Share News

అమ్మాయి పుడితే ఆమడదూరం!

ABN , Publish Date - Oct 27 , 2024 | 01:37 AM

ఆడపిల్ల పుట్టిందని భార్యను వేధిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది నమోదైన 20 కేసుల్లో కొత్తగా వివాహమైనవారు ఐదుగురు ఉన్నారు. రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టిందని మరో పది మంది వరకు, మూడో కాన్పులోనూ ఆడ పిల్ల పుట్టడంతో మరో ఇద్దరు ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొందరైతే మూడోసారి గర్భం వచ్చినప్పుడు ముందుగానే పరీక్ష చేయించి ఆడ పిల్ల పుడుతుందని చెప్పారంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఇటువంటి వేధింపులు భరించలేక బాధితులు డీవీ సెల్‌తోపాటు పెద్దల దృష్టికి తీసుకువెళుతున్నారు.

అమ్మాయి పుడితే  ఆమడదూరం!

ఇంకా కొనసాగుతున్న లింగ వివక్ష

ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసేందుకు

సిద్ధమవుతున్న కొంతమంది ప్రబుద్ధులు

ప్రసవానంతరం ఆమెను పుట్టింటి నుంచి

తీసుకొచ్చేందుకు నిరాకరణ

పెద్దల వద్ద పంచాయితీలు

అక్కడా తెగకపోవడంతో

గృహ హింస రక్షణ విభాగాన్ని ఆశ్రయిస్తున్న బాధితులు

మానసిక, శారీరక వైకల్యంతో పుట్టినా వేధింపులు

అంతా పురుషాహంకరం

విశాఖపట్నం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):

‘‘పెళ్లై రెండేళ్లవుతుంది. కొద్దిరోజుల కిందట పాప పుట్టింది. అమ్మాయి పుట్టిందని సంతోషపడ్డాను. ఆ సంతోషం కొన్ని గంటలు కూడా నిలవలేదు. అమ్మాయి పుట్టిందని చెప్పి అత్తింటి వాళ్లు చూసేందుకు కూడా రాలేదు. భర్త వచ్చి చూసి వెళ్లిపోయాడు. ఆ తరువాత నాలుగు నెలలు రాలేదు. పుట్టింటి నుంచి నన్ను తీసుకువెళ్లలేదు. తీరా ఇప్పుడు చూస్తే వదిలేస్తా అంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు’

- ఇదీ గృహ హింస (డొమెస్టిక్‌ వయొలెన్స్‌) సెల్‌కు గాజువాక ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు.

‘‘ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మళ్లీ పిల్లలు వద్దని చెప్పాను. అయినా వినలేదు. ఇప్పుడు మళ్లీ పాప పుట్టింది. నువ్వు పుట్టింటికి వెళ్లిపో అంటున్నారు. పిల్లలను కూడా పట్టించుకోవడం లేదు. నా తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి పెళ్లి చేశారు. ఇప్పుడు నాతోపాటు మరో ముగ్గురి భారాన్ని మోసే స్థోమత వాళ్లకు లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. మీరే న్యాయం చేయాలి’

- ఇదీ మధురవాడ ప్రాంతానికి చెందిన మరో మహిళ ఫిర్యాదు.

ఆడపిల్ల పుడితే చాలామంది లక్ష్మీదేవి పుట్టిందని సంతోషిస్తారు. కానీ, కొద్దిమంది ఇప్పటికీ ఆడపిల్లలను భారంగా భావిస్తున్నవాళ్లు ఉన్నారు. అమ్మాయి పుట్టిందని కట్టుకున్న భార్యను వదిలేసేందుకు కూడా సిద్ధపడుతున్నారు. ఇటువంటి కేసులు ఎంవీపీ కాలనీలోని డొమెస్టిక్‌ వయులెన్స్‌ సెల్‌లో నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 20కిపైగా నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది 20 కేసులు..

ఆడపిల్ల పుట్టిందని భార్యను వేధిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది నమోదైన 20 కేసుల్లో కొత్తగా వివాహమైనవారు ఐదుగురు ఉన్నారు. రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టిందని మరో పది మంది వరకు, మూడో కాన్పులోనూ ఆడ పిల్ల పుట్టడంతో మరో ఇద్దరు ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొందరైతే మూడోసారి గర్భం వచ్చినప్పుడు ముందుగానే పరీక్ష చేయించి ఆడ పిల్ల పుడుతుందని చెప్పారంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఇటువంటి వేధింపులు భరించలేక బాధితులు డీవీ సెల్‌తోపాటు పెద్దల దృష్టికి తీసుకువెళుతున్నారు.

విడాకులు ఇచ్చేయాలని..

అమ్మాయి పుట్టిందని భార్యను పూర్తిగా విడిచిపెట్టేందుకు కొంతమంది సిద్ధపడుతున్నారు. ఇందులో కుటుంబ సభ్యులు ప్రమేయం కూడా ఉంటోంది. తల్లిదండ్రులు, తోడబుట్టినవాళ్ల మాటలు విని ఎంతోమంది భర్తలు విడాకులు నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ప్రసవానికని పుట్టింటి వద్ద దించి వస్తున్న వాళ్లు...ఆ తరువాత ఆడపిల్ల పుడితే అటు వైపు చూడడం లేదు. అమ్మాయి పుట్టింది కాబట్టి తనకు విడాకులు ఇచ్చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. స్థానికంగా పెద్దల సమక్షంలో పంచాయితీలు పెడుతున్నారని, వారు చెప్పినా వినిపించుకోకపోవడంతో తమ వరకు ఫిర్యాదులు వస్తున్నట్టు డీవీ సెల్‌ అధికారులు చెబుతున్నారు.

వైకల్యంతో పుట్టినా ఇబ్బందే..

పిల్లలు వైకల్యంతో పుట్టినా కొందరు తల్లిపై నెపాన్ని నెట్టేస్తున్నారు. డౌన్‌ సిండ్రోమ్‌, మానసిక సమస్యలు, చేతులు, కాళ్లలో వైకల్యంతో పిల్లలు పుట్టినా వదిలేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాదిలో ఇటువంటి కేసులు ఐదు వరకు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. పుట్టిన పిల్లల అవకరాలకు భార్యను బాధ్యులను చేసి విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడడం అత్యంత దారుణమైన విషయమని డీవీ సెల్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఆయా కేసులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి ఇరుపక్షాలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నామని, అయితే పరిష్కారం పెద్దగా లభించడం లేదని వాపోతున్నారు. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా పురుషులు విడాకులు అన్న మాటను పట్టుకుని ఉంటున్నారని, కొందరు మెత్తబడినా కుటుంబ సభ్యులు అందకు అంగీకరించడం లేదని చెబుతున్నారు. దీనివల్ల కోర్టుల వరకు కేసులు వెళుతున్నట్టు చెబుతున్నారు. కొన్ని ఇప్పటికీ కౌన్సెలింగ్‌ దశలో ఉన్నాయంటున్నారు.

కారణం తండ్రే..

ఆడ పిల్ల, మగ పిల్లాడు ఎవరు పుట్టినా దానికి పురుషుడి క్రోమోజోములే కారణం. కానీ, ఈ విషయం తెలియక చాలామంది తల్లిని బాధ్యులుగా చూసి వేధింపులకు గురిచేస్తుంటారు. మహిళలో ఎక్స్‌ఎక్స్‌ క్రోమోజోమ్స్‌ ఉంటాయి. పురుషుల్లో ఎక్స్‌, వై క్రోమోజోమ్స్‌ ఉంటాయి. మహిళలో ఉండే ఎక్స్‌ క్రోమోజోమ్‌తో పురుషుడిలో ఉండే ఎక్స్‌ క్రోమోజోమ్‌ కలిస్తే ఆడ పిల్ల, వై క్రోమోజోమ్‌ కలిస్తే మగబిడ్డ పుడతారు. కానీ, ఈ విషయం తెలియక ఎంతోమంది పురుషులు ఆడ పిల్ల పుట్టడానికి తల్లిని బాధ్యురాలిని చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

లింగ వివక్ష నేరం

- డాక్టర్‌ టి.పద్మావతి, విశ్రాంత గైనకాలజిస్టు, కేజీహెచ్‌

లింగ వివక్ష చూపించడం నేరం. ఇటువంటి వివక్ష చూపించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఆడ పిల్ల పుట్టడానికి తల్లి కారణం కాదు. పురుషుడి క్రోమోజోమ్స్‌ వల్లే ఆడ పిల్లగానీ, మగపిల్లాడు గానీ పుడతాడు. దీనికి తల్లిని బాధ్యురాలిని చేయడం తప్పు. పిల్లలు పుట్టక ఎంతోమంది తల్లిదండ్రులు మథనపడుతున్నారు. ఈ మధ్యకాలంలో సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆడ, మగ అంటూ లింగ వివక్ష చూపించడం సమంజసం కాదు. అబ్బాయిలకు ఎందులోనూ తీసిపోని విధంగా అమ్మాయిలు రాణిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే అబ్బాయిలు కంటే అమ్మాయిలే అనేక రంగాల్లో ముందంజలో ఉన్నారు. ఈ విషయంలో అపోహలు వీడి ఎవరు పుట్టినా అపురూపంగా చూసుకోవాలి. ఎందరికో ఉన్న సమస్య మీకు లేనందుకు ఆనందంగా ఉండాలి.

Updated Date - Oct 27 , 2024 | 01:37 AM