Share News

అందని మత్స్యకార భరోసా

ABN , Publish Date - May 27 , 2024 | 11:19 PM

చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందించాల్సిన పరిహారం కోసం మత్స్యకారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. సముద్రంలో వివిధ రకాల చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి కాలంగా భావించి ఏప్రిల్‌ 14 అర్ధరాత్రి నుంచి జూన్‌ 14 అర్ధరాత్రి వరకు సుమారు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.

అందని మత్స్యకార భరోసా
అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో నిలిపిన చేపల బోట్లు

మత్స్యకారులకు తప్పని ఎదురుచూపులు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందించాల్సిన పరిహారం కోసం మత్స్యకారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. సముద్రంలో వివిధ రకాల చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి కాలంగా భావించి ఏప్రిల్‌ 14 అర్ధరాత్రి నుంచి జూన్‌ 14 అర్ధరాత్రి వరకు సుమారు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. చేపల వేట విరామ కాలంలో మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకొనేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది మే నెల రెండో వారంలో మత్స్యకార భరోసా పథకం పేరుతో అర్హత గల ప్రతి మత్స్యకారుడికి రూ.10 వేలు వంతున వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసేది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు పరిహారం అందకపోవడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో చేపల వేట ఆధారంగా జీవనం సాగించే కుటుంబాలు 12,996 ఉన్నాయి. సుమారు 2,238 బోట్లను వీరు వినియోగిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో మత్స్యకార భరోసా భృతి కింద ప్రతి కుటుంబానికి రూ.10 వేలు వంతున 10,750 కుటుంబాలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 13న పోలింగ్‌ పూర్తయిన వెంటనే మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అధికారులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు జమ కాలేదు. అయితే ఇప్పుడు జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు వరకు ఆగాల్సిందేనని మత్స్యశాఖ అధికారులు చెబుతుండడంపై మత్స్యకారులు మండిపడుతున్నారు. ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని వాపోతున్నారు. దీనిపై జిల్లా మత్స్యశాఖాధికారి ప్రసాద్‌ వివరణ కోరగా మత్స్యకార భరోసా చెల్లింపులకు ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు మాత్రమే నిధులు విడుదల కాలేదన్నారు. లబ్ధిదారుల ఎంపిక, బడ్జెట్‌ కేటాయింపులు ఇప్పటికే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశామన్నారు. ఈసీ అనుమతి ఇవ్వగానే మత్స్యకారుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ అవుతాయని చెప్పారు.

Updated Date - May 27 , 2024 | 11:19 PM