Share News

ఆదమరిస్తే గోతిలో పడ్డట్టే!

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:40 PM

చెరువును తలపించేలా గోతులు.. వాహనాలు రాకపోకలు సాగించడానికి కూడా వీలు లేని అధ్వాన పరిస్థితులు.. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో గోతుల్లో నీరు చేరి ప్రమాదాలకు గురవుతున్న వాహనచోదకులు.. ఇదీ మండలంలోని తట్టబంద- తోటకూరపాలెం రోడ్డు దుస్థితి. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో కనీసం ఈ రహదారికి మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

ఆదమరిస్తే గోతిలో పడ్డట్టే!
తట్టబంద కాన్వెంట్‌ వద్ద చెరువును తలపించేలా ఉన్న భారీ గొయ్యి

చెరువును తలపించేలా తట్టబంద- తోటకూరపాలెం రోడ్డు

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మరమ్మతులకు నోచుకోని వైనం

వాహనచోదకులకు తప్పని ఇబ్బందులు

రావికమతం, జూలై 8: చెరువును తలపించేలా గోతులు.. వాహనాలు రాకపోకలు సాగించడానికి కూడా వీలు లేని అధ్వాన పరిస్థితులు.. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో గోతుల్లో నీరు చేరి ప్రమాదాలకు గురవుతున్న వాహనచోదకులు.. ఇదీ మండలంలోని తట్టబంద- తోటకూరపాలెం రోడ్డు దుస్థితి. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో కనీసం ఈ రహదారికి మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

మండలంలోని తట్టబంద మీదుగా తోటకూరపాలెం వెళ్లే ఆర్‌ అండ్‌ బీ రోడ్డు గోతులమయంగా ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గోతుల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రావికమతం- అనకాపల్లికి ఇది ప్రధాన రహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ రహదారి రావికమతం నుంచి తోటకూరపాలెం వరకు ఆపై తీడ కన్నూరుపాలెం, తాళ్ళపాలెం వెళ్లే ప్రధాన రహదారిని కలిపి ఉంది. రావికమతం, బుచ్చియ్యపేట, మాకవరపాలెం మండలాల్లో సుమారు వంద గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి. ఎర్రవాయి ప్రాంత ప్రజలంతా నిత్యం ఇటు రావికమతానికి, అటు అనకాపల్లి, తాళ్ళపాలేనికి ఈ రహదారి గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రోడ్డు గతంలో పంచాయతీరాజ్‌ పరిధిలో ఉండేది. ఆ సమయంలోనే మెటల్‌ రోడ్డుగా ఉన్న ఈ రోడ్డును తారు రోడ్డుగా అభివృద్ధి చేశారు. పంచాయతీరాజ్‌ నుంచి రోడ్డు నిర్వహణకు నిధులు సక్రమంగా లేవని గత ప్రభుత్వ హయాంలో ఆర్‌ అండ్‌ బీలో విలీనం చేశారు. అయితే క్వారీ, సరుగుడు, వివిధ భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో ఈ రోడ్డు అడుగుకో గొయ్యి చొప్పున చెరువును తలపించే విధంగా తయారైంది. దీంతో ఈ రోడ్డులో ప్రయాణం నరకప్రాయంగా మారింది. గత వైసీపీ పాలకుల హయాంలో కనీసం రోడ్డు మరమ్మతులకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ రోడ్లపై అత్యవసర రోగులను, గర్భిణులను సకాలంలో ఆస్పత్రికి తరలించలేకపోతున్నామని ఎర్రవాయి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలోనైనా ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్‌ అండ్‌ బీ మాడుగుల సెక్షన్‌ జేఈ సాయి శ్రీనివాస్‌ను వివరణ కోరగా ఈ రహదారి అభివృద్ధికి రూ.3 కోట్లు అవసరమని ప్రతిపాదనలు తయారు చేసి గత ప్రభుత్వానికి పంపామని, అయితే నిధులు మంజూరు కాలేదన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 11:40 PM