Share News

డోలీ మోతలు ఇంకెన్నాళ్ల్లు?

ABN , Publish Date - Feb 01 , 2024 | 10:44 PM

ఏజెన్సీలోని చాలా గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. ఎంత దూరమైనా గిరిజనులు కాలినడకన వెళ్లాల్సిందే. మారుమూల ప్రాంతాల్లోని రోగులు, గర్భిణులను ఆస్పత్రులకు తీసుకువెళ్లాలంటే డోలీ మోతలు తప్పడం లేదు. ఈ క్రమంలో సకాలంలో వైద్య సేవలు అందక మృత్యువాత పడిన వారు ఎందరో ఉన్నారు. కానీ పాలకులు, అధికారుల్లో చలనం లేదు.

డోలీ మోతలు ఇంకెన్నాళ్ల్లు?
పెదయలు మండలం ఇంజెరి పంచాయతీ మూలలోవలో గర్భిణిని డోలీలో మోసుకెళుతున్న గిరిజనులు (ఫైల్‌)

ఏజెన్సీలో రోడ్డు, రవాణా సదుపాయాలు లేక ఇక్కట్లు

మొత్తం 3,803 గ్రామాలకు గాను ఇప్పటికీ రోడ్డు లేనివి 1,648

మారుమూల ప్రాంతాలకు కాలినడకనే గిరిజనుల ప్రయాణం

డోలీ మోతలపై రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఈ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

ఏజెన్సీలోని చాలా గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. ఎంత దూరమైనా గిరిజనులు కాలినడకన వెళ్లాల్సిందే. మారుమూల ప్రాంతాల్లోని రోగులు, గర్భిణులను ఆస్పత్రులకు తీసుకువెళ్లాలంటే డోలీ మోతలు తప్పడం లేదు. ఈ క్రమంలో సకాలంలో వైద్య సేవలు అందక మృత్యువాత పడిన వారు ఎందరో ఉన్నారు. కానీ పాలకులు, అధికారుల్లో చలనం లేదు. రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుందామన్న ధ్యాసే లేదు. దీంతో గిరిజనులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు.

రహదారి సౌకర్యం లేక ఏజెన్సీలోని పలు గిరిజన గ్రామాల ప్రజలు రోగులు, గర్భిణులను అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి తరలించడానికి డోలీలను వినియోగిస్తున్నారు. కిలో మీటర్ల మేర డోలీతో నడవాల్సిన దుస్థితి ఉంది. ఈ క్రమంలో గిరిజనులకు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడడం సర్వసాధారణమైంది. ఈ సమస్యపై హైకోర్టు న్యాయవాది ఎలిశెట్టి సోమరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన రాష్ట్ర హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. నేటి సమాజంలో డోలీ మోతలు చూస్తుంటే ఆదిమ సమాజం గుర్తొస్తుందంటూ ఘాటుగా పేర్కొనడంతో పాటు గిరిజన ప్రాంతంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజనలో రోడ్డు నిర్మిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని హైకోర్టు సూచించింది. డోలీ మోత సమస్య, రోడ్ల నిర్మాణాలపై కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావులతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తాజాగా హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలతో గిరిజన ప్రాంతాల్లోని ‘డోలీ మోతలు- గిరిజనుల వెతలు’ మరో మారు చర్చనీయాంశమైంది.

ఏజెన్సీలో 1,648 గ్రామాలకు రోడ్డు లేదు

ఏజెన్సీ 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీల పరిధిలో 3,803 గిరిజన గ్రామాలుండగా, వాటిలో 2,155 గ్రామాలకు మాత్రమే రోడ్డు సదుపాయం ఉంది, మిలిగిన 1,648 గ్రామాలకు ఎటువంటి రోడ్డు సదుపాయం లేదు. పైగా వాటిలో 972 గ్రామాలు అత్యంత మారుమూల ప్రాంతాల్లో వున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లోని గిరిజనులు కొండలు కోనలు, వాగులు వంకలు దాటుకుంటూ బాహ్య ప్రపంచానికి చేరుకుంటున్నారు. మామూలుగా అయితే కాలినడకన గిరిజనులు ఎంత దూరమైన రాకపోకలు సాగిస్తారు. కానీ అనారోగ్య సమస్యలు, గర్భిణులకు పురిటి నొప్పులు వచ్చినప్పుడు వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. రోగులను, గర్భిణులను డోలీల్లో కొండ కోనల్లోంచి పదుల కిలోమీటర్లు మోసుకుని వచ్చి రోడ్డున్న ప్రాంతాలకు చేరుకుని, అక్కడి నుంచి అంబులెన్సుల్లో ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. ఈ ప్రయాణంలో రోగులు, గర్భిణుల పరిస్థితులు విషమిస్తే అంతే సంగతులు. దేవుడిపై భారం వేసి కొండ కోనల్లోంచి రోడ్డు ప్రాంతాలకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. అందువల్లే ఏజెన్సీలో నిత్యం ఏదో ప్రాంతంలో రోగి లేదా గర్భిణిని డోలీల్లో మోసుకువస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏజెన్సీలో ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకేవీధి, కొయ్యూరు, పాడేరు, హుకుంపేట మండలాల్లోనే అధికంగా రోడ్లు లేని మారుమూల గిరిజన గ్రామాలున్నాయి.

రోడ్ల నిర్మాణంపై పాలకులకు చిత్తశుద్ధి కరవు

మన్యంలో రోడ్ల నిర్మాణంపై పాలకులకు చిత్తశుద్ధి లేని కారణంగానే ఇప్పటికీ గిరిజనులకు కాలినడక ప్రయాణాలు తప్పడం లేదు. ఏజెన్సీ మారుమూల ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజనలో పక్కా తారురోడ్లను మంజూరు చేస్తున్నది. ఫలితంగానే ఏజెన్సీలో కొంత వరకైనా మారుమూల ప్రాంతాల వాసులకు రహదారుల సదుపాయం వుంది. కాగా రోడ్లపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం దృష్టి సారించకపోవడంతో గిరిజనుల రోడ్డు, రవాణా వెతలు తీరడం లేదనే వాదన బలంగా ఉంది. నిధుల లేమి కారణంగా వున్న రోడ్లకే మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఇక గిరిజన ప్రాంతాల్లోని మారుమూల పల్లెలకు రోడ్ల నిర్మాణం కలగా మిగిలిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులు సైతం కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు రప్పించి, ఏజెన్సీలో రోడ్ల నిర్మాణానికి కృషి చేయాలనే ఆలోచన చేయడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో రోడ్లు, రవాణా సదుపాయాలు కల్పిస్తేనే గిరిజనులకు అభివృద్ధి ఫలాలు చేరువవుతాయనే సత్యాన్ని పాలకులు గుర్తించాలని పలువురు కోరుతున్నారు.

మన్యంలో డోలీ మోతలు, మృత్యువాతల ఘటనలు కొన్ని..

- పాడేరు మండలం బడిమెల పంచాయతీ పరిధి వల్లాయి గ్రామంలో గతంలో పిడుగు పాటుకు గాయపడిన మాదెల పెద్దమ్మను రెండు కిలోమీటర్లు డోలీలో మోసుకువచ్చి అక్కడి నుంచి వేరే వాహనంలో ఆస్పత్రి తరలించారు.

- హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ కామయ్యపేట గ్రామానికి చెందిన గర్భిణి గొల్లోరి పుష్ఫ(29)కు రక్తహీనత అఽధికమై సకాలంలో వైద్యం అందక గతంలో మృతి చెందింది.

- చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ పాలమామిడి గ్రామానికి చెందిన సిందేరి దేవి గర్భిణి, పురిటి నొప్పులు రావడంతో గ్రామానికి దూరంగా ఉన్న తాజంగి పీహెచ్‌సీకి డోలీలో తీసుకుని వెళుతున్న క్రమంలో అడవిలోనే ప్రసవించింది.

- కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ కుంబుర్ల గ్రామానికి చెందిన గర్భిణి కొర్రా రోజా(22)కి ఇటీవల పురిటి నొప్పులు రావడంతో గ్రామం నుంచి డోలీలో డౌనూరు పీహెచ్‌సీకి మోసుకువస్తున్న క్రమంలో ఆమె మృతి చెందింది.

- పెదబయలు మండలం గోమంగి పంచాయతీ బోడ్డాపుట్టు గ్రామానికి చెందిన గర్భిణి అమిడేలు విజయకు ఇటీవల పురిటి నొప్పులు రావడంతో రెండు కిలోమీటర్లు డోలీలో మోసుకువచ్చి అక్కడి నుంచి 108లో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Feb 01 , 2024 | 10:44 PM