కలుషిత జల్ ఇంకెన్నాళ్లు?
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:00 PM
జల్‌జీవన్ మిషన్ పథకం కింద పట్టణంలో రూ.13 కోట్లతో నిర్మించిన భారీ తాగునీటి పథకం ప్రారంభంలోనే స్థానికులకు చుక్కలు చూపిస్తున్నది. ఇంటింటికీ కొళాయిల ద్వారా తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది.

జల్‌జీవన్ మిషన్ పనుల్లో డొల్లతనం
రూ.13 కోట్లు వెచ్చించి పథకం నిర్మించినా చోడవరంలో తప్పని తాగునీటి సమస్య
గత ప్రభుత్వంలో మంత్రి బంధువుకు కాంట్రాక్ట్
ఇష్టారాజ్యంగా పనులు
పనులు పూర్తయినట్టు చూపించి ఎన్నికల ముందు హడావిడిగా ప్రారంభం
తరచూ మోటార్లకు మరమ్మతులు, పైపులైన్ల లీకేజీలు
చోడవరం వాసులకు తప్పని అవస్థలు
చోడవరం, జూలై 28: జల్‌జీవన్ మిషన్ పథకం కింద పట్టణంలో రూ.13 కోట్లతో నిర్మించిన భారీ తాగునీటి పథకం ప్రారంభంలోనే స్థానికులకు చుక్కలు చూపిస్తున్నది. ఇంటింటికీ కొళాయిల ద్వారా తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. దీని ద్వారా తాగునీరు అంతంత మాత్రంగానే అందుతుండగా, ఇక ఈ పథకం మోటార్లు, పైపులైన్లు తరచూ మరమ్మతులకు గురవుతుండడం, సరఫరా అవుతున్న నీరు కూడా తరచూ కలుషితంగా వస్తుండడంతో ఈ పథకం పనుల్లో డొల్లతనం బయటపడిందని స్థానికులు విమర్శిస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పాటు నత్తనడకన సాగుతూ వచ్చిన ఈ తాగునీటి పథకం పనులు పూర్తయినట్టు చూపించి ఎన్నికల ముందు హడావిడిగా తాగునీటి సరఫరా ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభమైన తరువాత పట్టణంలో వేసిన పైపులైన్లు తరచూ లీకైపోతుండడం, తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో పాటు బురద నీరు సరఫరా అవుతుండడంతో పంచాయతీ అధికారులు తల పట్టుకుంటున్నారు.
పనుల్లో డొల్లతనం
మండలంలోని జన్నవరం వద్ద పెద్దేరు నదిలో ఈ పథకం కోసం నిర్మించిన భారీ పంపుహౌస్‌లో నీటిని లిఫ్ట్ చేసే మూడు మోటార్లు కూడా తరచూ మరమ్మతులకు గురవుతుండడం, నీటిని సరిగా పంపింగ్ చేయకపోవడం ఈ పనుల నాణ్యతకు అద్దం పడుతోంది. అప్పట్లో పొరుగు జిల్లాకు చెందిన మంత్రి బంధువు ఈ కాంట్రాక్టు పనులు చేపట్టడం, అధికారంలో ఉన్నది ఆ పార్టీయే కావడంతో అధికారులు కూడా వారికి గట్టిగా ఎదురుచెప్పలేని పరిస్థితి నెలకొంది. పైపులైను పనులను కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా చేపట్టడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. జన్నవరం వద్ద పెద్దేరు నది నుంచి నీటిని పైపుల ద్వారా చోడవరం పట్టణంలోని ట్యాంకులకు సరఫరా చేసి ప్రజలకు ఇంటింటికీ తాగునీరు అందించాలన్నది జల్‌జీవన్ మిషన్ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ మేరకు పట్టణంలోని అనేక వీధుల్లోని రోడ్లను తవ్వి మరీ పైపులైన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆరు వేల నివాసాలకు కొళాయి కనెక్షన్లు కూడా ఇచ్చారు. అయినా ఇంటింటికీ వేసిన కొళాయిల ద్వారా నీరు సరిగా రావడం లేదు సరికదా, కొళాయిల నుంచి తరచూ బురదనీరు సరఫరా అవుతోంది. ఇంటింటికీ కొళాయి పేరుతో ఇప్పటికే వీధుల్లో రోడ్లను తవ్వి మరీ పైపులైన్లు వేశారు. తీరా మళ్లీ ఇప్పుడు లీకులంటూ మళ్లీ గోతులు తవ్వుతుండడం, తిరిగి లీకులు సరిచేసి గోతులు కప్పుతుండడంతో రహదారులు అధ్వానంగా తయారై వాహనచోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు.