39 AM

జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ ఏడాది ఇంటర్‌ ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి. అరకులోయ, సీలేరు కాలేజీల్లో ఉత్తీర్ణతా శాతం తక్కువ వచ్చింది. అలాగే తొలి ఏడాది ఇంటర్‌ ఫలితాలు జి.మాడుగుల, అనంతగిరి, ముంచంగిపుట్టు జూనియర్‌ కాలేజీల్లో ఫలితాలు ఆశాజనకంగానే వచ్చాయి.

ఇంటర్‌ ఫలితాలు నిరాశాజనకం
తక్కువ మంది ఉత్తీర్ణులైన అరకులోయ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌ తొలి ఏడాది 48 శాతం, రెండో ఏడాది 70 శాతం ఉత్తీర్ణత

అరకులోయలో ఉత్తీర్ణత 8.5 శాతం మాత్రమే

సీలేరులోనూ అంతంతమాత్రమే

మన్యంలో పూర్తి స్థాయిలో మెరుగుపడని ఇంటర్‌ విద్య

ఫలితాలు వచ్చిన రోజూ తెరుచుకోని జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ కార్యాలయం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ ఏడాది ఇంటర్‌ ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి. అరకులోయ, సీలేరు కాలేజీల్లో ఉత్తీర్ణతా శాతం తక్కువ వచ్చింది. అలాగే తొలి ఏడాది ఇంటర్‌ ఫలితాలు జి.మాడుగుల, అనంతగిరి, ముంచంగిపుట్టు జూనియర్‌ కాలేజీల్లో ఫలితాలు ఆశాజనకంగానే వచ్చాయి.

జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌ మొదటి(జనరల్‌) సంవత్సరంలో 5,623 మందికి 2689 మంది పాస్‌ కాగా ఉత్తీర్ణత శాతం 48, అలాగే రెండో ఏడాది(జనరల్‌) 4,542 మందికి 3172 మంది పాస్‌కాగా, ఉత్తీర్ణత 70 శాతంగా నమోదైంది. ఒకేషన్‌ విద్యార్థులు తొలి ఏడాది 1150 మందికి 685 మంది పాస్‌కాగా 60 శాతం, రెండో ఏడాది 961 మందికి 740 మంది పాస్‌ కాగా 77 శాతంగా నమోదైంది. అరకులోయలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 222 మందికి 19 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించగా, ఉత్తీర్ణత శాతం 8.5గా నమోదైంది. అలాగే సీలేరులో తొలి ఏడాది 44 మందికి 9 మంది పాస్‌కాగా 20 శాతం ఉత్తీర్ఱత, హుకుంపేటలో తొలి ఏడాది 229 మందికి 50 మంది పాస్‌కాగా 21.8 శాతం ఉత్తీర్ణత వచ్చింది. జి.మాడుగులలో మాత్రం మొదటి, రెండో సంవత్సర ఫలితాలు ఆశాజనకంగా రావడం విశేషం. తొలి ఏడాది 307 మందికి 250 మంది పాస్‌కాగా 81 శాతం, రెండో ఏడాది 197 మందికి 177 మంది పాసై 89.8 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా చూస్తే మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవనే చెప్పాలి.

మెరుగుపడని ఇంటర్‌ విద్య

పాడేరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడి రెండేళ్లవుతున్నా ఏజెన్సీలోని ఇంటర్‌ విద్యావ్యవస్థ మాత్రం మచ్చుకైనా మెరుగుపడలేదనే విమర్శల వినిపిస్తున్నాయి. జిల్లా లేదా రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఇంటర్‌ విద్యను పర్యవేక్షించే పరిస్థితి సంపూర్ణంగా లేదు. అలాగే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని సమస్యలు, ఇతర ఇబ్బందులను చెప్పుకోవడానికి జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులు సైతం ఇక్కడ లేరు. దీంతో గిరిజన ప్రాంతంలో ఇంటర్‌ విద్యావ్యవస్థ మెరుగుపడే అవకాశమే లేకుండా పోయింది. అలాగే ఏజెన్సీలో అనేక జూనియర్‌ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది లేకపోవడంతో ఆయా పనులు అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు నిర్వహిస్తున్నారు. దీంతో వారంతా బోధనపై దృష్టిపెట్టలేని పరిస్థితి కొనసాగుతున్నది. ఉదాహరణకు ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో బోధనేతర సిబ్బంది ఒక్కరూ లేరు. ఇలా ఏజెన్సీలో వ్యాప్తంగా అనేక కళాశాలల్లో బోధ న, బోధనేతర సిబ్బంది లేని దుస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో ఏజెన్సీలో ఇంటర్‌లో చక్కని ఫలితాలు ఆశించడం తప్పే అవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మన్యంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని పరిస్థితులను మెరుగుపరిచి గిరిజన విద్యార్థులకు చక్కని ఇంటర్‌ విద్యను అందించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

ఫలితాల రోజు తెరుచుకోని కార్యాలయం

ఇతర రోజుల్లో ఎలా ఉన్నా ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యే రోజు సంబంధిత కార్యాలయం తెరచుకోవడం సహజం. కానీ స్థానిక జిల్లా ఇంటర్‌ విద్యా కార్యాలయం మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు విడుదలైన శుక్రవారం రోజు సైతం తాళం వేసి ఉంది. ఇంటర్‌ విద్యాధికారులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు ఇతర ప్రాంతాల్లో చేసిన తప్పులకు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా పాడేరులో పోస్టింగ్‌ ఇవ్వడంతో ఇదే అదనుగా ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారులు, సిబ్బంది తమ పనులను ఆన్‌లైన్‌ లేదా వాట్సాప్‌లో చేసుకోవడంతో కార్యాలయానికి రాని పరిస్థితి నెలకొందని పలువురు అంటున్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:40 AM