Share News

నత్తనడక

ABN , Publish Date - May 27 , 2024 | 12:18 AM

ప్రభుత్వ పెద్దల దన్నుతో ఓ అనధికార కాంట్రాక్టరు హౌసింగ్‌ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు.

నత్తనడక

ఇళ్లనిర్మాణాలపై అధికారుల ఆదేశాలు బేఖాతర్‌...!

నడుపూరు లేఅవుట్‌లో కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యం

పనులు ఊసెత్తని రాక్‌ట్రీ ఇన్‌ఫ్రా సంస్థ

తలలు పట్టుకుంటున్న హౌసింగ్‌ అధికారులు

విశాఖపట్నం/ఉక్కు టౌన్‌షిప్‌, మే 26 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ పెద్దల దన్నుతో ఓ అనధికార కాంట్రాక్టరు హౌసింగ్‌ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల పనులు వేగవంతం చేయాలని గృహనిర్మాణ సంస్థ ఇంజనీర్లు ఫోన్‌ చేస్తున్నా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. దీంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఇందుకు ఉక్కు కర్మాగారం వెనుక ఉన్న నడుపూరు లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలే ఉదాహరణ.

నగరంలో గూడులేని పేదల కోసం శివారు ప్రాంతాల్లో 73 లేఅవుట్లలో రెండేళ్ల కిందట 1.14 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. లబ్ధిదారులు సొంతంగా నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న నిర్మాణ సంస్థలకు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో రాయలసీమకు చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధికి చెందిన రాక్‌ట్రీ ఇన్‌ఫ్రా సంస్థకు సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం, గంగవరం, గాజువాక మండలం నడుపూరు తదితర చోట్ల ఇళ్ల నిర్మాణాల బాధ్యతను అప్పగించారు. ఆది నుంనీ ఈ సంస్థ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. పలుమార్లు హౌసింగ్‌ అధికారులు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో ఇళ్ల నిర్మాణాల సంఖ్యలో కోత వేశారు. అయినా సంస్థ తీరుమారలేదు. పైడివాడ అగ్రహారంలో కొన్నింటిని సబ్‌కాంట్రాక్టరుకు అప్పగించిన రాక్‌ట్రీ ఇన్‌ఫ్రా, నడుపూరులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి.

నడుపూరులోని 160.14 ఎకరాల లేఅవుట్‌లో 6,216ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదించగా, రాక్‌ట్రీ ఇన్‌ఫ్రా సంస్థ తొలుత 4,443 ఇళ్ల నిర్మాణాలకు పునాదులు తీసింది. పనులు చేయడంలో విఫలంకావడంతో అధికారులు అనేకసార్లు హెచ్చరించారు. దీంతో పునాదుల తరువాత అక్కడక్కడా గోడల వరకు నిర్మించారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి 1200 ఇళ్లను ఆర్కాన్‌ అనే సంస్థకు అనధికారికంగా కేటాయించారు. ప్రస్తుతం ఈ సంస్థ నిర్మాణాలను వేగవంతంచేయడంతో లేఅవుట్‌ మొత్తానికి 66 ఇళ్లకు స్లాబులు వేశారు. ఇప్పటివరకు పునాదులు వేసినవి, పలుచోట్ల గోడల వరకు నిర్మాణాలు చేపట్టిన ఇళ్లను పూర్తిచేయాలని రాక్‌ట్రీ సంస్థపై ఒత్తిడి తెచ్చినా పట్టించుకోవడంలేదు. సరికదా ఫోన్‌ చేసినా జవాబు ఇవ్వడం లేదు. వర్షాకాలం ప్రారంభమైతే పనులు సాగడం ఇబ్బంది అవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నా సంస్థ బేఖాతరు చేస్తోందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం హౌసింగ్‌ ఉన్నతాధికారులు నడుపూరు లేఅవుట్‌ను సందర్శించి పనితీరు పరిశీలించారు.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానున్నందున ఇళ్ల నిర్మాణాలు కొనసాగింపులో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరిగినా రాక్‌ట్రీ ఇన్‌ఫ్రా మాత్రం పనులు వేగవంతంచేయడంలో విఫలమవుతోందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 27 , 2024 | 12:18 AM