Share News

పిల్లల ఆస్పత్రి హుళక్కే?

ABN , Publish Date - Mar 18 , 2024 | 01:42 AM

ఆరంభంలో ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించడం...ఆ తరువాత పట్టించుకోకపోవడం వైసీపీ ప్రభుత్వానికి రివాజుగా మారింది.

పిల్లల ఆస్పత్రి హుళక్కే?

ఆర్‌సీడీ ఆస్పత్రిలో ఏర్పాటుకు అధికారుల ప్రతిపాదన

ప్రభుత్వానికి, ఆరోగ్యశాఖకు డీపీఆర్‌ సమర్పణ

రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ఏర్పాటుకు సీఎం ఆదేశం

నాలుగేళ్లు దాటినా ప్రతిపాదన దశ దాటని దుస్థితి

(ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం)

ఆరంభంలో ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించడం...ఆ తరువాత పట్టించుకోకపోవడం వైసీపీ ప్రభుత్వానికి రివాజుగా మారింది. ఈ కోవలోనే జిల్లాలో చిన్నారులకు ప్రత్యేకంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు ప్రక్రియ మూలనపడింది. చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించే ఉద్దేశంతో రాణి చంద్రమణి దేవి ఆస్పత్రి స్థాయిని పెంచేలా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనిపై సానుకూలంగా స్పందించి, డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశించడంతో ఆర్‌సీడీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌, జిల్లా యంత్రాంగం డీపీఆర్‌తోపాటు ఇతర వివరాలను అందించారు. పరిశీలించిన ప్రభుత్వం విశాఖతోపాటు మరో రెండుచోట్ల పీడియాట్రిక్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దాదాపు నాలుగేళ్లు దాటినా అడుగుముందుకు పడలేదు.

ప్రస్తుతం పెదవాల్తేరులోని రాణిచంద్రమణి దేవి ఆస్పత్రి ప్రాంగణంలో చిన్నారులకు సంబంధించిన కొన్నిరకాల సమస్యలకు వైద్య సేవలు అందుతున్నాయి. దీనినే పీడియాట్రిక్‌ ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ప్రభుత్వం కూడా ఇదే ప్రాంగణాన్ని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. ఆచరణ దిశగా అడుగులు వేయకపోవడం గమనార్హం.

రూ.197 కోట్లతో ప్రతిపాదనలు

పీడియాట్రిక్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలంటూ సీఎం ఆదేశించి పలుమార్లు సమీక్ష నిర్వహించారు. విశాఖలో పీడియాట్రిక్‌ ఆస్పత్రి ఏర్పాటుకు రూ.197 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆర్‌సీడీ ఆస్పత్రి 25 ఎకరాల్లో ఉంది. 70 పడకలతో రోగులకు సేవలు అందిస్తున్నారు. పీడియాట్రిక్‌ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తే సుమారు 500 పడకలతో అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఇక్కడ పోలియో, సెరిబ్రల్‌ పాలసీతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు నిర్వహించడంతోపాటు స్పీచ్‌ థెరపీ, ఫిజియోథెరపీ వంటి సేవలు అందిస్తున్నారు. దీనిని పీడియాట్రిక్‌ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌/ అభివృద్ధి చేసినా పీడియాట్రిక్‌ న్యూరో, పీడియాట్రిక్‌ సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ, పీడియాట్రిక్‌ ఫిజియోథెరపీ వంటి అధునాతన శస్త్ర చికిత్స విభాగాలు అందుబాటులోకి వస్తాయి. ఆయా విభాగాలకు సంబంధించిన స్పెషలిస్టు వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని నియమిస్తారు. దీనివల్ల చిన్నారులకు సంబంధించిన వైద్య సేవల్లో ఇదో అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌గా మార్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చే అవకాశాల ముగిసినట్టేనని చెబుతున్నారు. కాగా ఈ ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేయించేందుకు పనిచేసిన ఓ అధికారి కూడా బదిలీపై వెళ్లిపోవడంతో పీడియాట్రిక్‌ ఆస్పత్రి ప్రతిపాదన హుళక్కేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Updated Date - Mar 18 , 2024 | 01:42 AM