Share News

చరిత్ర పుటల్లో... నేషనల్‌ హిస్టరీ పార్క్‌

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:29 AM

విశాఖపట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీసీ సర్కారు కీలక ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.

చరిత్ర పుటల్లో...  నేషనల్‌ హిస్టరీ పార్క్‌

నాలుగేళ్లయినా డీపీఆర్‌ పంపని ప్రభుత్వం

కేంద్రం రూ.38.2 కోట్లు మంజూరుచేసినా నిర్లక్ష్యం

సీఎం జగన్‌ చేతుల మీదుగానే శంకుస్థాపన

ఇదీ విశాఖపై వైసీపీ సర్కారు ప్రేమ!

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

విశాఖపట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీసీ సర్కారు కీలక ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీనికి ఉదాహరణ నేషనల్‌ హిస్టరీ పార్కు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో దేశంలోనే మొదటిగా భీమిలి మండలంలో ఈ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటుకు ప్రతిపాదించగా కేంద్రం నిధులు మంజూరుచేసింది. అయితే ఇప్పటికీ డీపీఆర్‌ పంపకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.

విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిని చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తరచూ చెబుతుంటారు. ఎన్నో అభివృద్ధి పనులు చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అందులో అనేకం అవాస్తవాలే. ముఖ్యమంత్రిగా డిసెంబరు, 2019లోనే జిల్లాలో సుమారు రూ.1,250 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు జగన్‌ శంకుస్థాపనలు చేశారు. వాటిని ఏడాదిలోనే పూర్తిచేయాలని జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. ఇందులో ‘నేషనల్‌ హిస్టరీ పార్కు’ ఒకటి. దీనిని రూ.75 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టే ప్రాజెక్ట్‌ కావడంతో మరిన్ని హంగులు జోడించి బడ్జెట్‌ను రూ.88.2 కోట్లకు చేర్చారు. దీంతో కేంద్రం తన వాటాగా రూ.38.2 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన రూ.50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి. సీఎం చెప్పినట్టు 2020 నాటికి ఇది పూర్తి కావాలి. కానీ ఇప్పటికీ సమగ్ర ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) కేంద్ర ప్రభుత్వానికి పంపలేదు. అతి ముఖ్యమైన ప్రాజెక్ట్‌ పరిస్థితే ఇలా ఉంటే.. విశాఖపై వారి ఆలోచన ఏమిటో అర్థమవుతోంది. పైగా దేశంలో మొదటి నేచురల్‌ హిస్టరీ పార్క్‌ ఇదే కావడం మరో విశేషం.

కాలుప్పాడలో 15 ఎకరాల కేటాయింపు

భీమిలి మండలం కాపులుప్పాడలో నేషనల్‌ హిస్టరీ పార్కు కోసం 15 ఎకరాల భూమిని కేటాయించారు. దీనికి ఏపీ నేచురల్‌ హిస్టరీ పార్క్‌ అండ్‌ మ్యూజియం(ఎన్‌హెచ్‌పీఎం) అని నామకరణం చేశారు. ఆ మార్గంలో బోర్డు కూడా పెట్టారు. దీని నిర్మాణ బాధ్యతలను ‘నేచురల్‌ హిస్టరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా’కు అప్పగించారు. ప్రాజెక్ట్‌ మంజూరైన వెంటనే శాస్త్రవేత్తలు ఎక్కడెక్కడి నుంచో అరుదైన రాళ్లు (శిలాజాలు)ను తీసుకువచ్చి ప్రదర్శనకు పెట్టారు. దేశంలో విభిన్న ప్రాంతాలు, వాతావరణాల్లో పెరిగే మొక్కలు, అడవుల్లో లభించే వృక్షాలు, సముద్రాల్లో దొరికే శిలాజాలు, పర్వత శ్రేణుల్లో కనిపించే జీవరాశులు, ఎడారుల్లో అరుదుగా కనిపించే చెట్లను ఇక్కడ పెట్టాలనేది ధ్యేయం. విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచేదిగా, కొత్త ఆలోచనలు రేకెత్తించేలా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనులకు శ్రీకారం చుట్టారు. విశాఖపట్నానికి ఇది పర్యాటక పరంగా అదనపు ఆకర్షణ అవుతుందని భావించారు.

లోగో తయారీకి పోటీ...

ప్రకృతికి, చరిత్రను ముడిపెడుతూ దేశంలో ఏర్పాటవుతున్న తొలి మ్యూజియం కావడంతో దీనికి లోగో తయారు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం పత్రికల్లో ప్రకటన ఇచ్చి డిజైన్లు ఆహ్వానించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ హిస్టరీ పార్క్‌, మ్యూజియం అండ్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌’ (ఏపీఎన్‌హెచ్‌పీ ఎంఅండ్‌ఆర్‌ఐ)ను తలపిస్తూ అర్థవంతంగా ఉండేలా డిజైన్‌ కావాలని కోరారు. వివిధ రాష్ట్రాల నుంచి 127 డిజైన్లు రాగా వాటిని ఆంధ్ర విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ విభాగానికి పంపి ఎంపిక చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్డ్‌ డైరెక్టర్‌ రమేశ్‌ రూపొందించిన డిజైన్‌ను లోగోగా ఎంపిక చేశారు.

ప్రణాళిక ఘనం...

పార్కులో 65 మిలియన్‌ సంవత్సరాల నాటి డైనోసార్‌ల నుంచి ప్రపంచంలో వింతైన జంతువుల వరకు అన్నింటి నమూనాలు పెట్టి ఎవల్యూషన్‌ పార్క్‌గా మార్చాలనుకున్నారు. సీతాకోక చిలుకలు సహజ వాతావరణంలో జీవించేలా ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేసి, 25 రకాలు పెంచాలని భావించారు. పదివేల సంవత్సరాల నాటి సముద్ర జలరాశులకు చెందిన శిలాజాలు, దేశంలో వివిధ గనుల నుంచి విలువైన స్టోన్స్‌, క్రిస్టల్స్‌, మినరల్స్‌ తేవాలని నిర్ణయించారు. అరుదైన ఔషధ మొక్కలు, సువాసనలు వెదజల్లే పుష్పాలు, ఆర్కిడ్స్‌ వేయాలనుకున్నారు. కృత్రిమ జలాశయాన్ని ఏర్పాటు చేసి, రమణీయంగా తీర్చిదిద్దాలని ప్లాన్‌ చేశారు. మ్యూజియంలో ప్రత్యేకంగా గ్యాలరీలు పెట్టి, ఆడియో, వీడియో ద్వారా వాటిపై అవగాహన కల్పించాలనుకున్నారు. విద్యుత్‌ను ఎన్ని రకాలుగా తయారు చేస్తారో.. ప్రాక్టికల్‌గా చూపించాలనుకున్నారు. కానీ ఒక్కటీ రూపుదాల్చలేదు.

ట్రస్ట్‌బోర్టులో చర్చించాకే నిర్ణయం

పార్క్‌కు సంబంధించి వీఎంఆర్‌డీఏ తరఫున డీపీఆర్‌ రూపొందించి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఎన్‌హెచ్‌పీఎం ట్రస్టు బోర్డులో దీనిపై చర్చించి గ్రీన్‌సిగ్నల్‌ లభించాకే కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. అయితే ఇంకా ట్రస్టుబోర్డు సమావేశం కాలేదు. ఎప్పుడైతే అప్పుడు పంపుతాం.

- వీఎంఆర్‌డీఏ అధికారి

Updated Date - Apr 16 , 2024 | 01:29 AM