Share News

జలాశయాల్లో పెరిగిన నీటి మట్టాలు

ABN , Publish Date - Jul 19 , 2024 | 11:26 PM

సీలేరు నదీ పరివాహక ప్రాంతంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జలాశయాల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. అన్ని జలాశయాలు జలకళతో కళకళలాడుతున్నాయి.

జలాశయాల్లో పెరిగిన నీటి మట్టాలు
సీలేరు రెగ్యులేటర్‌ డ్యాం వద్ద కురుస్తున్న వర్షాలకు క్రమంగా పెరుగుతున్న నీటి నిల్వలు

సీలేరు కాంప్లెక్స్‌లో మూడు టీఎంసీల జలాలు పెరుగుదల

జోలాపుట్‌లో 2,708.50 అడుగులు

బలిమెలలో 1,452.70 అడుగులు

గుంటవాడలో 1,345 అడుగులు

డొంకరాయిలో 1006.90 అడుగులు

సీలేరు, జూలై 19: సీలేరు నదీ పరివాహక ప్రాంతంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జలాశయాల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. అన్ని జలాశయాలు జలకళతో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ నెలాఖరుకు జలాశయాలన్నీ అడుగంటాయి. ఈ తరుణంలో అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో జలాశయాల నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి.

సీలేరు కాంప్లెక్సు పరిధిలో జోలాపుట్‌ జలాశయం నీటితో మాచ్‌ఖండ్‌ విద్యుత్‌ కేంద్రంలో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తారు. ఈ జలాశయం గరిష్ఠ నీటి మట్టం 2,750 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 2708.50 అడుగులకు చేరింది. ఇది ఆంధ్రా, ఒడిశా ఉమ్మడి ప్రాజెక్టు. ఇక్కడ విద్యుదుత్పత్తి అనంతరం విడుదలైన నీరు బలిమెల జలాశయంలో వచ్చి చేరుతుంది. బలిమెల జలాశయం గరిష్ఠ నీటి మట్టం 1,516 అడుగులు కాగా ప్రస్తుతం 1,452.70 అడుగులకు పెరిగింది. గుంటవాడ జలాశయం గరిష్ఠ నీటి మట్టం 1,360 అడుగులు కాగా ప్రస్తుతం 1,345 అడుగులకు చేరింది. డొంకరాయి జలాశయం గరిష్ఠ నీటి మట్టం 1037 అడుగులు కాగా, ప్రస్తుతానికి 1006.90 అడుగులకు పెరిగింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సీలేరు కాంప్లెక్సులో 3 టీఎంసీల నీటి నిల్వలు పెరిగాయని సీలేరు ఏపీ జెన్‌కో ఈఈ ప్రభాకరరావు తెలిపారు. రానున్న ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో సీలేరు నదీ పరివాహకప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తేనే బలిమెల జలాశయంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు చేరుతాయని జెన్‌కో ఈఈ ప్రభాకరరావు తెలిపారు.

Updated Date - Jul 19 , 2024 | 11:26 PM