Share News

అడ్డగోలుగా లేఅవుట్‌

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:14 AM

జిల్లా కేంద్రం అనకాపల్లి, పరిసరాల్లో భూముల ధరలు గణనీయంగా పెరుగుతుండడంతో ప్రభుత్వ భూములు, స్థలాల ఆక్రమణలు నానాటికీ అధికం అవుతున్నాయి. రాజకీయ పార్టీల నేతల నేతల కనుసన్నల్లో కబ్జాదారులు బరితెగిస్తున్నారు. మరోవైపు వ్యసాయ భూములకు ‘నాలా’ పన్ను చెల్లించకుండానే లేఅవుట్‌లు వేసి ప్లాట్లు అమ్మేస్తున్నారు. రియల్టర్లు మరో అడుగు ముందుకు రహదారులను, సర్వీసు రోడ్లను కబ్జా చేస్తున్నారు.

అడ్డగోలుగా లేఅవుట్‌
జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో నుంచి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లోకి వెళుతున్న లారీ

అనుమతులు లేకుండా వ్యవసాయ భూమిలో వెంచర్‌

పక్కనే వున్న జాతీయ రహదారి సర్వీసు రోడ్డు కబ్జా

హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల కిందా ఇళ్ల స్థలాలు

ఫిర్యాదులు అందినా పట్టించుకోని అధికారులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లా కేంద్రం అనకాపల్లి, పరిసరాల్లో భూముల ధరలు గణనీయంగా పెరుగుతుండడంతో ప్రభుత్వ భూములు, స్థలాల ఆక్రమణలు నానాటికీ అధికం అవుతున్నాయి. రాజకీయ పార్టీల నేతల నేతల కనుసన్నల్లో కబ్జాదారులు బరితెగిస్తున్నారు. మరోవైపు వ్యసాయ భూములకు ‘నాలా’ పన్ను చెల్లించకుండానే లేఅవుట్‌లు వేసి ప్లాట్లు అమ్మేస్తున్నారు. రియల్టర్లు మరో అడుగు ముందుకు రహదారులను, సర్వీసు రోడ్లను కబ్జా చేస్తున్నారు.

అనకాపల్లికి చెందిన ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్‌ పరిధిలోని కొప్పాక రైల్వే వంతెనకు సమీపంలో జాతీయ రహదారికి సమీపంలో ఎటువంటి అనుమతులు పొందకుండా వ్యవసాయ భూముల్లో భారీ వెంచర్‌ వేస్తున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకోవాలంటే సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుని, ‘నాలా’ పన్ను చెల్లించాలి. కానీ ఇక్కడ వెంచర్‌ వేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ‘నాలా’ పన్ను చెల్లించలేదు. దీనిపై జీవీఎంసీ, రెవెన్యూ, వీఎంఆర్‌డీఏ అధికారులతోపాటు కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. కానీ ఇంతవరకు ఏ ఒక్క విభాగం అధికారి కూడా పట్టించుకోలేదు. ‘నాలా’ పన్ను చెల్లింపు గురించి కూడా నోటీసులు జారీ చేయలేదు. దీంతో సదరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మరో అడుగు ముందుకేశారు. లేఅవుట్‌కు సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొనివున్న (రైల్వే వంతెనకు సమీపంలో) సర్వీసు రోడ్డు ఆక్రమించేశారు. లేఅవుట్‌లోకి మట్టి, గ్రావెల్‌, ఇతర సామగ్రిని తరలించడానికి దీనిని వినియోగించుకుంటున్నారు. అంతేకాకుండా ఇతరులు ఎవరూ లోపలికి రాకుండా బండరాళ్లను, మట్టిని రోడ్డుకు అడ్డంగా వేయించారు.

ఇదిలావుండగా అనధికార లేఅవుట్‌ మీదుగా పరవాడ సింహాద్రి ఎన్‌టీపీసీకి చెందిన హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్లు వెళుతున్నాయి. వాస్తవానికి రైతులు గతంలో విద్యుత్‌ లైన్ల కింద, టవర్ల వద్ద భూమిని ఎన్‌టీపీసీకి అప్పగించి పరిహారం పొందారు. ఎన్‌టీపీసీకి చెందిన ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ కానీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి విద్యుత్‌ లైన్ల కింద మట్టిని తోలి లేఅవుట్‌ వేస్తున్నారు. అయినాసరే సంబంధిత శాఖల అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదు.

Updated Date - Dec 27 , 2024 | 12:14 AM