Share News

పంపకాలపైనే ఆశ!

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:59 AM

క్షేత్రస్థాయిలో ఈసారి పరిస్థితులు తమకు ఏమాత్రం అనుకూలంగా లేవని గ్రహించిన వైసీపీ నాయకులు... ఏదోవిధంగా ఎన్నికల్లో నెగ్గాలని రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు.

పంపకాలపైనే ఆశ!

ఓటర్లను ప్రలోభ పెడుతున్న వైసీపీ నాయకులు

ఇప్పటికే దుస్తులు, కుక్కర్లు పంపిణీ

తాజాగా నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఐప్యాక్‌ బృందాలు భేటీ

తాయిలాల పంపిణీపై దిశానిర్దేశం

ఇప్పటి నుంచే వార్డులకు నగదు తరలించుకోవాలని సూచన

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

క్షేత్రస్థాయిలో ఈసారి పరిస్థితులు తమకు ఏమాత్రం అనుకూలంగా లేవని గ్రహించిన వైసీపీ నాయకులు... ఏదోవిధంగా ఎన్నికల్లో నెగ్గాలని రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ఒకవైపు సోషల్‌ మీడియా ద్వారా విపక్షాలపై బురదజల్లే కార్యక్రమం కొనసాగిస్తూ, మరోవైపు ప్రత్యక్షంగా ఓటర్లను కలిసి తాయిలాలు పంచడం మొదలెట్టారు. ఈ విషయంలో నియోజకవర్గాల సమన్వయకర్తలకు ఐప్యాక్‌ బృందాలు దిశానిర్దేశం చేస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికలకు నేడో, రేపో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారనే దానిపై చాలావరకూ స్పష్టత వచ్చినప్పటికీ, కొన్ని స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదిలావుండగా వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై అన్నివర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు సర్వేల్లో వెల్లడవుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ తరఫున పోటీకి దిగుతున్న అభ్యర్థులు కూడా గుర్తించారు. దీనిపై వైసీపీ అధిష్ఠానానికి కూడా స్పష్టత ఉండడంతో నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు / అభ్యర్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతోపాటు, విజయం సాధించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణను రూపొందించే బాధ్యతను ఐప్యాక్‌ బృందాలకు అప్పగించింది.

తాయిలాలతో సిద్ధం

ఇంతకాలం నియోజకవర్గాల వారీగా సేకరించిన సమాచారం ఆధారంగా ఏ అభ్యర్థి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, లోటుపాట్లు, వాటిని ఎలా అధిగమించాలనే దానిపై ఐప్యాక్‌ ప్రతి నియోజకవర్గానికి ఒక నివేదిక తయారుచేసింది. ఎన్నికలకు పెద్దగా సమయం లేనందున ఇప్పటినుంచే కార్యాచరణ అమలుకు అభ్యర్థులను సమాయత్తం చేసే పనిలో ఐప్యాక్‌ బృందం నిమగ్నమైంది. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా నియోజకవర్గాల వారీగా అభ్యర్థులతో భేటీ అవుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఏయే వర్గాలను ఆకట్టుకోవాలి, అందుకోసం ఏంచేయాలి, కులాల వారీగా ఎన్ని ఓట్లున్నాయి, వారిని ఆకటుకునేందుకు ఎలాంటి మార్గాలు అనుసరించాలనే దానిపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతి నియోజకవర్గం పరిధిలోనూ మహిళా ఓటర్లకు చీరలు, కుక్కర్లు పంపిణీ చేసినప్పటికీ, నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత నగదు/బహుమతులు నేరుగా అందజేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తెలిసింది.

వలంటీర్లకు కీలక పాత్ర

ఓటర్లకు తాయిలాల పంపిణీకి వలంటీర్లను పెద్దఎత్తున వినియోగించుకోవాలని ఐప్యాక్‌ బృందాలు నేతలకు స్పష్టం చేసినట్టు సమాచారం. వారి ద్వారా కచ్చితంగా పక్కాగా పని జరుగుతుందని, యూసీడీ సిబ్బంది సహకారం కూడా తీసుకోవాలని సూచించారని చెబుతున్నారు. అంతేకాకుండా పార్టీలో బాగా నమ్మకస్తుల ద్వారా బహుమతులు, డబ్బు పంపిణీ చేపట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించినట్టు సమాచారం. షెడ్యూల్‌ విడుదలైన తర్వాత పోలీసు తనిఖీలు, ప్రతిపక్షాల నిఘా ఉంటుందని, ఈ నేపథ్యంలో పంపిణీకి సంబంధించిన నగదు/బహుమతులను ఇప్పటినుంచే వార్డులకు తరలించాలని కూడా నిర్దేశించారని కొందరు వైసీపీ నేతలే చెబుతున్నారు. ఐప్యాక్‌ బృందాల ఆదేశాలు, సూచనల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులు ఓటర్లకు తాయిలాల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నట్టు సమాచారం. ఆత్మీయ సమావేశాల పేరిట తాయిలాలు పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసింది.

Updated Date - Mar 16 , 2024 | 12:59 AM