అనిత అనే నేను...
ABN , Publish Date - Jun 13 , 2024 | 01:35 AM
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి కేవలం ఒక్కరికి మాత్రమే రాష్ట్ర కేబినెట్‌లో స్థానం దక్కింది. పాయకరావుపేట నుంచి టీడీపీ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనితను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైసీపీ అక్రమాలు, అన్యాయాలపై చేసిన పోరాటానికి ఫలితంగా మంత్రి పదవి లభించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక వర్గం కూడా కొంతవరకు దోహదపడింది. చక్కటి వాక్చాతుర్యం, ఉన్నత విద్య, ధైర్యంగా మాట్లాడగల నేర్పు...ఇవన్నీ ఆమెకు ప్లస్ పాయింట్లుగా మారాయి.
మంత్రివర్గంలో పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు చాన్స్
ఉపాధ్యాయురాలి నుంచి మంత్రి స్థాయికి...
2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
ఇటీవల ఎన్నికల్లో భారీ మెజారిటీతో రెండోసారి విజయం
విశాఖపట్నం/పాయకరావుపేట, జూన్ 12:
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి కేవలం ఒక్కరికి మాత్రమే రాష్ట్ర కేబినెట్‌లో స్థానం దక్కింది. పాయకరావుపేట నుంచి టీడీపీ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనితను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైసీపీ అక్రమాలు, అన్యాయాలపై చేసిన పోరాటానికి ఫలితంగా మంత్రి పదవి లభించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక వర్గం కూడా కొంతవరకు దోహదపడింది. చక్కటి వాక్చాతుర్యం, ఉన్నత విద్య, ధైర్యంగా మాట్లాడగల నేర్పు...ఇవన్నీ ఆమెకు ప్లస్ పాయింట్లుగా మారాయి.
ఇదీ ప్రస్థానం
విద్యావంతురాలైన వంగలపూడి అనిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో ఉద్యోగానికి రాజీనామా చేసి, 2013లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోమారు అక్కడి నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. బుధవారం నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో అనిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కుటుంబ నేపథ్యం...
ఉమ్మడి విశాఖ జిల్లా సబ్బవరంలో వంగలపూడి అప్పారావు, స్నేహలత దంపతులకు 1979 మార్చి 24న అనిత జన్మించారు. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ వరకు సబ్బవరంలో చదువుకున్న ఆమె డిగ్రీ అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాలలో చేశారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేసి బీఈడీ పూర్తిచేశారు. ఆ తరువాత ఎంఈడీ చేశారు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా పాయకరావుపేట మండలం గజపతినగరం, నర్సీపట్నం మండలం వేములపూడి పాఠశాలల్లో పనిచేశారు. అనంతరం పదోన్నతిపై ఓపెన్ స్కూల్స్ జిల్లా కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి, 2013లో తెలుగుదేశం పార్టీలో చేరారు. నియోజక ఇన్‌చార్జిగా నియమితురాలైన ఆమె 2014 ఎన్నికల్లో పోటీ చేసి 2,828 ఓట్ల మెజారిటీతో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీలో చక్కటి వాక్చాతుర్యం కలిగిన నేతగా గుర్తింపు పొందారు. 2018లో టీటీడీ బోర్డు మెంబరుగా అనితకు అవకాశం వచ్చినప్పటికీ, అప్పట్లో దానిపై వివాదం తలెత్తడంతో ఆమె ప్రమాణ స్వీకారం చేయకుండా స్వచ్ఛందంగా తప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆమె కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత నుంచి పాయకరావుపేట ఇచ్‌చార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2021లో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా, అనంతరం పొలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమితులైన ఆమె పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు సమర్థంగా చేపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా వెరవకుండా సమస్యలపై పోరాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి మరోమారు పోటీ చేసిన ఆమె 43,727 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆమె సేవలకు గుర్తింపుగా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో పాయకరావుపేట నియోజకవర్గానికి తొలిసారి మంత్రి పదవి లభించినట్టయ్యింది.