Share News

పెందుర్తిలో... ఒకసారే చాన్స్‌!

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:46 AM

రాష్ట్రంలో రెండు జిల్లాల పరిధిలోని ఒకటే నియోజకవర్గం... రాజకీయాల్లో ప్రత్యేకత కలిగిన పెందుర్తి ప్రత్యేకత సం తరించుకుంది.

పెందుర్తిలో...  ఒకసారే చాన్స్‌!

నాలుగున్నర దశాబ్దాలుగా అదే తీరు

రెండోసారి పోటీలో పంచకర్ల, అదీప్‌రాజ్‌

ఆనవాయితీకి బ్రేక్‌ వేయనున్న 2024 ఎన్నికలు

పెందుర్తి, ఏప్రిల్‌ 19:

రాష్ట్రంలో రెండు జిల్లాల పరిధిలోని ఒకటే నియోజకవర్గం... రాజకీయాల్లో ప్రత్యేకత కలిగిన పెందుర్తి ప్రత్యేకత సం తరించుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంత ఓటర్లతో మిళితమైన ఇక్కడి ఓటర్ల తీర్పు విలక్షణమే. పెందుర్తి నుంచి ఏ పార్టీ అభ్యర్థి అయినా ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా విజ యం సాధించారు. రెండోసారి రంగంలోకి దిగినా ఫలితం వ్యతిరేకమే. నియోజవర్గం ఏర్పడి నాలుగున్నర దశాబ్దాలు గడిచింది. అప్పటి నుంచి ఇక్కడ పోటీ చేసేవారికి ఒకసారే చాన్స్‌ అనే రికార్డుకు ఈ సారి బ్రేక్‌ పడనున్నది.

ఈ నియోజకవర్గం నుంచి తమ భవితవ్యం తేల్చుకునేందకు రంగంలోకి దిగిన రెండు ప్రధాన పార్టీల నాయకులు రెండోసారి పోటీ చేస్తున్న వారే కావడంతో తరాలుగా వస్తున్న ఆనవాయితీకి బ్రేక్‌ పడే అవకాశాలే కనిపిస్తున్నాయి.

పెందుర్తి నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా పంచకర్ల రమేశ్‌బాబు పోటీలో ఉన్నారు. 2009లో పంచకర్ల రమేశ్‌బాబు, 2019లో అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ పెందుర్తి నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈసారి వీరిలో ఎవరు విజయం సాధించినా రెండోసారి ఎన్నికైనట్టు అవుతుంది. దీంతో ఒకసారే చాన్స్‌కు బ్రేక్‌ పడుతుంది.

నియోజకవర్గ ప్రస్థానమిదీ...

నియోజకవర్గం ఏర్పడిన 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన గుడివాడ అప్పన్న మరణంతో 1980లో జరిగిన ఉప ఎన్నికల్లో ద్రోణంరాజు సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థి పి.సింహాచలంపై విజయం సాధించారు. 1983లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పెతకంశెట్టి అప్పలనరసింహం చేతిలో ఓటమిపాలయ్యారు. పెతకంశెట్టికి అనకాపల్లి ఎంపీగా పోటీచేసే అవకాశం రావడంతో 1985శాసన సభ ఎన్నికల్లో పెందుర్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆళ్ల రామచంద్రరావు పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో కాంగ్రె్‌స్‌ అభ్యర్థిగా గుడివాడ గురునాథరావు పోటీచేసి టీడీపీ అఽభ్యర్థి పల్లా సింహాచలంపై గెలుపొందారు. ఆ తరువాత జరిగిన రాజకీయ సమీకరణాలతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గుడివాడ గురునాథరావు 1994లో విశాఖ 1 నుంచి పోటీచేయడంతో పెందుర్తి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ద్రోణంరాజు శ్రీనివాసరావు పోటీ చేశారు. టీడీపీ పోత్తుతో సీపీఐ అభ్యర్థిగా పోటీచేసిన మానం ఆంజనేయులు విజయం సాధించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా పెందుర్తి నుంచి 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన మానం ఆంజనేయులు మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన పి.గణబాబు కాంగ్రెస్‌ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్‌పై విజయం సాధించారు. అప్పటివరకు కాంగ్రెస్‌లో ఉన్న గుడివాడ నాగమణి 2004లో పెందుర్తి నుంచి టీడీపీ అభ్య ర్థిగా పోటీచేసి, తిప్పల గురుమూర్తిరెడ్డిపై గెలుపొందారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గణబాబుకు సీటు దక్కలేదు.

ఒకసారే చాన్స్‌

నియోజకవర్గం పనర్విభజనలో 2009 జరిగిన పెందుర్తి శాసనసభ ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా పోటీచేసిన పంచకర్ల రమేశ్‌బాబు కాంగ్రెస్‌ అభ్యర్థి గండి బాబ్జీపై గెలిచారు. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన బండారు సత్యనారాయణమూర్తి మూడో స్థానానికి పరిమితమయ్యారు. తరువాత పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో పంచకర్ల కాంగ్రెస్‌లో చేరారు. ఇదిలా ఉండగా 2014 ఎన్నికల్లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గా పోటీ చేసిన బండారు సత్యనారాయణమూర్తి వైసీపీ అభ్యర్థి గండి బాబ్జీపై గెలుపొందారు. మూడోసారి టీడీపీ అభ్యర్థిగా 2019లో రంగంలోకి దిగిన బండారు సత్యనారాయణమూర్తి రెండోసారి గెలుస్తారన్న అంచనాలకు భిన్నంగా వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ చేతిలో ఓటమి చెందారు. ఇలా నాలుగు దశాబ్దాలుగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో పెందుర్తి నుంచి ఒకరికి ఒకసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యే చాన్స్‌ దక్కింది. ఈ సారి ఆ రికార్డు మరుగునపడనుంది.

Updated Date - Apr 20 , 2024 | 01:46 AM