Share News

అంగన్‌వాడీల ఆశలు వమ్ము

ABN , Publish Date - Apr 06 , 2024 | 01:22 AM

గత ఎన్నికల ముందు అంగన్‌వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీలను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మరిచిపోయారు.

అంగన్‌వాడీల ఆశలు వమ్ము

పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చని జగన్‌

తెలంగాణలో కంటే ఎక్కువ వేతనం ఇస్తామన్న వైసీపీ అధినేత

గడిచిన ఐదేళ్లలో ఒకే ఒక్కసారి వేయి రూపాయలు పెంచిన ప్రభుత్వం

ప్రస్తుతం తెలంగాణలో అంగన్‌వాడీ కార్యకర్తకు రూ.13,500, ఆయాకు రూ.9,000

ఇక్కడ రూ.11,500, ఆయాకు రూ.7,000 మాత్రమే...

రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, మినీ సెంటర్లు మెయిన్‌ సెంటర్లుగా మార్పు వంటి డిమాండ్లపైనా దాటవేత

42 రోజులపాటు నిరవధిక సమ్మె చేసిన సిబ్బంది

సమ్మె కాలానికి జీతం చెల్లించని వైనం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి):

గత ఎన్నికల ముందు అంగన్‌వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీలను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మరిచిపోయారు. ముఖ్యంగా తెలంగాణలోని అంగన్‌వాడీ సిబ్బంది కంటే ఎక్కువ వేతనాన్ని చెల్లిస్తామని, ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని పాదయాత్ర సమయంలో ఊరూరా హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని విస్మరించారు. ఒకే ఒక్కసారి మాత్రం వేయి రూపాయల వేతనాన్ని పెంచారు. అయితే తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తామన్న హామీని మాత్రం నెరవేర్చలేకపోయారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ నిరవధిక సమ్మె చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని అంగన్‌వాడీ సిబ్బంది వాపోతున్నారు. జగన్‌ సర్కారు అంగన్‌వాడీ సిబ్బందికి తీరని అన్యాయం చేసిందని, ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను గుర్తించకపోవడం దారుణమని ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేసిన కాలానికి వేతనాలు చెల్లిస్తామని చెప్పిన హామీని కూడా ఇప్పటివరకూ ఈ ప్రభుత్వం అమలు చేయలేదని నగర పరిధిలో పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేసింది.

ఎన్నికల వేళ ఇచ్చిన హామీ

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన జగన్మోహన్‌రెడ్డి...అన్ని వర్గాలకు మాదిరిగానే అంగన్‌వాడీ సిబ్బందికి కూడా పలు హామీలు ఇచ్చారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న అంగన్‌వాడీ సిబ్బందికి అండగా ఉంటానని, పెండింగ్‌ సమస్యలను పరిష్కరించడంతోపాటు తెలంగాణలో కంటే వేయి రూపాయలు వేతనం అదనంగా చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చూపారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.10,500, ఆయాకు రూ.6,000 వేతనంగా చెల్లించేవారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఒకసారి వేయి చొప్పున వేతనాన్ని పెంచారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం కూడా పీఆర్‌సీని అమలు చేయడంతో అక్కడి సిబ్బందికి వేతనాలు పెరిగాయి. ప్రస్తుతం తెలంగాణలో అంగన్‌వాడీ కార్యకర్తకు రూ.13,500, ఆయాకు రూ.9 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. కానీ, ఇక్కడ జగన్‌ ప్రభుత్వం కార్యకర్తకు రూ.11,500, ఆయాకు రూ.7,000 మాత్రమే ఇస్తోంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు వేయి చొప్పున అదనపు వేతనం ఇవ్వాలంటే కార్యకర్తకు రూ.14,500, ఆయాకు రూ.10 వేలు చెల్లించాలి. కానీ, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు.

ఇతర సమస్యలు పట్టని వైనం

ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తానని జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి ఉన్నారు. రిటైర్‌మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంచాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, పని భారాన్ని తగ్గించాలని అంగన్‌వాడీ సిబ్బంది కోరుతున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో గత ఏడాది డిసెంబరు నుంచి సుమారు 42 రోజులపాటు నిరవధిక సమ్మె చేశారు. ఎన్నికల ముందు అంగన్‌వాడీ సిబ్బంది చేస్తున్న సమ్మెతో ఇబ్బంది కలుగుతోందని భావించిన ప్రభుత్వం...సంఘ నాయకులతో చర్చలు జరిపింది. ఈ డిమాండ్లను అమలు చేయడానికి అంగీకరించింది. అయితే, వీటిలో రిటైర్‌మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంచుతూ మాత్రమే జీవో విడుదల చేసింది. మిగిలిన డిమాండ్లకు సంబంధించి జీవోలను విడుదల చేయలేదు. అలాగే సమ్మె కాలానికి సంబంధించిన పూర్తి వేతనాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఆ వేతనాన్ని కూడా ఇప్పటివరకూ విడుదల చేయలేదు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఇప్పటికీ కమిటీని ఏర్పాటు చేయలేదని, తమను నమ్మించి ఈ ప్రభుత్వం మోసం చేసిందంటూ అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షురాలు మణి ఆరోపించారు. అంగన్‌వాడీలను జగన్‌ మోసం చేశారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారని అనకాపల్లి ప్రాంతంలో పని చేస్తున్న ఒక అంగన్‌వాడీ కార్యకర్త ఆవేదన వ్యక్తంచేశారు. సమ్మె సమయంలో అన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు...ఒక్క డిమాండ్‌ను మాత్రమే నెరవేర్చే దిశగా చర్యలు తీసుకున్నారని విశాఖ నగర పరిధిలో పనిచేస్తున్న మరో అంగన్‌వాడీ ఉద్యోగి వాపోయారు. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గర్లో ఉందని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.

ఇచ్చిన హామీలను జగన్‌ అమలు చేయలేదు

- వై.తులసి, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు

అంగన్‌వాడీ సిబ్బందికి జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. వేతనం తెలంగాణలో కంటే వేయి రూపాయలు అదనంగా ఇస్తామన్నారు. అడిగినా ప్రభుత్వం స్పందించలేదు. ఇతర సమస్యలను పట్టించుకోలేదు. అందుకే నిరవధిక సమ్మెకు దిగాం. సమ్మె చేస్తున్న తమతో చర్చలు జరిపిన ప్రభుత్వ పెద్దలు...అప్పుడు ఇచ్చిన హామీలను ఇప్పటివరకూ అమలు చేయలేదు. సమ్మె కాలానికి జీతం చెల్లించలేదు. ఇతర హామీలకు సంబంధించిన జీవోలు విడుదల చేయలేదు. అంగన్‌వాడీలకు న్యాయం చేయాలి.

Updated Date - Apr 06 , 2024 | 01:22 AM