Share News

అసౌకర్యాల ఆస్పత్రి

ABN , Publish Date - May 27 , 2024 | 11:36 PM

మాడుగుల, చోడవరంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలకు అందుబాటులో ఉండే చోడవరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో కనీస వసతులు లేవు. జనరేటర్‌ లేకపోవడంతో కరెంట్‌ పోతే వైద్య సేవలు నిలిచిపోయినట్టే. ఆర్థోపెడిక్‌ కేసులను అనకాపల్లి లేదా విశాఖ కేజీహెచ్‌కి తరలిస్తున్నారు. ఇక్కడ ఎక్స్‌రే యూనిట్‌ లేకపోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆస్పత్రి అభివృద్ధిపై పాలకులు, అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.

అసౌకర్యాల ఆస్పత్రి
చోడవరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రి

చోడవరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో కనీస వసతులు కరువు

కరెంట్‌ పోతే అంతే సంగతులు

అంబులెన్స్‌ ఉన్నా డ్రైవర్‌ లేక నిరుపయోగం

ఎక్స్‌రే కోసం రోగులు బయటకు వెళ్లాల్సిన దుస్థితి

చోడవరం, మే 27: మాడుగుల, చోడవరంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలకు అందుబాటులో ఉండే చోడవరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో కనీస వసతులు లేవు. జనరేటర్‌ లేకపోవడంతో కరెంట్‌ పోతే వైద్య సేవలు నిలిచిపోయినట్టే. ఆర్థోపెడిక్‌ కేసులను అనకాపల్లి లేదా విశాఖ కేజీహెచ్‌కి తరలిస్తున్నారు. ఇక్కడ ఎక్స్‌రే యూనిట్‌ లేకపోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆస్పత్రి అభివృద్ధిపై పాలకులు, అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.

చోడవరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో 30 పడకలు మాత్రమే ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఈ ఆస్పత్రికి చోడవరం పరిసర మండలాలతో పాటు మాడుగుల నియోజకవర్గం నుంచి కూడా నిత్యం అనేక మంది రోగులు వస్తుంటారు. ఆస్పత్రి రోజువారీ ఓపీ 300 నుంచి 400 మధ్య ఉంటుంది. ఇన్‌పేషెంట్లు సుమారుగా రోజుకి 15 మంది వరకు ఉంటారు. ఆస్పత్రిలో ఒక్క జనరల్‌ సర్జన్‌ పోస్టు మినహా గైనిక్‌, చిన్న పిల్లల నిపుణులతో సహా ఏడుగురు వైద్యులు, సిబ్బంది ఉండడంతో ఈ ఆస్పత్రికి గర్భిణులు, చిన్నపిల్లల తాకిడి ఎక్కువగానే ఉంటుంది.

టీడీపీ హయాంలోనే అభివృద్ధి

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆస్పత్రి ప్రాంగణంలో రూ.2.5 కోట్ల వ్యయంతో కార్పొరేట్‌ స్థాయిలో భవనాలు నిర్మించారు. ఈసీజీ, స్కానింగ్‌, నేత్ర విభాగం, రక్త పరీక్షల విభాగం, గైనిక్‌ వార్డు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిని వంద పడకల స్థాయికి అభివృద్ధి చేస్తామని అధికార పార్టీ నేతలు ప్రకటించినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆస్పత్రికి ఎక్స్‌రే యూనిట్‌ మంజూరై మూడేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఆ యూనిట్‌ను ఏర్పాటు చేయలేదు. దీంతో ఎక్స్‌రే కోసం రోగులు ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లాల్సి వస్తోంది. పక్కనే ఉన్న మాడుగుల నియోజకవర్గంలోని కె.కోటపాడు కమ్యూనిటీ ఆస్పత్రిని 50 పడకలు అప్‌గ్రేడ్‌ చేసిన ప్రభుత్వం, ఎంతో రద్దీగా ఉండే అత్యంత కీలకమైన చోడవరం ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేయకుండా నిర్లక్ష్యం వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఆస్పత్రికి గతంలో ఎంపీ నిధులతో అంబులెన్స్‌ మంజూరైంది. అయితే డ్రైవర్‌ నియామకం చేపట్టకపోవడంతో అది మూలకు చేరింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ ఆస్పత్రికి అన్ని వసతులు సమకూర్చాలని రోగులు కోరుతున్నారు.

Updated Date - May 27 , 2024 | 11:36 PM