Share News

అంబరానంటిన హోలీ సంబరం

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:24 AM

మండలంలోని తాజంగి పంచాయతీ బీటాలైన్‌ రాధాకృష్ణ ఆలయం ప్రాంగణంలో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. తాజంగి పంచాయతీ పరిసర ప్రజలు ప్రతి ఏటా రాధాకృష్ణ ఆలయం ఎదుట 60 అడుగుల ఎత్తు కలిగిన హోలీ కర్రల పోగును కాల్చడం ఆనవాయితీగా వస్తున్నది.

అంబరానంటిన హోలీ సంబరం
హోలీ సందర్భంగా భక్తులు ఏర్పాటు చేసిన కర్రల పోగు కాలుతున్న దృశ్యం

తాజంగి బీటాలైన్‌లో సందడి

60 అడుగుల కర్రల పోగు దహనం

చింతపల్లి, మార్చి 25: మండలంలోని తాజంగి పంచాయతీ బీటాలైన్‌ రాధాకృష్ణ ఆలయం ప్రాంగణంలో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. తాజంగి పంచాయతీ పరిసర ప్రజలు ప్రతి ఏటా రాధాకృష్ణ ఆలయం ఎదుట 60 అడుగుల ఎత్తు కలిగిన హోలీ కర్రల పోగును కాల్చడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఏడాదికి కూడా వారం రోజులపాటు స్థానిక ప్రజలు శ్రమించి ఈ కర్రల పోగును ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. అదే రోజు రాత్రి డ్యాన్స్‌ హంగామా సాంస్కృతిక కార్యక్రమాన్ని భక్తుల కోసం ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కర్రల పోగుకు నిప్పుపెట్టారు. ఉదయం ఆరు గంటల వరకు ఈ కర్రల పోగు కాలుతూ కనిపించింది. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

జెండా పట్టుకున్న యువకులు

కర్రల పోగుపైన ఏర్పాటుచేసిన జెండాను ముంచంగిపుట్టు మండలం వనుగుమ్మ గ్రామ పంచాయతీకి చెందిన గొల్లోరి రాము, రాజేంద్రపాలెం గ్రామానికి చెందిన వంతల శ్రీను అనే యువకులు పట్టుకున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి జెండాను పట్టుకునేందుకు కర్రల పోగు చుట్టూ యువకులు, పెద్దలు చేరుకున్నారు. ఉదయం ఐదున్నర గంటలకు కర్రలపోగు నుంచి జెండా వేరు అయ్యి ఉత్తర దిక్కున పడింది. ఈ జెండాను గొల్లోరి రాము, వంతల శ్రీను పట్టుకోవడంతో వారిని ఆలయ కమిటీ శాలువాతో సన్మానించి రూ.1116 నగదును అందజేసింది. అలాగే తాజంగి పొలిమేర వరకు వారిని ఆలయ కమిటీ ఊరేగింపుగా తీసుకొచ్చింది. రానున్న ఖరీఫ్‌లో వివిధ పంటల నాట్లును జెండా పట్టుకున్న యువకులతో స్థానిక గిరిజనులు మొదటిగా వేయిస్తారు. ఈ ఉత్సవంలో ఎంపీపీ కోరాబు అనుషదేవి, సర్పంచ్‌ వంతల మహేశ్వరరావు, అర్చకులు సీసా నీలకంఠం, ఉత్సవ కమిటీ సభ్యులు బాబూరావు, సదాశివ, రాజరావు, శ్రీరామ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:24 AM