ఆగని ఇసుక దందా
ABN , Publish Date - Nov 03 , 2024 | 01:26 AM
ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ పెట్టిన తరువాత అక్రమార్కులు బరితెగిస్తున్నారు. సొంత అవసరాలకు అని చెప్పి మండలంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వుకుని టైరుబండ్ల సహాయంతో ఒడ్డుకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్లు, లారీల్లో తరలించి కొంత దూరంలో నిల్వ చేస్తున్నారు. ఆ తరువాత దర్జాగా విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం తెలిసినా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
- ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీని దుర్వినియోగం చేస్తున్న అక్రమార్కులు
- నదీ పరివాహక ప్రాంతాల్లో దర్జాగా తవ్వుకుని తరలింపు
- కొంత దూరంలో నిల్వ చేసి అమ్మకాలు
- పట్టించుకోని అధికారులు
మాడుగుల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ పెట్టిన తరువాత అక్రమార్కులు బరితెగిస్తున్నారు. సొంత అవసరాలకు అని చెప్పి మండలంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వుకుని టైరుబండ్ల సహాయంతో ఒడ్డుకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్లు, లారీల్లో తరలించి కొంత దూరంలో నిల్వ చేస్తున్నారు. ఆ తరువాత దర్జాగా విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం తెలిసినా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
మండలంలోని తాచేరు కాలువ, సత్యవరం, దొర్ల గొటివాడ, వీవీ అగ్రహారం, వీరనారాయణం, ఎం.కోటపాడు, జంపెన, గొటివాడ అగ్రహారం, పోతనపూడి వంటి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ వ్యాపారులు దర్జాగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఇసుక తరలించే వారి దగ్గర ఈ-ట్రాన్సిట్ రిపోర్టు ఉండాలని, ప్రతీ వాహనానికి జీపీఎస్ ఉండాలని, అలా కాకుండా సొంత అవసరాలకని చెప్పి అక్రమంగా తరలిస్తే వారిపై పీడీ యాక్టు అమలు చేస్తామని తరచూ హెచ్చరించే జిల్లా అధికారులు మండలంలో నిత్యం ఇసుక తవ్వి తరలించుకుపోతున్న వారిపై కనీస చర్యలు తీసుకోకపోవడం అనుమానా లకు తావిస్తోంది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఇసుక అక్రమ వ్యాపారం యథేచ్ఛగా చేస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు కింద స్థాయి సిబ్బందిని అక్కడికి పంపి చేతులు దులిపేసుకుంటున్నారు. కింద స్థాయి సిబ్బంది మామ్మూళ్లు తీసుకుని వదిలేస్తున్నారని, అధికారులకు కూడా ఇందులో వాటా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని మండల వాసులు కోరుతున్నారు.