Share News

ఒక్క చాన్స్‌ ఇస్తే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:45 AM

ఒక్కసారి తనకు చాన్స్‌ ఇస్తే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్‌ హామీ ఇచ్చారు.

ఒక్క చాన్స్‌ ఇస్తే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు
రోలుగుంటలో ప్రచారం నిర్వహిస్తున్న కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌

ప్రచార సభలో కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌ హామీ

చోడవరం టీడీపీ అభ్యర్థి రాజుతో కలిసి రోలుగుంటలో రోడ్డు షో

రోలుగుంట, ఏప్రిల్‌ 19 : ఒక్కసారి తనకు చాన్స్‌ ఇస్తే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్‌ హామీ ఇచ్చారు. మండల కేంద్రం రోలుగుంటలో శుక్రవారం రాత్రి ఆయన రోడ్డు షో నిర్వహించారు. చోడవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజుతో కలిసి గ్రామ పురవీధుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం మంజూరు చేసిన పథకాలకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ స్టిక్కర్లు వేసుకుని తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుపై తనకు, సైకిల్‌ గుర్తుపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. ఎంపీటీసీ రామకృష్ణ మాట్లాడుతూ తమ గ్రామంలో నీటి సమస్య పరిష్కరించాలని, యువతకు ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని సీఎం రమేష్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గుములూరు చంద్రమౌళి, బీజేపీ మండల అధ్యక్షుడు కర్రి తమ్మునాయుడు, జనసేన మండల అధ్యక్షుడు బలిజి మహారాజు, స్థానిక ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ, సర్పంచ్‌ వరలక్ష్మి తదితరులతో పాటు మూడు పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:46 AM