Share News

దర్జాగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు

ABN , Publish Date - May 08 , 2024 | 12:31 AM

పూడిమడక సముద్ర తీరంలోని లైట్‌హౌస్‌ వద్ద గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమార్కులకు వైసీపీ నాయకుల అండదండలు ఉండడంతో అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

దర్జాగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు
పూడిమడక సముద్ర తీరంలో గ్రావెల్‌ తవ్వుతున్న దృశ్యం

- పూడిమడక సముద్ర తీరంలోని లైట్‌హౌస్‌ వద్ద భారీగా తవ్వి తరలింపు

- వైసీపీ నాయకుల అండదండలు ఉండడంతో బరితెగింపు

- పట్టించుకోని అధికారులు

అచ్యుతాపురం, మే 7: పూడిమడక సముద్ర తీరంలోని లైట్‌హౌస్‌ వద్ద గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమార్కులకు వైసీపీ నాయకుల అండదండలు ఉండడంతో అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

పూడిమడకలో పొగిరి వద్ద హార్బర్‌ నిర్మించడానికి ప్రతిపాదనలు రూపొందించారు. సముద్ర తీరంలో నిర్మించే హార్బర్‌కి పూడిమడక నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టారు. పూడిమడక- లోవపాలెం రోడ్డు నుంచి సముద్ర తీరం వరకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. కాగా పూడిమడక శివారు జాలరిపాలెం కొండ వద్ద లైట్‌హౌస్‌ను నిర్మించారు. ఈ కొండ వద్ద గ్రావెల్‌ ఉంటుందన్న విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదు. సముద్ర తీరం కాబట్టి ఈ ప్రాంతమంతా ఇసుక ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో మూడు అడుగుల ఇసుక తొలగించిన తరువాత మంచి గ్రావెల్‌ నిక్షేపాలున్నట్టు కాంట్రాక్టర్‌ గుర్తించాడు. ప్రస్తుతం పూడిమడక పంచాయతీ వైసీపీ అధికారంలో ఉంది. అంతే నాయకులతో మాట్లాడి గుట్టుచప్పుడు కాకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు ప్రారంభించారు. సాధారణంగా మత్స్యకారులు జాలరిపాలె- కడపాలెం మధ్య పడవలు పెట్టి ప్రతి రోజు చేపల వేట కొనసాగిస్తుంటారు. లైట్‌హౌస్‌ వెనుక వైపునకు వెళ్లరు. అందువల్ల భారీ స్థాయిలో గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నా ఈ విషయం ఇంతవరకు వారికి తెలియలేదు. మంగళవారం కొంతమంది మత్స్యకారులు అటుగా వెళ్లడంతో ఈ విషయం బయటపడింది. ఇప్పటికే భారీ స్థాయిలో గ్రావెల్‌ తవ్వి రోడ్డు వేసేశారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రపు అలలు లైట్‌హౌస్‌ వెనుక ఉన్న కొండను తాకుతాయి. ప్రస్తుతం లైట్‌ హౌస్‌ కొండకు, సముద్రానికి మధ్య భారీ స్థాయిలో గ్రావెల్‌ తవ్వకాలు ప్రారంభించారు. దీంతో గ్రామానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే మంగళవారం సాయంత్రం పనులను అడ్డుకున్నామని, దీనిపై పోరాటం చేస్తామని సీపీఎం నాయకుడు చేపల తాతలు తెలిపారు.

-

Updated Date - May 08 , 2024 | 12:31 AM