Share News

జోరందుకున్న వరి కోతలు

ABN , Publish Date - Dec 29 , 2024 | 01:07 AM

ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో రైతులు వరి కోతల పనుల్లో బిజీగా ఉన్నారు. అల్పపీడనం ప్రభావంతో గత కొద్ది రోజులుగా నెలకొన్న ప్రతికూల వాతావరణంతో రైతులు వరి కోతల పనులు వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. అయితే మూడు రోజులుగా పొడి వాతావరణం నెలకొనడంతో రైతులు తిరిగి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

జోరందుకున్న వరి కోతలు
మునగపాకలో వరి కుప్పలు వేస్తున్న రైతులు

- వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ

అనకాపల్లి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో రైతులు వరి కోతల పనుల్లో బిజీగా ఉన్నారు. అల్పపీడనం ప్రభావంతో గత కొద్ది రోజులుగా నెలకొన్న ప్రతికూల వాతావరణంతో రైతులు వరి కోతల పనులు వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. అయితే మూడు రోజులుగా పొడి వాతావరణం నెలకొనడంతో రైతులు తిరిగి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వరి కోతలు జోరందుకున్నాయి. కొందరు రైతులు ఇప్పటికే కోసిన వరి కంకులను కుప్పలు వేసుకొని, నూర్పిడి పనులకు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యవసాయాధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 1.40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రెండు రోజులుగా వాతావరణం పొడిగా ఉండడంతో జిల్లాలో 80 వేల ఎకరాలకు పైగా వరి కోతలు పూర్తయినట్టు చెబుతున్నారు. అనకాపల్లి, మునగపాక, చోడవరం, చీడికాడ, మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు, రోలుగుంట, రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో ఇప్పటికే వరి కోతలు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. రైతులు వరి కుప్పలు వేసుకొని నూర్పిడి పనులకు సిద్ధమవుతున్నారు. రాంబిల్లి, ఎలమంచిలి, ఎస్‌.రాయవరం, పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో వరి కోతలు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకున్నాయి. జిల్లాలో మరో వారం రోజుల పాటు వాతావరణం ఇదే విఽధంగా కొనసాగితే, కోతలతో పాటు నూర్పిడి పనులు పూర్తవుతాయని జిల్లా వ్యవసాయాధికారి బి.మోహన్‌రావు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు.

Updated Date - Dec 29 , 2024 | 01:07 AM